at
-
రెండు ఏటీఎంలలో రూ.35 లక్షలు లూటీ
చింతామణి: పట్టణంలోని ప్రముఖ సర్కిల్లో ఉన్న రెండు ఏటీఎంలలో గుర్తుతెలియని దుండగులు సుమారు రూ.35 లక్షల నగదును దోచుకెళ్లిన ఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని దొడ్డపేటలోని ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడిన దుండగులు మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి అందులోని సుమారు రూ.20 లక్షల నగదును, అలాగే ఆర్టీసీ బస్టాండ్ పక్కన వున్న భోవి కాలనీ రోడ్డులో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను పగలగొట్టి రూ.15 లక్షల నగదు దోచుకొని పారిపోయారు. తమ చిత్రాలు రికార్డు కాకుండా సీసీ కెమెరాలు, సైరన్ వైర్లను ధ్వంసం చేశారు. ఉదయం ఆ ప్రాంతవాసులు గమనించి బ్యాంకు సిబ్బందికి చెప్పగా వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ తదితరులు పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు ఆధారాలను సేకరించారు. ఏటీఎంల దోపిడీతో పట్టణంలో ఆందోళన నెలకొంది. -
ప్రగతిభవన్ ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు
-
వంటంతా ఒకే చోట..!
- 20 కిలోమీటర్లకో పాకశాల ఏర్పాటు యోచన - అక్కడి నుంచే పాఠశాలలకు మధ్యాహ్నభోజనం - జిల్లాలో ఐదు క్లస్టర్లలో అమలుకు సన్నాహాలు రాయవరం (మండపేట) : ‘మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. అన్నంలో పురుగులు ఉంటున్నాయి. మెనూ ప్రకారం గుడ్డు వడ్డించడం లేదు..’ ఇలాంటివే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై వినిపిస్తున్న విమర్శలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు వివిధ సందర్భాల్లో జిల్లాలో ఏదో ఒక మూల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంలో మార్పులకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రభుత్వం 524339/ప్రోగ్రామ్.1/ఎ1/2017 తేదీ 19–04–2017తో మెమో విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 4,189 ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో దాదాపుగా రోజుకు 2.80 లక్షల మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. జకొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు వండి సరఫరా చేస్తుండగా, చాలా పాఠశాలల్లో మిడ్డే మీల్ వర్కర్లు వండి వడ్డిస్తున్నారు. ప్రతి క్లస్టర్లో 25 వేల మందికి వంట ఇకపై ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక భారీ వంటశాల ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకూ భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, అమలాపురం, రామచంద్రపురంలలో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి క్లస్టర్లో సుమారు 25 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయనున్నారు. ఉదాహరణకు రామచంద్రపురంలో వంటశాలను ఏర్పాటు చేసి దాని పరిధిలోని 25 వేల మందికి భోజనం తయారు చేసి అక్కడి నుంచి వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఎప్పుడు తయారైన భోజనం అప్పుడే ప్యాకింగ్ చేసి పంపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు ప్రతి క్లస్టర్‌కు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. అవసరమైన స్థలాలను ఐదు క్లస్టర్లలో గుర్తించాలని కలెక్టర్‌కు విద్యాశాఖ నివేదించింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాల హెచ్ఎంతో పాటు మండల విద్యాశాఖాధికారి ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు. వంటశాలల ఏర్పాటు తర్వాత వాటి సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఫలితంగా డివిజన్, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మెనూ ప్రకారమే భోజనం.. ప్రభుత్వ ఆలోచన పూర్తి స్థాయిలో అమలైతే నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందనుంది. వంటశాలలు లేవని, వర్షం కురుస్తోందని, బిల్లులు చెల్లించక పోవడంతో భోజనం అందించడం ఇబ్బందిగా మారుతుందనే మాటలు వినిపించే అవకాశం ఉండదు. ప్రతి వారం తప్పనిసరిగా రెండు గుడ్లు అందించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన భోజనం తయారవుతుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వర్కర్లకు ప్రత్యామ్నాయమెలా.. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న మహిళలు భారీగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో మిడ్డే మీల్ వర్కర్లు భోజనం తయారు చేసి వారికి వడ్డిస్తున్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది మిడ్డే మీల్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.1,000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. నూతన విధానం అమలు జరిగితే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వంటశాలల్లో భోజనం తయారీతో పాటు ప్యాకింగ్, ఇతర పనుల్లో వీరిని వినియోగించుకోనున్నా..అందరికీ ఉపాధి సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంచనాలు రూపొందిస్తున్నాం.. ప్రతి 20 కిలోమీటర్లకో వంటశాల ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నాం. వంట తయారు చేయడానికి అవసరమైన భవనాల నిర్మాణానికి అనువైన స్థలం కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. – ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి -
లాఠీ దాష్టీకం
దివీస్ కోసం పోలీసుల అతి.. అట్టుడికిన కోన తీరం బందోబస్తుతో రైతుల భూముల్లో చెట్ల తొలగింపు కోర్టు స్టే ఉన్న, అమ్మని భూముల్లో పనులపై ప్రజల ఆగ్రహం గ్రామాల్లో మహిళలపై దౌర్జన్యం అడ్డుకున్న 100 మంది అరెస్టు బాధితులను విడిపించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొండంగి : జీడిచెట్ల వద్ద పిక్కలు ఏరుకుంటూ, గొర్రెల మందలను కాచుకుంటూ జీవనం సాగించే కోనతీరంలోని అమాయక ప్రజలపై కాలుష్య దివీస్ పరిశ్రమ కోసం ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ స్థాపన కోసం కోనఫారెస్ట్ భూములు 670 ఎకరాలను కేటాయించింది. ఈ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులు, బాధిత గ్రామాల ప్రజల కాలుష్య పరిశ్రమ స్థాపనను, భూముల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసే పోరుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్), జనశక్తి, ఏపీ వ్యవసాయరైతు కూలీసంఘం, సీఐటీయూ, ఐద్వా మహిళాసంఘం తదితర సంఘాలు, పార్టీల మద్దతునిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు రైతులు ప్రభుత్వానికి అప్పగించని భూముల్లో బలవంతంగా చెట్లను తొలగించబోతుంటే బాధిత గ్రామాల ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా రెవెన్యూ అధికారులు భారీగా జేసీబీలు, కోత యంత్రాలతో చెట్లను తొలగించారు. విషయం తెలుసుకున్నతాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట తదితర గ్రామాలకు చెందిన వారంతా తమ భూముల్లోకి వెళ్లి చెట్లుతొలగిస్తున్న జేసీబీ, కోత యంత్రాలను నిలుపుదల చేయించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి అరెస్టు చేశారు. తాటియాకులపాలెం రైతు సన్ని సత్యనారాయణను పోలీసులు దారుణంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 100 మందిని కోటనందూరు, అన్నవరం, ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దివీస్ కోసం బలవంతపు భూసేకరణకు చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో కోన తీరప్రాంతంలో బాధిత గ్రామాల వద్ద సుమారు వెయ్యిమంది పోలీసులను మోహరించారు. మానవత్వాన్ని మరిచి.. పోలీసులు మానవత్వాన్ని మరచి బహిర్భూమికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలు, రోడ్డుకు సమీపంలో చదువుకుంటున్న విద్యార్థులు, యువతులు, బీచ్‌రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై ధాషీ్టకాన్ని ప్రదర్శించారు. పంపాదిపేటలో బీచ్‌రోడ్డుకు ఆవల ఉన్న పశువుల మకాంలోకి, ఇళ్ల వద్దకు వెళ్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ జీపుల్లో ఎక్కించారు. బాధితులకు అండగా ఎమ్మెల్యే రాజా అరెస్టుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధిత ప్రజలకు అండగా నిలిచారు. అరెస్టు సంఘటనలు తెలిసిన వెంటనే ఆయన కొత్తపాకలు సమీపంలో దివీస్‌కు ప్రతిపాదిత భూములు వద్దకు వెళ్లారు. దీంతో బాధిత రైతులంతా అక్కడకు చేరుకున్నారు. హైకొర్టు స్టేటస్కో విధించిన భూముల్లోనూ పనులు నిర్వహించారని, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ కొట్టి అరెస్టు చేశారని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. దీంతో అక్కడ ఉన్న డీఎస్పీ రాజశేఖర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. దివీస్‌కు ప్రతిపాదించిన భూముల్లో వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసినది ఎంత, అమ్మని భూమి ఎంత ఉందో రెవెన్యూ అధికారులు గుర్తించి, అవసరమైతే సర్వే నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజా అన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డీఎస్పీని కోరారు. లేదంటే వారి తరఫున ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అరెస్టయినవారిని విడిపించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు 32 మందిని, కోటనందూరు 66 మందిని, ఒంటిమామిడిపోలీస్స్టేషన్కు ఇద్దరిని వాహనాల్లో తరలించారు. డీఎస్పీతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే రాజా వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు. -
కోటిన్నరకు కన్నం
బినామీ పేర్లతో వేలం సొమ్ము స్వాహా సస్పెండైనా ఆలయంలోనే తిష్ట తిరిగొస్తానంటూ బెదిరింపులు తమ్ముళ్ల తోడ్పాటు ఉండనే ఉంది ఆ అండతోనే అవినీతి’లోవ’లో ఒకే ఒక్కడు.. ! ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న సామెత దేవాదాయ శాఖలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఇందుకు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం వేదికైంది. ఏటా రూ.8 కోట్ల ఆదాయం కలిగిన తలుపులమ్మ వారిని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలవాసులు ప్రతి వారం పాతిక, 30వేల మంది భక్తులు దర్శించుకుంటారు. అటువంటి అమ్మవారి ఖజానాకే కన్నం పెట్టాడొక సీనియర్ అసిస్టెంట్. లోవ దేవస్థానంలో రాజకీయ పలుకుబడితో పుష్కరకాలం పాతుకుపోయిన ఆ సీనియర్ అసిస్టెంట్ అవినీతి బండారం బయటపడింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : తలుపులమ్మ అమ్మవారికి జమ కావాల్సిన కోటిన్నర ఆదాయాన్ని అడ్డంగా దోచేశాడు ఆ సీనియర్ అసిస్టెంట్. ఇటీవలనే ఆలయంలో ఈఓకు తెలియకుండా లక్షలు విలువైన గ్రావెల్ రోడ్డు వేయిస్తున్న వ్యవహారాన్ని ’సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ తిరిగి దేవస్థానంలోనే పోస్టింగ్ తెచ్చుకుంటానని రెండు రోజులకు ఒకసారి ఆలయానికి వచ్చి బెదిరింపులకు దిగుతున్నాడు. తిరిగొచ్చాక మీ అందరి సంగతి తేలుస్తానంటున్న అతనితో ఉద్యోగులంతా విసుగెత్తిపోయారు. అమ్మవారి ఆలయంలో మొత్తం వివిధ క్యాడర్లకు చెందిన 57 మంది ఉద్యోగులుండగా 37 మంది మూకుమ్మడిగా సీనియర్ అసిస్టెంట్ అవినీతి బాగోతాన్ని రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బంధువులే బినామీలుగా... దేవస్థానం నుంచి బకాయిలు చెల్లించాలని నోటీసులు వెళ్లడంతో విస్తుపోయిన ఉద్యోగుల బంధువులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లోవ దేవస్థానంలో 2013–14 సంవత్సరంలో పూజా సామాగ్రి అమ్మకం, తలనీలాల సేకరణ, అమ్మవారికి వచ్చే వస్రా్తలు సేకరణ, తిరిగి అమ్మకం, ఫ్యాన్సీ దుకాణంలో యంత్రాలు, ఉంగరాలు, రక్షణగా వేసుకునే తాళ్లు...ఇలా పలు దుకాణాలను బినామీ పేర్లతో సీనియర్ అసిస్టెంట్ నిర్వహించాడు. ఈ వేలం హక్కుదారుల నుంచి దేవస్థానానికి రూ.1.15 కోట్లు, 2014–15లో వస్రా్తలు సేకరణ హక్కులు రూ.30 లక్షలు కూడా జమ కాలేదు. ఇన్ని సంవత్సరాలు ఆ సీనియర్ అసిస్టెంట్ మేనేజ్ చేస్తూ వస్తుండటంతోనే విషయం బయటకు రాలేదంటున్నారు. మరి మూడేళ్లుగా ఈ బకాయిలపై అప్పటి ఈఓలు, అధికారులు ఏమి చేశారంటే ఎవరూ నోరు మెదపరు. కారణమేమిటంటే రాజకీయ పలుకుబడి అటువంటిది మరి అని సరిపెట్టుకుంటారు.ఆ ఉద్యోగి పేరుకే సీనియర్ అసిస్టెంట్. కానీ దేవస్థానం మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఈఓగా ఎవరు వచ్చినా అతను చెప్పిందే వేదం. ఎందుకంటే తుని నియోజకవర్గంలో అధికార పార్టీ తమ్ముళ్ల అండదండలు అంతగా ఉన్నాయి మరి. రూ.కోటిన్నర మాటేమిటి...? వాస్తవానికి దేవస్థానం బకాయిలు మూడేళ్లలోపు జమ చేయాలి. మూడేళ్లు దాటిపోతే ఆ తరువాత ఆ సొమ్ము కోసం న్యాయస్థానానికి వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఆ మూడేళ్ల కాలపరిమితి వచ్చే నెల జనవరి 24తో ముగియనుంది. అదే దైర్యంతో రెండున్నరేళ్లకు పైబడే ఈ వ్యవహారాన్ని దాచిపెడుతూ వస్తున్నాడంటున్నారు. 2013–14లో దుకాణాలు వేలాన్ని ఆలయంలో పనిచేసే అగ్రహారపు శ్రీను, రామచంద్రరావు, లోవరాజు తదితర ఉద్యోగుల బంధువుల పేరుతో సీనియర్ అసిస్టెంట్ సొంతం చేసుకున్నాడని సమాచారం. అలా సొంతం చేసుకున్న దుకాణాల ద్వారా ఆలయానికి రూ.1.15 కోట్లు జమచేయాలి. ఈ విషయాన్ని గత రెండేళ్లుగా ఇందుకు సంబంధించిన రికార్డులు తన వద్దనే ఉండటంతో తొక్కిపెట్టారని సమాచారం. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసి మృతి చెందిన ఈఓ పాత్రపై కూడా ఆరోపణలున్నాయి. బినామీలో ఒక మహిళకు నోటీసు ఇవ్వడంతో ఆమె అధికారుల వద్ద గొల్లుమందని తెలిసింది. తనకు తెలియకుండా తన పేరున దుకాణం పాడుకున్న విషయం తెలిసి నెత్తినోరు బాదుకుంటే అంతా తాను చూసుకుంటానని విషయం బయటపెట్టవద్దని బెదిరింపులకు దిగారని అధికారులకు ఫిర్యాదు చేశారని సమాచారం. సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలిపై ఆరు ఆరోపణలతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. -
పట్టపగలే భారీ చోరీ
30 కాసుల బంగారం, రూ.60 వేల అపహరణ కాకినాడలో వృద్ధురాలిని తాళ్లతో బంధించిన వైనం కాకినాడ క్రైం : అది కాకినాడ భానుగుడి సెంటర్. సోమవారం ఉదయం 9 గంటల సమయం. ముగ్గురు ఆగంతకులు ముసుగులు ధరించి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో చొరబడ్డారు. ఆమెను తాళ్లతో బంధించి çసుమారు 30 కాసుల బంగారం, రూ.60 వేల నగదును అపహరించుకుపోయారు. వివరాల్లోకెళితే.. స్థానిక భానుగుడి సెంటర్ భానులింగేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీరామ్‌నగర్‌లో ఉన్న ఓ భవనం రెండో అంతస్తులో కొప్పర్తి ఆనంద్‌కృష్ణ నివసిస్తున్నారు. ఆయన ఇంట్లోకి ఉదయం 9 గంటల సమయంలో ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల కె.రమణమ్మ నోటికి జాకెట్‌తో కట్టి, కాళ్లు చేతులు పసుపు తాడుతో బంధించారు. సుమారు రూ.7.50 లక్షల విలువైన 30 కాసుల బంగారం, అలమారాలో ఉన్న రూ.10 వేలు, బీరువాలో ఉన్న రూ.50 వేల నగదును తస్కరించారు. ఇంట్లో కారంపొడి చల్లి, పరారయ్యారు. తన భర్త ఆనంద్‌కృష్ణ భానులింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన, కొన్ని క్షణాల్లోనే దుండగులు ఇంట్లోకి చొరబడ్డారని బాధితురాలు తెలిపింది. తొలుత ఇద్దరు ఇంటిలోకి వచ్చారని, మరో వ్యక్తి గుమ్మం వద్ద నిలబడినట్టు పేర్కొంది. సమాచారం అందుకున్న రెండో పట్టణ క్రైం ఎస్సై రామారావు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆ«ధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం శ్రీరామ్‌నగర్‌కు చెందిన కొప్పర్తి రంగారావు ఇంట్లో ఇదే తరహాలో చోరీ జరిగింది. కాగా ఆనందకృష్ణ స్వయానా రంగారావుకు సోదరుడు. రెండు చోట్ల ఒకే ముఠాకు చెందిన వారు చోరీలకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
స్పీడు బ్రేకర్లు..బారికేడ్లు
కూసుమంచి: నాయకన్‌గూడెం వద్ద సాగర్ ఇన్‌ఫాల్ కాల్వలో సోమవారం తెల్లవారుజామున బస్సుపడి పది మంది దుర్మరణం చెందడంతో..ఇక్కడ అధికారులు తిరిగి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో స్పందించిన ఆర్అండ్బీ అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా..హడావిడిగా కాల్వ వంతెనపై రెయిలింగ్ విరిగిన చోట తాత్కాలికంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సూర్యాపేట వైపు, ఖమ్మం వైపు స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేశారు. పోలీసుశాఖ కూడా ఇన్‌ఫాల్ కాలువ వద్ద ట్రాఫిక్ పోలీసులను నియమించింది. వంతెనకు రక్షణ గోడలు నిర్మించేంత వరకు ఉదయం, రాత్రి వేళల్లో వీరు విధులు నిర్వర్తించనున్నారు. కాగా గతంలోనే బస్సు కాల్వలో పడి ప్రమాదం జరిగినప్పుడు అధికారులు స్పందించి ఉంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు నాయకన్‌గూడెం వాసులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు. ఇకనైనా ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు. -
పాపం పసివాడు
బస్సు చక్రాల కింద నలిగి బాలుడి మృతి బస్సులోని రంధ్రం నుంచి పడడంతో ఘటన దైవ దర్శనానికి వచ్చి వెళ్తుండగా ప్రమాదం {పైవేట్ బస్సు యాజమాన్యం, ఆర్టీసీ నిర్లక్ష్యమే కారణం యాదగిరిగుట్ట, న్యూస్‌లైన్: అద్దె బస్సు యజమానితో పాటు ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ చిన్నారి ఉసురుతీశాయి. బస్సులోని ఫ్లోరింగ్‌పై ఉన్న రంధ్రంలోంచి జారి పడిన ఆ చిన్నారి అదే బస్సు చక్రాల కింద నలిగి ప్రాణం విడిచాడు. ఈ విషాద ఘటన యాదగిరిగుట్ట శివారు గుండ్లపల్లి గ్రామశివారులో బుధవారం జరిగింది. ఎస్ఐ నర్సింహరావు కథనం ప్రకారం... ఉప్పల్ భరత్‌నగర్ కాలనీకి చెందిన శ్రీధర్‌రెడ్డి, సంధ్యారెడ్డి దంపతులకు కుమారుడు సూర్యారెడ్డి (3) సంతానం. బుధవారం ఉదయం సంధ్యారెడ్డి కుమారుడు సూర్యారెడ్డిని తీసుకుని తన తల్లిదండ్రులతో కలిసి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వచ్చారు. ఉదయం స్వామి వారిని దర్శించుకుని సాయంత్రం తిరిగి ఉప్పల్‌కు బయలుదేరారు. గుట్ట బస్టాండ్‌లో హైదరాబాద్‌కు వెళ్లే బస్సు (అద్దెబస్సు) ఎక్కారు. బస్సు గుట్ట పట్టణ శివారులోని గుండ్లపల్లి గ్రామానికి చేరుకుంది. ఆ సమయంలో బస్సులో తల్లి పక్కన సూర్యారెడ్డి నిల్చున్నాడు. ఫ్లోరింగ్‌పై ఉన్న రంధ్రాన్ని గమనించలేదు. ఒక్కసారిగా ఆ రంధ్రం లోంచి జారి కింద పడ్డాడు. వేగంగా కదులుతున్న బస్సుచక్రం కింద బాలుడి తల పడింది. దీంతో తలవెనుకభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేశాడు. బాలుడి తల్లి సంధ్యారెడ్డి, ఆమె తల్లిదండ్రులు మృతదేహం చిన్నారి మృతదేహంపై పడి గుండెలు బాదుకుంటూ రోదించారు. ప్రమాద దృశ్యాన్ని చూసి చలించిన తోటి ప్రయాణికులు, స్థానికులు కంటతడిపెట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును, బస్సుడ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని గుట్ట ఆర్టీసీ డీఎం సందర్శించారు. బాధితులకు తక్షణ ఆర్థికసాయం కింద రూ.5వేలు అందిస్తామన్నారు. సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. ప్రైవేట్ బస్సు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ పాపం..ఎవరిది? బాలుడు మృతికి ప్రైవేట్ బస్సు యాజమాన్యంతో పాటు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. బస్సు నిర్వహణ, ఫిట్నెస్ బాధ్యత బస్సు యజమానిదేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ,ప్రైవేట్ బస్సుల సామర్థ్యం.. లోపాలను పరిశీలించిన తర్వాతే బస్సును బయటకు పంపించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. ఇటు బస్సు యాజమాన్యం, అటు ఆర్టీసీ అధికారులు తమ బాధ్యతలు విస్మరించడంతో పసివాడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. -
ఎస్బీఐ ముందస్తు పన్ను చెల్లింపు 33% డౌన్
ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ముందస్తు పన్ను(ఏటీ) చెల్లింపులు 33 శాతం తగ్గాయి. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసికానికి(క్యూ3)గాను రూ.1,130 కోట్ల ఏటీ చెల్లించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,701 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. కాగా, వరుసగా రెండో క్వార్టర్లోనూ ఎస్బీఐ ఏటీ చెల్లింపులు తగ్గుముఖం పట్టడం(సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,120 కోట్లు-40%క్షీణత) గమనార్హం. వాస్తవానికి ఏటీ చెల్లింపులకు ఈ నెల 15 వరకే గడువు ఉండగా.. వారాంతం నేపథ్యంలో మరో రెండు రోజులు(17 వరకూ) పొడిగించిన సంగతి తెలిసిందే. కంపెనీల పనితీరుకు ఏటీ చెల్లింపులను కీలకమైన కొలమానంగా పరిగిణిస్తూ ఉంటారు. కాగా, హెచ్డీఎఫ్సీ క్యూ3 ఏటీ చెల్లింపు రూ.650 కోట్లుగా ఆదాయపు పన్ను(ఐటీ) వర్గాలు పేర్కొన్నాయి. క్రితం క్యూ3లో ఈ మొత్తం రూ.560 కోట్లు.