కోటిన్నరకు కన్నం
కోటిన్నరకు కన్నం
Published Tue, Dec 6 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
బినామీ పేర్లతో వేలం సొమ్ము స్వాహా
సస్పెండైనా ఆలయంలోనే తిష్ట
తిరిగొస్తానంటూ బెదిరింపులు
తమ్ముళ్ల తోడ్పాటు ఉండనే ఉంది
ఆ అండతోనే అవినీతి’లోవ’లో ఒకే ఒక్కడు.. !
‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న సామెత దేవాదాయ శాఖలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఇందుకు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం వేదికైంది. ఏటా రూ.8 కోట్ల ఆదాయం కలిగిన తలుపులమ్మ వారిని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలవాసులు ప్రతి వారం పాతిక, 30వేల మంది భక్తులు దర్శించుకుంటారు. అటువంటి అమ్మవారి ఖజానాకే కన్నం పెట్టాడొక సీనియర్ అసిస్టెంట్. లోవ దేవస్థానంలో రాజకీయ పలుకుబడితో పుష్కరకాలం పాతుకుపోయిన ఆ సీనియర్ అసిస్టెంట్ అవినీతి బండారం బయటపడింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తలుపులమ్మ అమ్మవారికి జమ కావాల్సిన కోటిన్నర ఆదాయాన్ని అడ్డంగా దోచేశాడు ఆ సీనియర్ అసిస్టెంట్. ఇటీవలనే ఆలయంలో ఈఓకు తెలియకుండా లక్షలు విలువైన గ్రావెల్ రోడ్డు వేయిస్తున్న వ్యవహారాన్ని ’సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ తిరిగి దేవస్థానంలోనే పోస్టింగ్ తెచ్చుకుంటానని రెండు రోజులకు ఒకసారి ఆలయానికి వచ్చి బెదిరింపులకు దిగుతున్నాడు. తిరిగొచ్చాక మీ అందరి సంగతి తేలుస్తానంటున్న అతనితో ఉద్యోగులంతా విసుగెత్తిపోయారు. అమ్మవారి ఆలయంలో మొత్తం వివిధ క్యాడర్లకు చెందిన 57 మంది ఉద్యోగులుండగా 37 మంది మూకుమ్మడిగా సీనియర్ అసిస్టెంట్ అవినీతి బాగోతాన్ని రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
బంధువులే బినామీలుగా...
దేవస్థానం నుంచి బకాయిలు చెల్లించాలని నోటీసులు వెళ్లడంతో విస్తుపోయిన ఉద్యోగుల బంధువులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లోవ దేవస్థానంలో 2013–14 సంవత్సరంలో పూజా సామాగ్రి అమ్మకం, తలనీలాల సేకరణ, అమ్మవారికి వచ్చే వస్రా్తలు సేకరణ, తిరిగి అమ్మకం, ఫ్యాన్సీ దుకాణంలో యంత్రాలు, ఉంగరాలు, రక్షణగా వేసుకునే తాళ్లు...ఇలా పలు దుకాణాలను బినామీ పేర్లతో సీనియర్ అసిస్టెంట్ నిర్వహించాడు. ఈ వేలం హక్కుదారుల నుంచి దేవస్థానానికి రూ.1.15 కోట్లు, 2014–15లో వస్రా్తలు సేకరణ హక్కులు రూ.30 లక్షలు కూడా జమ కాలేదు. ఇన్ని సంవత్సరాలు ఆ సీనియర్ అసిస్టెంట్ మేనేజ్ చేస్తూ వస్తుండటంతోనే విషయం బయటకు రాలేదంటున్నారు. మరి మూడేళ్లుగా ఈ బకాయిలపై అప్పటి ఈఓలు, అధికారులు ఏమి చేశారంటే ఎవరూ నోరు మెదపరు. కారణమేమిటంటే రాజకీయ పలుకుబడి అటువంటిది మరి అని సరిపెట్టుకుంటారు.ఆ ఉద్యోగి పేరుకే సీనియర్ అసిస్టెంట్. కానీ దేవస్థానం మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఈఓగా ఎవరు వచ్చినా అతను చెప్పిందే వేదం. ఎందుకంటే తుని నియోజకవర్గంలో అధికార పార్టీ తమ్ముళ్ల అండదండలు అంతగా ఉన్నాయి మరి.
రూ.కోటిన్నర మాటేమిటి...?
వాస్తవానికి దేవస్థానం బకాయిలు మూడేళ్లలోపు జమ చేయాలి. మూడేళ్లు దాటిపోతే ఆ తరువాత ఆ సొమ్ము కోసం న్యాయస్థానానికి వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఆ మూడేళ్ల కాలపరిమితి వచ్చే నెల జనవరి 24తో ముగియనుంది. అదే దైర్యంతో రెండున్నరేళ్లకు పైబడే ఈ వ్యవహారాన్ని దాచిపెడుతూ వస్తున్నాడంటున్నారు. 2013–14లో దుకాణాలు వేలాన్ని ఆలయంలో పనిచేసే అగ్రహారపు శ్రీను, రామచంద్రరావు, లోవరాజు తదితర ఉద్యోగుల బంధువుల పేరుతో సీనియర్ అసిస్టెంట్ సొంతం చేసుకున్నాడని సమాచారం. అలా సొంతం చేసుకున్న దుకాణాల ద్వారా ఆలయానికి రూ.1.15 కోట్లు జమచేయాలి. ఈ విషయాన్ని గత రెండేళ్లుగా ఇందుకు సంబంధించిన రికార్డులు తన వద్దనే ఉండటంతో తొక్కిపెట్టారని సమాచారం. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసి మృతి చెందిన ఈఓ పాత్రపై కూడా ఆరోపణలున్నాయి. బినామీలో ఒక మహిళకు నోటీసు ఇవ్వడంతో ఆమె అధికారుల వద్ద గొల్లుమందని తెలిసింది. తనకు తెలియకుండా తన పేరున దుకాణం పాడుకున్న విషయం తెలిసి నెత్తినోరు బాదుకుంటే అంతా తాను చూసుకుంటానని విషయం బయటపెట్టవద్దని బెదిరింపులకు దిగారని అధికారులకు ఫిర్యాదు చేశారని సమాచారం. సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలిపై ఆరు ఆరోపణలతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది.
Advertisement
Advertisement