నెగడు
టూకీగా ప్రపంచ చరిత్ర 20
మనం చూస్తున్న వాటిల్లో మచ్చికైన జంతువులను పక్కనబెడితే, నిప్పుకు జడుసుకోని జంతువు ఈ భూమ్మీద లేదు. ఉందంటే అది మనిషి మాత్రమే. ఒకానొకప్పుడు మనిషికి పూర్వీకుడు కూడా నిప్పును చూసి పరిగెత్తిపోయేవాడే. అప్పట్లో నిప్పుగానీ మంటలుగానీ ఏర్పడేది దావానలం వల్ల మాత్రమే. అది వ్యాపించే వేగం, విస్తృతి, అది కల్పించే బీభత్సం, ప్రాణాపాయాలకు భయపడకుండా నిలిచే అవకాశం ఏ జీవికీ లేదు. అది చల్లారిన తరువాత, అందులో చిక్కుకుని కాలిపోయిన జంతువుల మాంసం కోసం తారాడే మ్రుక్కడిమృగాలు అక్కడికి చేరి, బూడిదనూ బొగ్గులనూ మూతితో కాళ్ళతో కుళ్ళగిస్తాయి. అప్పట్లో సగమానవునికి సమానమైన ఆస్ట్రలోపిథికస్ వానరం తన ఆహారం కోసం పడుతున్న పాట్లు కూడా అలాంటివే.
నిప్పును స్వాధీనంలోకి తెచ్చుకోక పూర్వం నరమానవ జీవితం దినదిన గండంగా సాగింది. క్రూరమృగాలకు కాలిన వేట రుచించదు. అవి కోరేది పచ్చిమాంసం, వేడినెత్తురు. వాటికోసం అవి వేటకు బయలుదేరేది చీకటివేళల్లో. నరమానవుని నివాసం రక్షణలేని ఆరుబయలు. చీకట్లో క్రూరమృగాలకు దృష్టి నిశితం. వాటి బలం నరమానవునికంటే ఎన్నోరెట్లు అధికం. మోటు తరహా రాతిపనిముట్లను అందుబాటులో ఉంచుకున్నా, బలమైన జంతువుకు హాని కలిగించే పాటివిగావు ఆ రాతితునకలు. ఆ అవాంతరాన్ని నిరోధించేందుకు ‘నిప్పు’ ఏకైక మార్గమని అప్పుడప్పుడే పెరుగుతున్న మెదడుకు ఏదో సందర్భంలో ఆలోచన తట్టివుండాలి.
పది లక్షల సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైన సీనోజోయిక్ యుగంలోని రెండవఘట్టంలో భూమిమీద వాతావరణానికి మరో తరహా వైపరీత్యాలు మొదలయ్యాయి. ఒకదాని తరువాత ఒకటిగా ఇప్పటికి నాలుగు ‘హిమానీశకాలు (గ్లేసియల్ పిరియడ్స్)’ సంభవించాయి. హిమానీశకంలో ధ్రువాల దగ్గర మంచు విపరీతంగా పోగై, అది భూమధ్యరేఖ వైపుకు పాకుతూ వస్తుంది. నేలను కప్పుకుంటూ కప్పుకుంటూ 50 డిగ్రీల అక్షాంశం దాకా పూడుకుపోతుంది. అంటే, ఇంగ్లండులోని థేమ్స్నది దరిదాపులకు ఉత్తరంలోనూ, అదేమేరకు దక్షిణంలోనూ భూగోళం చుట్టూ మంచు కప్పుకుపోతుంది. అంత భారీగా మంచు ఏర్పడేందుకు సముద్రాల్లోని నీళ్ళు 80 శాతం దాకా పీల్చుకుపోతాయి. అనేకచోట్ల సముద్రగర్భం బయటపడి భూఖండాల మధ్య వంతెనల్లాగా తేలుతుంది. మంచుతో కప్పుకు పోయిన ప్రాంతాల్లో అడవులు సమూలంగా నాశనమౌతాయి. భూమధ్యరేఖ దిశగా వలసపోని జంతువులూ నశిస్తాయి. అటువంటి క్లిష్టసమయాలను తట్టుకోలేక శాశ్వతంగా అంతరించిపోయిన జాతులు చెట్లల్లోనూ, జంతువుల్లోనూ కొల్లలుగావున్నాయి.
ఇటువంటి హిమానీశకాల్లో మొదటిది ఆరులక్షల సంవత్సరాలకు పూర్వం సంభవించింది. 75 వేల సంవత్సరాలు అలాగే కొనసాగి, ఆ తరువాత మంచు క్రమంగా వెనక్కు తగ్గుతూ తిరిగి ధ్రువ ప్రాంతాలకు విరమించింది. దాన్ని దాటుకుని ప్రవేశించిన వెచ్చని వాతావరణంతో 25 వేల సంవత్సరాల ఉపశమమనం తరువాత, 5 లక్షల సంవత్సరాల నాడు, రెండవ హిమానీశకం ప్రవేశించి మరో 75 వేల సంవత్సరాలు పీడించింది. రెండున్నర లక్ష సంవత్సరాలప్పుడు మూడవది, లక్షా ఇరవైవేల సంవత్సరాలప్పుడు నాలుగవదీ ప్రవేశించాయి. 25 వేల సంవత్సరాలనాడు నాలుగవ హిమానీశకం ముగిసి, అప్పటినుండి ఇప్పటిదాకా ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రపంచం వర్ధిల్లుతూ వస్తూవుంది.
ఆస్ట్రలోపిథికస్ది మొదటి హిమానిశకం కంటే ముందే ప్రారంభమైన జీవితం. ఆ జీవితం నిప్పుకు దూరంగానూ, రాళ్ళతో కర్రలతో కొట్టి చంపేందుకు వీలైన జంతువుల వేటతోనూ, లేదా వేటాడే జంతువులు వదిలేసిన మాంసం కోసం నక్కలూ కుక్కలవంటి జంతువులను తరిమేసి స్వాధీనం చేసుకోవడంతోనూ గడిచింది. హిమానీశకంలో అంతరించిన మేరకు అంతరించిపోగా, దక్షిణానికి నివాసం మార్చుకున్న మేరకు వాటి సంఖ్య కుదించుకుపోయింది. ఆరుబయట బతికే జీవికి ఒకేచోట ఉండాలనే అనుబంధం పెద్దగా ఉండదు. ఆ దశలో నరవానరానికి స్థిరనివాసమనే ఆలోచన కలిగుండే అవకాశమేలేదు.
అయితే, రెండవ హిమానీశకంనాటికి వాటి జీవనశైలి మౌలికంగా మారిపోయింది. నిప్పును చూసి బెదురుకునే స్థితిని దాటుకున్నట్టు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఆహారం కోసం జరిగే అన్వేషణలో మిగతా జంతువుల పోటీ నుండి నెగ్గుకురావాలంటే తాను ఒక అడుగు ముందంజలో ఉండాలి.
రచన: ఎం.వి.రమణారెడ్డి