ashwaraopeta
-
దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్కు పొంగులేటి సవాల్..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సొంతపార్టీ బీఆర్ఎస్పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు. వైరా నియోజకవర్గంలో తన అనుచరులను సస్పెండ్ చేయడంపై ఘాటుగా స్పందించారు. సస్పెండ్ చేయాల్సి వస్తే తనను చేయాలి గానీ, తన అనుచరులను కాదని ధ్వజమెత్తారు. తనను ఎప్పుడు సస్పెండ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. తనను కాకుల్లా , గద్దల్లా పొడుచుకు తినాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 'రాష్ట్రంలో గ్రామ పంచాయితీలలో మహిళా సర్పంచ్‌లు మెడలో తాళిబొట్టు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్న దుస్థితి లో ఉన్నాం. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ ధనిక రాష్ట్రాన్ని నిరుపేద రాష్ట్రంగా మార్చేశారు. ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు , మున్సిపాలిటీకు రూ.20 లక్షలు ఇస్తాం అని చెప్పి ఎక్కడా నిధులు ఇవ్వకుండా సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి శ్రీనన్న గురించి కాంట్రాక్టుల గురుంచి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు వెయ్యి కొట్లా, రెండు వేల కొట్లా?? వర్కులు ఇచ్చి ఉంటే చర్చలకు నేను సిద్ధం. ఎవ్వరికి ఎంత ఇచ్చారో ఎవ్వరికి ఎంత లాభం చేకూరిందో లెక్కలేంటో నేను చూపిస్తా. మన బాగోతం ఏమిటో మనకు తెలియంది కాదు. నిన్న వైరాలో నాకు అండగా ఉన్న కొంతమందిని సస్పెండ్ చేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను సస్పెండ్ చేయాలి.' అని పొంగులేటి సవాల్ చేశారు. 'కళ్ళు ఉండి కాబోధిలా శ్రీనన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా లేదా అనేది చూడాల్సింది మీరు. మొన్నటి వరకు ప్రతి ఫ్లెక్సీలో నా ఫోటో వాడుకున్నారు. మీరు ప్రజా ప్రతినిధి కావడానికి నన్ను వాడుకున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనన్న ఒక్కడే కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే బుద్ది చెప్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఎలా సాధించుకున్నామో గుర్తుంచుకోవాలి. అధికారులు అందరికీ ఒకటే హెచ్చరిక. అధికారం ఎవడబ్బా సొత్తు కాదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఆ స్థాయి కి రావడానికి ఏమి ఇచ్చుకున్నారో మీరే ఆలోచించుకోండి. అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు, ఎవ్వరినైనా ఇబ్బంది పెడితే వడ్డీ కాదు చక్ర వడ్డీ తో తీరుస్తా. అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జారే ఆదినారాయణను నిలబెడుతున్నాను.' అని పొంగులేటి ప్రకటించారు. చదవండి: తెలంగాణ బడ్జెట్‌పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ -
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరాడు. దీంతో టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో టీడీపీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక బులిటెన్ వెలువడనుంది. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా సమావేశమయ్యారు. తాజాగా టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మెచ్చా ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి లేఖ అందించారు. అనంతరం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్తో కలిసి ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తీసుకొచ్చారు. స్పీకర్‌ను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల మెడలో గులాబీ కండువా ఉండడం విశేషం. వారిద్దరి రాకతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది. చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
కొత్తగూడెం యువతికి కరోనా పాజిటివ్
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో తొలి కరోనా వైరస్ నమోదు కావడం కలకలం రేపింది. అశ్వారావుపేట మండలానికి చెందిన స్నేహ అనే యువతికి కరోనా పాజిటివ్ వచ్చిన వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువతిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన యువతి ఇటలీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మణుగూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా తగ్గక పోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్‌ఉన్నట్లు తేల్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా ఆ యువతి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. -
అశ్వరావుపేటలో యువహీరో సందడి!
అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో యువ హీరో నాగశౌర్య సందడి చేశాడు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుములకు చెందిన ఓ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించడానికి ఆయన శనివారం పట్టణానికి విచ్చేశాడు. నాగశౌర్య వచ్చిన విషయం తెలియడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కాసేపు ఇక్కడ కోలాహలం నెలకొంది. వరుస సినిమాలతో నాగశౌర్య తన అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్చుతానంద', 'ఒక మనస్సు' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'జ్యో అచ్చుతానంద' చిత్ర విజయంతో కాసింత విరామం తీసుకున్న నాగశౌర్య ప్రస్తుతం కొత్త దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.