విజయానందం.. ఏకే47తో గాల్లోకి కాల్పులు
రాజకీయ నాయకులకు ఉత్సాహం వచ్చిందంటే పట్టలేం. తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఇలాగే జరిగింది. పీడీపీ తరఫున పోటీచేసి.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను సోనావార్ స్థానం నుంచి ఓడించిన అష్రఫ్ మీర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తన విజయ సంబరాల్లో ఏకంగా ఏకే 47 తుపాకి తీసుకుని.. గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన ఇంటి ఎదుట మద్దతుదారులు గుమిగూడి.. మీర్‌ను అభినందించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒమర్ అబ్దుల్లాను 4వేల ఓట్ల తేడాతో ఓడించడంతో కాశ్మీర్లో ఇప్పుడు ఆయనను అంతా జెయింట్ కిల్లర్ అంటున్నారు.
అయితే.. ఇప్పుడు ఆయన కాల్పులు జరిపిన ఏకే 47 తుపాకి ఆయనదేనా, లేక భద్రతా సిబ్బందిదా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. తాను గెలిచి తీరుతానన్న నమ్మకం ముందునుంచి తనకుందని, ఒమర్ అబ్దుల్లా తన శక్తి మేరకు ప్రయత్నిస్తే.. తాను తన శక్తి మేరకు ప్రయత్నించానని గెలిచిన తర్వాత అష్రఫ్ మీర్ చెప్పారు. 15 ఏళ్లుగా ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ రాజ్యమేలుతున్నా.. తాము గెలిచి చూపించామని తెలిపారు.