నా భర్తను విడిచిపెట్టండి
పిల్లలు, అత్తమామలతో ఏఎస్పీకార్యాలయానికి వచ్చిన బాధిత మహిళ
నర్సీపట్నం: పోలీసులు అదుపులోకి తీసుకున్న తన భర్తను విడిచిపెట్టాలని కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ శివారు దబ్బలంకకు చెందిన గెమ్మిలి చిలకమ్మ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసింది. మూడు వారాల క్రితం వాయిదా నిమిత్తం కోర్టుకు వెళ్లిన తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి తన భర్త ఆచూకీ తెలియడం లేదని చిలకమ్మ తెలిపింది. సీపీఐ నాయకుల సహాయంతో డివిజన్ కేంద్రమైన నర్సీపట్నానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం ఆమె వచ్చింది.
ఏఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కిందస్థాయి సిబ్బందికి వినతిపత్రం అందజేసింది. దబ్బలంక గ్రామానికి చెం దిన గెమ్మిలి సత్తిబాబు ఆలియాస్ బంద్ అనే గిరిజనుడు గత నెల 30న పాత కేసు వాయిదా నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల కోర్టుకు వెళ్లా డు. వాయిదాకు హాజరుకాకుండానే అడ్డతీగల పోలీసులు సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారు. వాయిదాకు వెళ్లిన భర్త సత్తిబాబు తిరిగిరాకపోవడంతో భార్య చిలుకమ్మ, సర్పంచ్ చంద్రకళను ఆశ్రయించింది.
ఆమె సహకారంతో అడ్డతీగల వెళ్లి భర్త కోసం పోలీసులను ఆరా తీసింది. సత్తిబాబు తమ వద్ద లేడని, విశాఖ జిల్లా మంప పోలీసులకు అప్పగించామని వారు సమాధానం చెప్పినట్టు చిలకమ్మ తెలిపింది. తన భర్తను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించినా పోలీసుల నుంచి సమాధానం రాలేదని ఆమె వాపోయింది. అక్కడ నుంచి మంప పోలీసులను కలిసి తన భర్త కోసం అడగగా, సత్తిబాబుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని, విచారించడం కోసమే అదుపులోకి తీసుకున్నామని మంప పోలీసులు చెప్పారని చిలకమ్మ తెలిపింది.
విచారణ చేసి పంపిస్తామని మంప పోలీసులు చెప్పి 22 రోజులు కావస్తున్నా విడుదల చేయకపోవడంతో తాము ఏఎస్పీని కలిసేందుకు వచ్చామని తెలిపింది. తన భర్తకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.