ల్యాప్‌టాప్ ధర రూ.9,999
• మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహకారం
• తెలంగాణలో అసెంబ్లింగ్ ప్లాంటు
• ఆర్డీపీ ఫౌండర్ విక్రమ్ రెడ్లపల్లి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ హార్డ్‌వేర్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఆర్డీపీ వర్క్‌స్టేషన్స్ ల్యాప్‌టాప్‌ల విపణిలోకి అడుగుపెట్టింది. ఆర్డీపీ థిన్‌బుక్ పేరుతో 14.1 అంగుళాల ల్యాప్‌టాప్‌ను రూ.9,999లకే ప్రవేశపెట్టింది. భారత్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఉపకరణం ఇదేనని కంపెనీ వెల్లడించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారమిక్కడ దీనిని విడుదల చేశారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సహకారంతో ఈ థిన్‌బుక్‌ను రూపొందించారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ ఆటమ్ ఎక్స్5-జడ్8300 ప్రాసెసర్, అల్ట్రా షార్ప్ హెచ్డీ డిస్ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, మైక్రో హెచ్డీఎంఐ, యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, వీజీఏ కెమెరా, డ్యూయల్ హెచ్డీ స్పీకర్స్, బ్లూటూత్, వైఫై, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇతర విశిష్టతలు. 1.45 కిలోల బరువు, 20 మిల్లీమీటర్ల మందం ఉంది.
ట్యాబ్లెట్ పీసీలు సైతం..
సర్వర్ ఆధారిత కంప్యూటింగ్ సేవలు అందిస్తున్న ఆర్డీపీ ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లను తైవాన్‌లో తయారు చేయిస్తోంది. సాధారణ టీవీలను కంప్యూటర్‌గా మార్చే ప్లగ్ పీసీలు 10,000 యూనిట్లకుపైగా విక్రయించింది. ఈ నెలలోనే విండోస్ ట్యాబ్లెట్ పీసీలను రూ.5,500లోపు ధరలో ప్రవేశపెడతామని కంపెనీ ఫౌండర్ విక్రమ్ రెడ్లపల్లి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లింగ్ ప్లాంటు రెడీ అవుతుందని చెప్పారు. ఇందుకు రూ.20 కోట్ల దాకా వ్యయం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఔట్లెట్లలో తమ ఉత్పత్తులు లభిస్తాయని వివరించారు. ఆర్డీపీ.ఆన్‌లైన్‌తోపాటు ఇతర ఈ-కామర్స్ సైట్ల ద్వారా కూడా ఉపకరణాలను విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. 100 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయని గుర్తు చేశారు.