Attack on convoy
-
ఐఏఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటన..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఈ నెల 4వ తేదీన భారత వైమానిక దళం కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ఘటనలో విక్కీ పహాడే అనే కార్పొరల్ మృత్యువాతపడగా ఆయన సహచరులు మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాక్‌కే చెందిన ఉగ్రవాది హదూన్, లష్కరే తోయిబా కమాండర్ అబూ హమ్జా(30) అని తేలింది. కాల్పుల సమయంలో వీరివద్ద అత్యాధునిక అసాల్ట్ రైఫిళ్లయిన అమెరికా తయారీ ఎం4, రష్యా తయారీ ఏకే–47 ఉన్నట్లు తేలింది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురి పోలికలున్న చిత్రాలతో అధికారులు పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. -
మళ్లీ మావోల కలకలం! ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో మళ్లీ మావోల కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ తూర్పు భాగం గుండా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు యతి్నస్తున్నారు. అదే సమయంలో తూర్పు దిక్కున మావోలకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవీ కాన్వాయ్‌పై తూటాల వర్షం కురిపించి దాడికి తెగబడ్డారు. అయితే, ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ క్రమంలో మావోలు తెలంగాణలోకి వస్తున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో వీరి కదలికలపై పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉంది. దీంతో వీరు రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు పోలీసులు సరిహద్దుల వద్ద భద్రత పెంచారు. అయితే, ఈసారి ఏప్రిల్ 20న జరగనున్న ఇంద్రవెల్లి అమరుల సంస్మరణను పురస్కరించుకుని ఉద్యమాలను నిర్మించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జల్, జంగిల్, జమీన్ నినాదంతో ఉద్యమించిన ఆదివాసీల్లో 13 మంది పోలీసు కాల్పుల్లో మరణించిన ఘటనను ఉద్యమకారులు మరో జలియన్ వాలా భాగ్‌తో పోలుస్తారు. గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణే..! ఇంద్రవెల్లి వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తరచుగా కేంద్రంపై విమర్శలు, తమపై సాగే పోలీసు దాడులను నిలిపివేయాలనే సాధారణ డిమాండ్లను మావోయిస్టు పార్టీ ఈసారి వినిపించకపోవడం గమనార్హం. కేవలం ఆదివాసీలు, గిరిజనుల హక్కులు, వారి సంక్షేమానికి ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేయడం విశేషం. ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలన, 1995 పెసా చట్టం, 2005 అటవీ హక్కుల చట్టం, కవ్వాల్ టైగర్ జోన్, అభయారణ్యాల ఎత్తివేత, ఆదివాసీల పోడు భూములకు పట్టాలు, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు, ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ, ఆదివాసీబంధు అమలు తదితర డిమాండ్లను మావోయిస్టులు ప్రభుత్వం ముందుంచుతున్నారు. చివరిగా.. ఎస్టీల్లో ఇతర కులాలను చేర్చవద్దని స్పష్టంచేశారు. ఎందుకు వస్తున్నట్లు..? మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించేందుకు రాజకీయ, భౌగోళిక, వాతావరణ కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం వేసవి కారణంగా అడవులు పలుచబడటం, ఆకులు రాలిపోవడంతో వీరు మరింత దట్టమైన అడవుల్లోకి లేదా తెలంగాణలోకి రావాల్సిన అనివార్య పరిస్థితులున్నాయి. అదేసమయంలో గోదావరిలో నీటిప్రవాహం తగ్గడం వల్ల ఎంపిక చేసిన ప్రాంతాల్లో నదిని దాటడం సులభంగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం గతంలో చేసిన చట్టాలు, విడుదల చేసిన జీవోల అమలుకు ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మావోల వ్యూహంగా కనిపిస్తోంది. -
అర్ధరాత్రి మహిళా ఎంపీ కారుపై రాళ్లు, రాడ్లతో దాడి
జైపూర్: కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న బీజేపీ లోక్‌సభ సభ్యురాలికి ఘోర పరాభవం ఎదురైంది. ఒక్కసారిగా కారును నిలువరించి రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోగా వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి రంజిత కోలి గెలిచారు. ఆమె తన నియోజకవర్గంలోని ఆస్పత్రుల సందర్శనకు మంగళవారం బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్పూర్ వెళ్తున్నారు. గ్రామం మీదుగా ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు.. ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. వీరి దాడితో ఎంపీ రంజిత, ఆమె అనుచరులు భయాందోళన చెందారు. వారి దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారు డిశ్చార్జయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విటర్లో పోస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అర్ధరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడి చేసిందని ఆరోపించారు. నేరాలకు రాజస్థాన్ అడ్డాగా మారిందని విమర్శించారు. చదవండి: సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన చదవండి: ఒక ప్రభుత్వం కాదు ఇది మూడు గ్రూపుల సర్కారు आज रात भरतपुर के आरबीएम हॉस्पिटल का निरीक्षण करने के बाद सीएचसी वैर का निरीक्षण करने जा रहीं भरतपुर सांसद श्रीमती रंजीता कोली जी के काफिले पर धरसोनी गांव के समीप हथियार बंद बदमाशों द्वारा हमला किया गया।@BJP4India @JPNadda @BJP4Rajasthan @DrSatishPoonia @chshekharbjp pic.twitter.com/CJkBECepDJ — Ranjeeta Koli MP (@RanjeetaKoliMP) May 27, 2021 -
‘బండి సంజయ్ కాన్వాయ్‌పై దాడి జరగలేదు’
సూర్యాపేటక్రైం : కోదాడలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై ఎలాంటి దాడి జరగలేదని కేవలం కొందరు ఎమ్మార్పీఎస్, స్వేరోస్ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఎస్పీ ఆర్.భాస్కరన్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో పార్టీ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరవుతున్నారనే సమాచారం పోలీసులకు ముందుగానే ఉందన్నారు. అందుకోసం ముందస్తుగా హుజూర్‌నగర్‌లో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూర్‌నగర్‌లో కార్యక్రమం ముగిసిన అనంతరం కోదాడకు వచ్చి అక్కడ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో కొందరు ఎమ్మార్పీఎస్, స్వేరోస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారన్నారు. ఆ సమయంలో పోలీసులు వెంటనే స్పందించి కాన్వాయ్‌ను అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకుని కాన్వాయ్‌ను పోలీసు రక్షణ మధ్య హుజూర్నగర్, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్‌కు పంపించామన్నారు. ఈ సంఘటనలో ఆందోళనకారులు ఇనుప రాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో వస్తున్నదంతా అబద్ధమన్నారు. ఈ సంఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి వాహనం ధ్వంసం కాలేదని అది గతంలో జరిగిన సంఘటనలో ధ్వంసమైందన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయగా చిలుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. సంఘటనలో ఎవరు పాల్గొన్నారో వీడియో ఫుటేజి ఆధారంగా పరిశీలించి వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. సంజయ్ పర్యటనలో ఎక్కడా పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు. సమావేశంలో డీఎస్పీ రఘు, ఇన్స్పెక్టర్లు ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. చదవండి: బండి సంజయ్ మూల్యం చెల్లించక తప్పదు.. -
ఢిల్లీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై కర్రలతో దాడి
-
కేజ్రీవాల్ కాన్వాయ్‌పై కర్రలతో దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై శుక్రవారం మధ్యాహ్నం కొందరు దుండగులు కర్రలు చేబూని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర ఢిల్లీలో 25 అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు సీఎం వెళుతుండగా నరేలా ప్రాంతంలో దాడి జరిగినట్టు సమాచారం. కేజ్రీవాల్ కారును ఆపేందుకు దాదాపు వంద మంది కర్రలతో ఆయన కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సీఎం కారు అద్దాలు పగులగొట్టేందుకూ వీరు ప్రయత్నించారు. కాగా గతంలోనూ కేజ్రీవాల్‌పై దుండగులు దాడికి యత్నించారు. గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీ సెక్రటేరియట్లో సీఎం కార్యాలయం వెలుపల ఓ వ్యక్తి కేజ్రీవాల్‌పై కారం చల్లారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దక్షిణ ఢిల్లీలో జరిగిన రోడ్‌షోలో ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంప చెళ్లుమనిపించారు. అంతకుముందు హర్యానాలో ఓ రోడ్‌షోలోనూ కేజ్రీవాల్‌పై దాడిచేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపింది. -
అమిత్‌షా కాన్వాయ్‌పై దాడికి నిరసనగా మానవహారం
సాక్షి, ఒంగోలు : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడిచేయడాన్ని నిరసిస్తూ బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు పివి.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సాగర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పివి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ దాటికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తీరు ముందస్తు వ్యూహం ప్రకారం చేసిందే అన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తులపైనే ఇటువంటి భౌతిక దాడులకు తెగబడుతుంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. రాజకీయ పార్టీ మీటింగ్‌లకు రాలేదని...కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా అమిత్‌షా హాజరయ్యారని, ఈ క్రమంలో ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తులకే భద్రత కల్పించలేని ప్రభుత్వం ఇక సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో వైపు హోంమంత్రి సైతం జరిగిన ఘటనను సమర్థిస్తూ వ్యాఖ్యానించడం బాధాకరమని, తక్షణమే దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుమాల రాఘవులు మాట్లాడుతూ భౌతిక దాడులకు పాల్పడాలనే భావనే హేయమైన చర్య అని, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శెగ్గెం శ్రీనివాసరావు, విన్నకోట సురేష్‌బాబు, ముదివర్తి బాబూరావు, భగత్ వినోద్, నన్నెపోగు సుబ్బారావు, ఉంగరాల హనుమంతరావు, కోటేశ్వరరావు, డేగల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దళ్లిపేటలో దాడి
పొందూరు, న్యూస్‌లైన్: టీడీపీ వర్గీయులు పెచ్చరిల్లిపోతున్నారు. విజయబాటలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతుండటాన్ని తట్టుకోలేక దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. మంగళవారం పొం దూరు మండలం దళ్లిపేటలో ఆమదాలవలస వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం కాన్వాయ్‌పై దాడి చేసి పార్టీకి చెందిన సర్పంచ్ మజ్జి గోపాలకృష్ణ వాహనాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను కొట్టారు. మంగళవారం రాత్రి దళ్లిపేటలో తమ్మినేని రోడ్డుషో నిర్వహిస్తుండగా టీడీపీ బైక్ ర్యాలీ ఎదురైంది. ఆ ర్యాలీకి దారివ్వాలని తమ్మినేని మైకులో తమ కార్యకర్తలకు సూచించారు. ఆ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాహనాలు ఒక పక్కకు జరగ్గా.. టీడీపీ ర్యాలీ ముందుకు సాగింది. ర్యాలీ దాటిపోతున్న సమయంలో సర్పంచ్ గోపాలకృష్ణకు చెందిన సుమోను గమనించిన కొందరు టీడీపీ కార్యకర్తలు దాన్ని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న డ్రైవర్ రామకృష్ణను కొట్టారు. ‘ఎక్కడ్రా మీ గోపాలకృష్ణ.. మొన్న తప్పించుకున్నాడు.. వాడిని ఎలాగైనా చంపేస్తామని హెచ్చరించారు. సుమోపై రాళ్లతో దాడి చేసి వెనుక అద్దాలు పగులగొట్టారని డ్రైవర్ గొర్లె రామకృష పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌కుమార్, ఎస్సై కుమార్‌లు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే తమ్మినేని ఎస్పీ, డిస్పీలకు ఫోనులో ఫిర్యాదు చేశారు. అనంతరం అనుచరులతో కలిసి స్ధానిక పోలీసు స్టేషన్‌కు వచ్చిన తమ్మినేని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. మా నాయకులు, కార్యకర్తలకు ప్రాణహాని ఉంది, వారికి రక్షణ కల్పించాలని కోరారు. కొద్ది రోజుల క్రితమే మజ్జి గోపాలకృష్ణపై లోలుగు శ్రీరాముల నాయుడు, అతని అనుచరులు హత్యా ప్రయత్నం చేశారని, అప్పుడు పోలీ సులు సరిగ్గా స్పందించకపోవడం వల్లే ఈరోజు దాడికి తెగించారని విమర్శించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కరాఖండాగా చెప్పారు. కొద్దిసేపటి తర్వాత సీఐ అశోక్‌కుమార్ వచ్చి తమ్మినేనితో మాట్లాడారు. లోలుగు శ్రీరాముల నాయుడుతో పాటు చిగిలిపల్లి రామ్మోహనరావు, సువ్వాడ మహాలక్ష్మి, దళ్లి నారాయణరావులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన తమ్మినేని పోలీసు స్టేషన్ నుంచి వెనుదిరిగారు.