ఆర్టీఏలో అర్ధరాత్రి ‘వసూల్ రాణి’
వరంగల్: ఆమె రోడ్డెక్కిందంటే ఆ రహదారిలో వెళ్లే వాహనదారులకు హడల్.. పెన్ను పట్టిందంటే చాలు.. రాసే ఫైన్ 50 వేల రూపాయలపైనే. అయితే ఈ ఫైన్ కేవలం రశీదు కావాలని అడిగిన వ్యక్తులకే మాత్రమే. అదే రశీదు అక్కర్లేదనుకుంటే అందులో సగం డబ్బులు ఆమె చేతిలో పెడితే చాలు వాహనాన్ని వదిలేస్తారు. లేదంటే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి ఫైన్ మొత్తం కట్టాల్సిందే. ఆమె గురించి తెలిసిన వాహనదారులు అంత మొత్తం డబ్బులు కట్టలేక.. ఫైన్‌లో సగం డబ్బులు చెల్లించి బతుకు జీవుడా అంటే తమ బండ్లు తీసుకెళుతున్నారు.
సదరు అధికారిణి మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వాహనదారులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన ప్రస్తుతం ఆర్టీఏలో హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్ రవాణాశాఖలో ఏఎంవీఐగా పనిచేస్తున్న సదరు అధికారిణి శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లింది. తిరిగి అర్ధరాత్రి తన అద్దె వాహనంలో డ్రైవర్, ఆనుచరులతో కలిసి వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్ధరాత్రి వరకు తిష్టివేసింది. మామునూరు గ్రామశివారులో రహదారి నుంచి వెళ్లే వాహనాలను ఆమె ఆపి తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు పలు సాకులు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.
కిలోమీటర్ మేర లారీలతోపాటు పలు రకాల వాహనాలు నిల్చిపోగా వందలాది వాహనదారులు మాముళ్లు సమర్పించుకున్నారు. పెనాల్టీ కట్టినట్లుగా రశీదు కావాలని నిలదీసిన వాహనదారుల పై ఆ మహిళా అధికారి మండిపడ్డారు. వాహనాల తాళం చెవులు లాక్కోవడమేగాక వాహనాలను సీజ్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ మహిళా అధికారిని ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఎస్కె సైదులు ఆమె సమక్షంలోనే అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా వసూళ్ల దందా నడుస్తుండగా ఓ మీడియాకు సమాచారం అందింది. వారు రంగంలోకి దిగడంతో సదరు అధికారిని గమనించి ప్రైవేట్ డ్రైవర్‌తోపాటు అక్కడి నుంచి జారుకుంది.
దీంతో బాధిత వాహనదారులు మహిళా అధికారిని ఇంట్లో పని చేసే సైదులును పట్టుకుని దేహశుద్ధి చేసి మామునూరు పోలీసులకు అప్పగించారు. ఆతడి వద్ద రూ.3 వేలు ఉండగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ చానల్ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎంవీఐ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న సైదులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత రవాణా శాఖ డీటీ సీ శివలింగయ్యకు సమాచారం అందజేశామని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యుగంధర్ వెల్లడించారు.
పోలీసు నివేదిక ఆధారంగా ఏఎంవీఐపై చర్యలు
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సదరు మహిళా ఏఎంవీఐ ఆర్ధరాత్రి అక్రమంగా మామూళ్లు వసూళ్లు చేస్తోందనే ఆరోపణలపై విచారిస్తున్నామని డీటీసీ శివలింగయ్య తెలిపారు. మామునూరు సీఐతో మాట్లాడి వివరాలు సేకరించామని, పోలీసుల నివేదికను బట్టి ఏఎంవీఐపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
- శివలింగయ్య, డీటీసీ