నీళ్లలో తేలే నగరం కోసం ప్రత్యేకంగా ఏటీఎం
భారత నౌకాదళంలో అతిపెద్ద విమానవాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యను 'తేలే నగరం' అంటారు. ఈ నౌకలో శనివారం నాడు ఒక ఏటీఎం రానుంది. ప్రస్తుతం కర్ణాటకలోని కర్వర్ ప్రాంతంలో ఉన్న ఈ నౌకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏటీఎంను ఏర్పాటు చేయబోతోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐని నౌకాదళం కోరిన మీదట ఇది సాధ్యమైంది. శాటిలైట్ కమ్యూనికేషన్ లింకు ద్వారా ఈ మిషన్ డబ్బులను ఇస్తుంటుంది.
రష్యాలో తయారైన ఈ నౌకను 2013 నవంబర్ నెలలో భారత నౌకాదళంలోకి తీసుకున్నారు. అందులో మొత్తం 1600 మంది అధికారులు, ఇతర సిబ్బంది పనిచేస్తుంటారు. వీళ్లకోసం ప్రతియేటా లక్ష కోడిగుడ్లు, 20వేల లీటర్ల పాలు, దాదాపు 16 టన్నుల బియ్యం, ఇంకా ఇతర నిత్యావసర సరుకులు ఖర్చవుతాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి.. నిరంతరం ఇది జలాల్లో ఉంటుంది. 45 రోజుల పాటు ఏకధాటిగా సముద్రంలోనే ఉన్నా కూడా అందులో ఉన్నవారందరికీ సరిపడ సరుకులు ఎప్పుడూ నిల్వ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఏటీఎంలో డబ్బులు అయిపోకుండా ఉండేందుకు నౌకలోనే ఒక కరెన్సీ చెస్టును కూడా పెడుతున్నారు. దాంతో సెయిలర్లు, అధికారులకు డబ్బు కొరత సమస్య ఇక ఉండబోదన్న మాట.