
భారత్‌లో బైక్‌ల అసెంబ్లింగ్ ప్లాంట్ పెడతాం
ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌తో లగ్జరీ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న యూఎస్‌కు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ భారత్‌లో అసెంబ్లింగ్ ప్లాంటు పెట్టాలని నిర్ణయించింది...
- వాహనాల ధర 30 శాతం తగ్గుతుంది
- పోలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌తో లగ్జరీ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న యూఎస్‌కు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ భారత్‌లో అసెంబ్లింగ్ ప్లాంటు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం యూఎస్ నుంచి పూర్తిగా తయారైన బైక్‌లను కంపెనీ దిగుమతి చేసుకుంటోంది. కంపెనీ విక్రయిస్తున్న ఆరు మోడళ్లు 800 సీసీ ఆపైన ఇంజన్ సామర్థ్యమున్నవే. ఒక్కో బైక్‌పైన 75 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి వస్తోంది. 2018కల్లా అసెంబ్లింగ్ ప్లాంట్ రెడీ అవుతుందని పోలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మహవీర్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఇండియన్ మోటార్‌సైకిల్ షోరూంను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 100 శాతం తయారీ భారత్‌లో సాధ్యమవుతుందని, ఇందుకు మరికొంత సమయం పడుతుందని వివరించారు.
కలసిరానున్న ధర..
విడిభాగాలను దిగుమతి చేసుకుని భారత్‌లో అసెంబుల్ చేయడం ద్వారా మోడళ్ల ధర 30 శాతం దాకా తగ్గే అవకాశం ఉందని పంకజ్ దూబే సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘స్కౌట్ మోడల్ ధర రూ.12 లక్షలు. ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్ ఇదే. అందుకే తక్కువ మార్జిన్‌తో విక్రయిస్తున్నాం. అసెంబుల్ చేయడం ద్వారా దీన్ని రూ.10 లక్షల లోపు ధరలో తీసుకురావొచ్చు. మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి ఇది చక్కని పరిష్కారం’ అన్నారు. కంపెనీ రూపొందించిన ప్రతి మోడల్ భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. 2016 డిసెంబర్ కల్లా డీలర్‌షిప్‌ల సంఖ్య ప్రస్తుతమున్న 4 నుంచి 12కు చేరుస్తామని వెల్లడించారు.