ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ ప్రారంభోత్సవం
ఆహ్వానించడంలోనూ అవమానం..
♦ మండలి ప్రధాన ప్రతిపక్ష నేతకు కేవలం మేసేజ్ ద్వారా ఆహ్వానం
♦ కనీస ప్రొటోకాల్ పాటించలేదని కార్యక్రమానికి రాని సీ రామచంద్రయ్య
♦ తమకు మెసేజ్ కూడా రాలేదన్న వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నేత
♦ అధికార మిత్రపక్ష బీజేపీ పక్ష నేత సైతం గైర్హాజరు
సాక్షి, అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష పార్టీ నాయకులు లేకుండానే రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించే విషయంలో ప్రభుత్వం కనీస మర్యాదలు పాటించని కారణంగానే ప్రతిపక్ష నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. శాసనసభలో మూడు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మిత్రపక్షంగా కొన సాగుతున్న బీజేపీ శాసనసభాపక్ష నాయ కుడు విష్ణుకుమార్రాజు కార్యక్రమంలో పాల్గొనలేదు.
కారణాలు తెలుసుకునేం దుకు ‘సాక్షి’ ఫోను ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమకు ఆహ్వానం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మరోవైపు శాసనమండలిలో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, బీజేపీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండగా, టీడీపీ మినహా మిగిలిన పార్టీ మండలిలో ఆయా పార్టీల పక్ష నాయకులు కార్యక్రమానికి హాజరు కాలేదు. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న తనకు ఒక అధికారి ఫోను నుంచి కేవలం ఒక మెసేజ్ రూపంలో ఆహ్వానం అందిందని కాంగ్రెస్ పక్ష నాయకుడు సీ రామచంద్రయ్య తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించే విషయంలో కనీస గౌరవం ఇవ్వని కారణంగా తాను ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీపీఐ పక్ష నాయకుడు పీజే చంద్రశేఖర్, బీజేపీ మండలిపక్ష నేత సోము వీర్రాజులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.