కష్టాల్లో ఉన్నాం.. పరిహారం ఇప్పించి ఆదుకోండి!
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా తేల్చినా.. అంతకుముందు తమ కుటుంబానికి వారు ఇస్తానన్న రూ.10 లక్షల నష్ట పరిహారం ఇప్పటివరకూ అందలేదని ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నురాల్లాహ్ మహబూబ్ షరిఫ్ భార్య కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని.. భర్తను కోల్పోయిన తరువాత చాలానే కష్టాలను చవిచూడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొంది. నిత్యవసరాలతో పాటు పిల్లల విద్యకు సంబంధించి లెక్కకు మించిన ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది.
'భర్త చనిపోయిన తరువాత కుటుంబాన్ని పెంచడం భారంగా మారింది. గతంలో రూ. పది లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరిహారం ఇచ్చినా కుటంబ అవసరాలు తీరవు. నా కుమారుడికి ఒక ఓ ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి' అంటూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో బాధిత మహిళ పేర్కొంది.
2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ దోషేనని ముంబై సెషన్స్ కోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మరణానికి కారణమయ్యాడని సల్మాన్‌పై నమోదైన అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. ప్రమాద సమయంలో కారు నడుపుతోంది తన డ్రైవర్ అశోక్‌సింగ్ అన్న సల్మాన్ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో సల్మాన్ కు ఐదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.