ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యాకే రేటింగ్ పెంపు: మూడీస్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఇతరత్రా ఆర్థికపరమైన అంశాలు మెరుగుపడితేనే రేటింగ్ పెంపునకు భవిష్యత్తులో అవకాశం ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొం ది. భారత్ పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రధానంగా స్థిరమైన పన్నుల వ్యవస్థ, వ్యాపారాలకు సానుకూల వాతావరణం వంటి చర్యలు చాలా అవసరమని సూచించింది. ‘రేటింగ్ అవుట్‌లుక్ అనేది అంచనాల ఆధారంగా ఉంటుంది. అప్‌గ్రేడ్ విషయానికొస్తే.. అంచనాలు వాస్తవ రూపం దాల్చాయన్న విశ్వాసం కుదరాలి.
ఇది స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ప్రతిబింబించాలి కూడా’ అని మూడీస్ సావరీన్ రేటింగ్ ఎనలిస్ట్ అత్సి సేథ్ వ్యాఖ్యానించారు. ఇటీవలే భారత్ రేటింగ్(ప్రస్తుతం బీఏఏ 3) అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి సానుకూలం(పాజిటివ్)కు మూడీస్ పెంచడం తెలిసిందే. బీఏఏ 3 అనేది జంక్ గ్రేడ్(పెట్టుబడులకు ఏమాత్రం అనుకూలం కాని స్థాయి)కు ఒక అంచెపైన మాత్రమే ఉన్నట్లు లెక్క.