కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా?
న్యూఢిల్లీ : కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే వచ్చే ఏడాది 30 లక్షల ఉద్యోగవకాశాలు మీ ముందుకు రానున్నాయి. 4జీ టెక్నాలజీ ఆవిష్కరణ, డేటా వాడకం పెరుగుదల, కొత్త ఆపరేటర్లు మార్కెట్లోకి ఎంట్రీ, డిజిటల్ వాలెట్ల ప్రవేశం, స్మార్ట్‌ఫోన్‌కు రోజురోజుకు పాపులారిటీ పెరగడం, టెక్నాలజీకి మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడటం... టెలికాం రంగంలో కొత్తకొత్త ఉద్యోగవకాశాలకు నాంది పలుకుతోంది. వచ్చే ఏడాది కల్లా ఈ రంగంలో 30 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీలు 5జీ, ఎం2ఎం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలలో పరిణామాలు కూడా ఈ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు కల్పించనున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనం తెలిపింది. 2021 నాటికి వీటిలో కూడా 8,70,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఈ సంయుక్త అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఉద్యోగులు సంఖ్యాపరంగా, అప్‌కమింగ్ డిమాండ్ తగ్గ నాణ్యత పరంగా సరిపోరని చెప్పింది. దీంతో ఉద్యోగవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది.
నైపుణ్యాల పరంగా ఉన్న లోటును పూరించడానికి, ఇన్ఫ్రా, సైబర్ సెక్యరిటీ నిపుణులు, అప్లికేషన్ డెవలపర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ టెక్నిషియన్స్, హ్యాండ్సెట్ టెక్నిషియన్స్ వంటి విభాగాల్లో నైపుణ్యాలున్న ఉద్యోగులను గుర్తించాలని అంతేకాక, ప్రస్తుత టెక్నాలజీలో పనిచేస్తున్న ఉద్యోగులను, రాబోయే అవసరాలతో నవీకరించాల్సి ఉందని అసోచామ్-కేపీఎంజీ అధ్యయనం తెలిపింది. టెలికాం రంగంలో అవసరమయ్యే నైపుణ్యాలు, డిమాండ్ కోసం టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నియమింపబడింది. సబ్‌స్క్రైబర్ విషయాన్ని తీసుకుంటే సమ్మేళన వార్షిక వృద్ధి రేటులో టెలికాం రంగం 19.6 శాతం వృద్ధిని నమోదుచేసింది. రెవెన్యూ పరంగా గత కొన్నేళ్లలో ఈ వృద్ధి 7.07 శాతంగా ఉంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లు కూడా తమ నెట్‌వర్క్‌లలో కొనసాగింపుగా పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు.