mumbai sessions court
-
వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ
సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ ‘మీటూ ఉద్యమం’లో భాగంగా రచయిత, నిర్మాత వింటానందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలోక్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటానందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే, వింటా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అలోక్‌పై కేసు నమోదు చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు అలోక్‌కి శనివారం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. (ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు) కోర్టు ఏమన్నదంటే.. తనపై అఘాయిత్యం జరిగినప్పుడు స్వీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వింటానందా నాడు నోరు మెదపలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అలోక్‌ను ఈ కేసులో తప్పుగా ఇరికించారనే వాదనలను కొట్టిపారేయలేమని చెప్పింది. 19 ఏళ్లక్రితం తనపై అత్యాచారం జరిగిందనీ, అప్పడు అలోక్ పెద్ద నటుడు అయినందున భయపడి నోరుమెదపలేదనే నందా ఆరోపణల్లో పస లేదని కోర్టు తేల్చింది. ‘ఆమె చెప్పిన కథ నమ్మశక్యంగా లేదు. అలోక్‌ను నిందితుడిగా పేర్కొనడానికి వింటా దగ్గర సరైన ఆధారాలు లేవనిపిస్తోంది. సంఘటన వివరాలన్నీ చెప్తున్న బాధితురాలు దాడి జరిగిన తేదీ లేదా సంవత్సరం మాత్రం చెప్పడం లేదు. అత్యాచారం జరిగింది తన ఇంట్లోనే అని నందా చెప్తోంది. అటువంటప్పుడు ఘటనకు సంబంధించిన ఆధారాలు నాశనమయ్యే వీలేలేదు’ అని కోర్టు అభిప్రాయపడింది. నందా ఇంటివైపు అలోక్ వెళ్లొద్దనీ, ఈ కేసుతో సంబంధమున్న వారిని బెదిరించడం, లంచాలు ఇవ్వడం వంటివి చేయొద్దని కోర్టు ఆంక్షలు విధించింది. -
సల్మాన్ ఖాన్‌పై వారెంట్.. కొట్టివేత
సాక్షి, ముంబై : బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో దాఖలు చేసిన వారెంట్‌ను ముంబై సెషన్స్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఆదేశాలనుసారం సల్మాన్ వ్యవహరించకపోవటంతో ఈ నెల 4వ తేదీన కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. అయితే శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. ఆ ప్రక్రియను పూర్తి చేశారు. షూరిటీ ప్రక్రియ.. హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు షూరిటీని సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరో కొత్త షూరిటీ పేరుతో రెన్యువల్ చేయాల్సి ఉంది. దీంతో సల్మాన్ తన బాడీగార్డ్ గుర్మీత్‌సింగ్ జోలీ అలియాస్ షేరా పేరును కోర్టుకు సమర్పించాడు. అయితే అందుకు సంబంధించిన అధికార ప్రక్రియను మాత్రం సల్మాన్ పూర్తి చేయలేదు. దీంతో ఏప్రిల్ 4న సెషన్స్ కోర్టు సల్మాన్‌కు బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. దీనిపై సల్మాన్ కోర్టును అభ్యర్థించటంతో ఏప్రిల్ 11న దానిపై స్టే విధిస్తూ.. షూరిటీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏప్రిల్ 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. షేరాతో ఆ ఫామ్‌లపై సంతకాలు చేయించాడు. దీంతో కోర్టు వారెంట్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హిట్ అండ్ రన్ కేసు నేపథ్యం... 2002లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి సల్మాన్ తన కారును పోనివ్వటంతో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 13 ఏళ్ల విచారణ తర్వాత బాంబే సెషన్స్ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ మే 2015లో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 2015లో కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... అది పెండింగ్‌లో ఉంది. -
ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్
ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. ఈ కేసు విషయంలో సల్మాన్ వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఆ రోజు రాత్రి కారును నడపలేదని, డ్రైవరే కారును నడపినట్టు తెలిపాడు. కారు డ్రైవర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేయలేదని చెప్పాడు. కాగా, 2002లో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారిపై నుంచి సల్మాన్ కారు నడపడంతో ఒ వ్యక్తి మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మద్యం సేవించాడని రుజువైన కారణంగా ముంబై సెషన్స్ కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
కష్టాల్లో ఉన్నాం.. పరిహారం ఇప్పించి ఆదుకోండి!
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా తేల్చినా.. అంతకుముందు తమ కుటుంబానికి వారు ఇస్తానన్న రూ.10 లక్షల నష్ట పరిహారం ఇప్పటివరకూ అందలేదని ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నురాల్లాహ్ మహబూబ్ షరిఫ్ భార్య కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని.. భర్తను కోల్పోయిన తరువాత చాలానే కష్టాలను చవిచూడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొంది. నిత్యవసరాలతో పాటు పిల్లల విద్యకు సంబంధించి లెక్కకు మించిన ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది. 'భర్త చనిపోయిన తరువాత కుటుంబాన్ని పెంచడం భారంగా మారింది. గతంలో రూ. పది లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరిహారం ఇచ్చినా కుటంబ అవసరాలు తీరవు. నా కుమారుడికి ఒక ఓ ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి' అంటూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో బాధిత మహిళ పేర్కొంది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ దోషేనని ముంబై సెషన్స్ కోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మరణానికి కారణమయ్యాడని సల్మాన్‌పై నమోదైన అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. ప్రమాద సమయంలో కారు నడుపుతోంది తన డ్రైవర్ అశోక్‌సింగ్ అన్న సల్మాన్ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో సల్మాన్ కు ఐదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. -
సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
‘హిట్ అండ్ రన్’ కేసులో శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు {పమాద సమయంలో సల్మాన్ తాగి కారు నడిపాడని స్పష్టం చేసిన కోర్టు డ్రైవర్ కారు నడిపాడన్న వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం శిక్ష ఖరారు కాగానే కోర్టు హాల్లోనే కన్నీటి పర్యంతమైన బాలీవుడ్ స్టార్ హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్; ఈ నెల 8 వరకు బెయిల్ మంజూరు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ! 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో ఆయన దోషేనని ముంబై సెషన్స్ కోర్టు తేల్చింది. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మరణానికి కారణమయ్యాడని సల్మాన్‌పై నమోదైన అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. ప్రమాద సమయంలో కారు నడుపుతోంది తన డ్రైవర్ అశోక్‌సింగ్ అన్న సల్మాన్ వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు. కోర్టు తీర్పుతో సల్మాన్ న్యాయస్థానం హాల్లోనే కన్నీటిపర్యంతమయ్యాడు. తీర్పు వెలువడగానే సల్మాన్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆయనకు రెండ్రోజుల ఊరట లభించింది. తీర్పు సమగ్ర కాపీని నిందితుడికి ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ మే 8 వరకు సల్మాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్(49)కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు తీర్పు వెలువడిన తక్షణమే హైకోర్టును ఆశ్రయించడంతో.. బొంబాయి హైకోర్టు సల్మాన్‌కు మే 8 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయనకు వెంటనే జైలుకెళ్లాల్సిన పరిస్థితి తప్పింది. కోర్టు హాల్లో.. దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్న ఈ కేసు తీర్పు బుధవారం ఉదయం 11.15 గంటలకు వెలువరించనుండటంతో దక్షిణ ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు వెలువడనున్న కోర్టులోని రూం నంబర్ 52 మీడియా, పోలీసులు, న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన సల్మాన్ అభిమానులంతా కోర్టు లోపలికి అనుమతి లేకపోవడంతో బయటే ఉండిపోయారు.జడ్జి రావడానికి కొద్ది నిమిషాల ముందు లైట్ బ్లూ జీన్స్, వైట్ షర్ట్‌లో సల్మాన్ కోర్టు హాల్లోకి వచ్చారు. తీర్పు ఏంటి? సెషన్స్ కోర్టు జడ్జి డీడబ్ల్యూ దేశ్‌పాండే తీర్పును వెలువరిస్తూ.. ‘మీపై నమోదైన ఆరోపణలన్నీ రుజువయ్యాయి. ప్రమాదకరంగా డ్రైవ్‌చేసి ఒక వ్యక్తి మరణానికి మీరు కారణమయ్యారని కోర్టు విశ్వసిస్తోంది. ప్రమాద సమయంలో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని మీరే డ్రైవ్ చేస్తున్నారని, అప్పుడు మీరు మద్యం మత్తులో ఉన్నారని, ఆ సమయానికి మీకు డ్రైవింగ్ లెసైన్సూ లేదని కోర్టు నమ్ముతోంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి.. ప్రమాదంలో కాకుండా, ప్రమాదం అనంతరం వాహనాన్ని క్రేన్‌తో పైకి లేపుతుండగా, అది ప్రమాదవశాత్తూ కిందపడటంతో చనిపోయాడన్న డిఫెన్స్ వాదనను మేం అంగీకరించడం లేదు. ప్రమాద సమయంలో వాహనాన్ని డ్రైవ్ చేస్తోంది మీ డ్రైవర్ అశోక్ సింగ్ అన్న వాదన నూ తోసిపుచ్చుతున్నాం. తీర్పుపై మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. సల్మాన్ స్పందన ► ‘ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తోంది నేను కాదు. ఈ విషయాన్నే మరోసారి మీకు స్పష్టం చేయాలనుకుంటున్నా. ఏదేమైనా, మీ తీర్పును గౌరవిస్తున్నా. ఆమోదిస్తున్నా. నా తరఫున నా లాయర్ మాట్లాడతారు’ ► తీర్పును వింటున్నంతసేపు ఉద్వేగాన్ని, కన్నీళ్లను ఆపుకునేందుకు సల్మాన్ విఫలయత్నం చేశారు. ఆ సమయంలో సల్మాన్ పక్కన సల్మాన్‌తో పాటు ఆయన సోదరులు అర్బాజ్ ఖాన్, సొహైల్ ఖాన్, చెల్లెళ్లు అర్పిత, అల్వీరా, ప్రైవేట్ బాడీగార్డ్ షేరా ఉన్నారు. ► తీర్పు సమయంలో అలిస్టర్ పెరీరా, సంజీవ్ నందాల బీఎండబ్ల్యూ కేసులతో ఈ కేసును న్యాయమూర్తి దేశ్‌పాండే పోల్చారు. తీర్పునకు ముందు ఇరుపక్షాల విజ్ఞప్తులు ►‘ఇలాంటి చర్యలను తీవ్రంగా తీసుకుంటామన్న సందేశం సమాజానికి వెళ్లాలి. అందువల్ల సల్మాన్‌కు కఠిన శిక్ష విధించాలి. సల్మాన్ చెప్పినట్లుగా ఇది దైవఘటన కాదు. ఇది చాలా తీవ్రమైన నేరం. అందువల్ల గరిష్ట శిక్ష విధించాలని కోరుతున్నా’ - ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ ►‘బాధితుల కోసం 2002లోనే రూ. 19 లక్షలను సల్మాన్ డిపాజిట్ చేశారు. సల్మాన్ ఫౌండేషన్‌ను, బీయింగ్ హ్యూమన్ ఎన్జీఓను స్థాపించి పెద్దఎత్తున సమాజ సేవ చేస్తున్నారు. అంతేకాకుండా తీవ్రమైన నరాల వ్యాధితో బాధపడుతున్నారు. సరైన వైద్యం, జాగ్రత్తలు తీసుకోకపోతే అది సీరియస్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తీర్పు ప్రకటించాలి’ - సల్మాన్ లాయర్ శ్రీకాంత్ శివాడే (తన నరాల సంబంధిత వ్యాధి గురించి చెబుతున్న ప్పుడు ఆ ప్రస్తావన వద్దంటూ తన లాయర్‌కు సల్మాన్ సైగలు చేశారు) వెంటాడుతున్న ‘జింకలు’ 1998లో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 2006లో జోధ్‌పూర్‌లో వారంపాటు జైల్లో గడిపి, బెయిల్‌పై విడుదలయ్యారు. ఇందులో దోషిగా తేలితే గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష పడొచ్చు. నేరం శిక్ష ► ఐపీసీ సెక్షన్ 304(2)- ఉద్దేశపూర్వకం కాని హత్యానేరంకింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 25 వేల జరిమానా ► ఐపీసీ సెక్షన్లు 279 (వేగవంతమైన నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్) 337, 338 (ఇతరుల ప్రాణాలకు, వ్యక్తిగత ఆస్తులకు నష్టం కలిగేలా వ్యవహరించడం)-వీటి కింద ఆరునెలల జైలు శిక్ష. ► మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 181 (లెసైన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం), సెక్షన్ 185 (మోతాదు మించి మద్యం తాగి వాహనం నడపడం(డ్రంకన్ డ్రైవ్). ఈ నేరాల కింద ఆరు నెలల శిక్ష. ► బాంబే ప్రొహిబిషన్ యాక్ట్‌లోని 66(ఏ) (బీ) సెక్షన్ల కింద రెండు నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా. ► పై శిక్షలన్నీ ఒకే సమయంలో అమలవుతాయి. హైకోర్టుకు అపీల్ తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ న్యాయవాదులు తీర్పును సవాలు చేస్తూ, తీర్పుపై స్టే ఇవ్వాలంటూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు కేవలం శిక్షకు సంబంధించిన 2 పేజీల ఆపరేటివ్ పార్ట్‌ను మాత్రమే నిందితుడికి ఇచ్చిందని, శిక్షలు, అందుకు కారణాలు.. తదితరాలతో కూడిన సమగ్ర తీర్పు కాపీ ఇవ్వలేదని.. అందువల్ల ఆ కాపీ అందేవరకు తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని సల్మాన్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. సాల్వే వాదనతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ థిప్సే.. సల్మాన్‌కు 48 గంటల పాటు అంటే ఈ నెల 8 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శిక్షకు సంబంధించిన తీర్పు తుది కాపీ సిద్ధం కాకుండానే తీర్పు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. మే 8న కేసుకు సంబంధించిన వాదనలు ప్రారంభమవుతాయన్నారు. 13 సంవత్సరాలు ప్రమాదం జరిగిన సెప్టెంబర్ 28, 2002 నుంచి మే 6, 2015 వరకు సాగిన విచారణ కాలం 200 - 250 కోట్ల రూపాయలు సల్మాన్ హీరోగా నిర్మితమవుతున్న సినీ ప్రాజెక్టుల వ్యయం. వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. -
'శక్తిమిల్స్' రేపిస్టులకు మరణశిక్ష
ముంబై: ముంబైలోని శక్తిమిల్స్‌లో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు దోషులకు స్థానిక సెషన్స్‌కోర్టు మరణశిక్ష విధించింది. విజయ్ జాదవ్ (19), కాసిమ్ బెంగాలి (21), మహమ్మద్ సలీమ్ అన్సారీలను(28)లకు ఉరిశిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలిని ఫన్సల్కర్ జోషి శుక్రవారం తీర్పుచెప్పారు. ఈ ముగ్గురిని కోర్టు నిన్న దోషులుగా నిర్ధారించింది. కాగా ఈ ముగ్గురు నిందితులకు ఓ టెలిఫోన్ ఆపరేటర్‌పై అత్యాచారానికి పాల్పడినందుకు ఇప్పటికే యావజ్జీవ శిక్ష పడింది. పాడుపడిన శక్తిమిల్స్‌లోనే ఈ నిందితులు గత ఏడాది జూలైలో ఓ 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే ఏడాది ఆగస్టు 22న శక్తిమిల్స్ ఆవరణలోనే 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. -
'శక్తిమిల్స్' రేపిస్టులకు మరణశిక్ష
-
సల్మాన్ కేసులో పునర్విచారణకు కోర్టు ఆదేశం
ముంబై: పదకొండేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి మరణానికి కారణమయ్యారన్న (హిట్ అండ్ రన్) కేసులో పునర్విచారణ జరపాలని ముంబై సెషన్స్ కోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసులో తాజా విచారణ చేపట్టాలని, సాక్ష్యాలను, ఆధారాలను పునఃసమీక్షించాలని చెప్పింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో తాజాగా విచారణ ప్రారంభంకానుంది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ ఖాన్ నడుపుతున్న కారు బాంద్రాలో బేకరి వద్ద ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. కేసు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. -
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కు ఊరట
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు ముంబై సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. 11 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు యాక్సిడెంట్ కేసు (హిట్ అండ్ రన్)ను మళ్లీ కొత్తగా విచారించాలన్న సల్మాన్ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. సెషన్స్ కోర్టు జడ్జి డీ డబ్ల్యూ దేశ్‌పాండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో సాక్షులందరినీ మళ్లీ విచారించాలని ఆదేశించారు. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో సల్మాన్ ఖాన్ నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు ఆరోపణలు వచ్చాయి. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ముంబై పోలీసులు సల్మాన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మెజిస్టీరియల్ కోర్టులో విచారించారు. అతనికి వ్యతిరేకంగా సాక్షాలున్నాయని, నేరం రుజువైతే పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసును మళ్లీ విచారించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. -
నత్తనడకన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
ముంబై: నగరంలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నింపాదిగా నడుస్తున్నాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు వేగంగా విచారించి తీర్పును వెలువరించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు తమ లక్ష్యాన్ని చేరువ కాలేకపోతున్నాయి. ముంబై సెషన్స్ కోర్టులో సుమారు 100 ఫాస్ట్‌ట్రాక్ కేసుల తీర్పు వెలువరించాల్సి ఉంది. ఫాస్ట్ ట్రాక్ కేసులన్నీ నింపాదిగా నడుస్తున్నాయని సెషన్స్ కోర్టులోని న్యాయవాదులు మండిపడుతున్నారు. ‘జీవితఖైదు విధించాల్సిన హత్య కేసులు సెషన్స్ కోర్టులో విచారణకు రావడం లేదు. ఇప్పుడు అన్ని కేసులు వస్తున్నాయి. అయితే ఏ కేసు విచారణ నిర్ధిష్ట కాలపరిమితిలోగా జరగడం లేద’ని ఆరు ఫాస్ట్‌ట్రాక్ కేసులను వాదిస్తున్న షరీఫ్ షేక్ తెలిపారు. తాను వాదిస్తున్న అనేక ఫాస్ట్‌ట్రాక్ కేసుల్లో సాక్ష్యాల నమోదు పూర్తి కాలేదన్నారు. ఇందులో రెండేళ్ల క్రితం నాటి కేసులున్నాయని, అవన్నీ అభియెగాల నమోదు స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. అయితే సీనియర్ న్యాయవాది రోహిని సైలాన్ మరో రకమైన వాదన వినిపిస్తున్నారు. ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అవసరం లేదని, ప్రతి కేసును సమానంగానే చూడాలని అన్నారు. ‘ఫాస్ట్ ట్రాక్ కేసులు ఆలస్యమవుతున్నాయంటే అది కోర్టు తప్పు కాదు. సంబంధిత కేసులో నిందితులు, సాక్షులు, డిఫెన్స్ లాయర్లు హాజరుకాకపోవటం వల్ల విచారణ ఆలస్యమవుతుంద’ని సైలాన్ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 100కు పైగా కేసులు ఉన్నాయని న్యాయవాది నీలిమా కస్తూరే అన్నారు. అయితే ఈ కోర్టులు ఉపకరిస్తాయని తాననుకోవడం లేదని తెలిపారు. దీనివల్ల ఫాస్ట్‌ట్రాక్ కాని ఇతర కేసుల విచారణపై ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు.