రాష్ట్రంలో క్షీర విపవ్లం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ 2006-11 సంవత్సరకాలంలో పాల ఉత్పత్తిలో 41 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం నిలిచింది. వృద్ధిరేటులో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మొత్తం పాల ఉత్పత్తి పరిమాణం రీత్యా ఇంకా మూడో స్థానంలోనే ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో తలసరి పాల లభ్యతల్లో 36 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు అసోచామ్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయ్యింది. 2006-07 కాలంలో 79.38 లక్షల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2010-11 నాటికి 1.12 కోట్ల టన్నులకు చేరింది. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 19 శాతం వృద్ధితో 12.1 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి చేయడం ద్వారా ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2.1 కోట్ల లీటర్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, 1.3 కోట్ల లీటర్ల ఉత్పత్తితో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 2020కల్లా ఇండియాలో పాల ఉత్పత్తి 17.7 కోట్ల టన్నులు దాటొచ్చని అసోచామ్ అంచనావేసింది.
పాల వినియోగం తక్కువే..
ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ రోజువారి సగటు వినియోగంలో ఇండియా ఇప్పటికీ వెనుకబడే ఉంది. అంతర్జాతీయంగా రోజుకు ప్రతీ వ్యక్తి 279 గ్రాముల పాలను వినియోగిస్తుంటే ఆ సగటు ఇండియాలో 252 గ్రాములుగా ఉంది. అదే న్యూజిలాండ్ 9,773 గ్రాముల వినియోగంతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఐర్లాండ్ (3,260 గ్రాములు), డెన్మార్క్ (2,411 గ్రాములు) ఉన్నాయి. కాని ఈ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలో సగటు పాల వినియోగం బాగా పెరిగినట్లు అసోచామ్ పేర్కొంది. 2006-07లో రోజుకు 268 గ్రాములుగా ఉన్న సగటు వినియోగం 2010-11 నాటికి 36 శాతం పెరిగి 364 గ్రాములకు పెరిగింది. కాని దేశం మొత్తం మీద హర్యానా 679 గ్రాములు వినియోగించడం ద్వారా మొదటి స్థానంలో ఉంది.
వృద్ధికి మరిన్ని అవకాశాలు
ప్రపంచ సగటు కంటే ఇండియా పాల వినియోగం తక్కువగా ఉండటంతో ఈ రంగంలో వృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నట్లు అసోచామ్ జాతీయ కార్యదర్శి డి.ఎస్.రావత్ తెలిపారు. ఏటా సగటున నాలుగు శాతం చొప్పున వృద్ధి చెందితే 2019-20 నాటికి దేశ పాల ఉత్పత్తి 17.7 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అనుగుణంగా చిన్న రైతులకు, డెయిరీ ఉత్పత్తులు తయారు చేసే వారికి అనుసంధానంగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజల ఆదాయం కూడా పెరుగుతుండటంతో పాల ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతోందని అసోచామ్ పేర్కొంది.