దళ్లిపేటలో దాడి
పొందూరు, న్యూస్‌లైన్: టీడీపీ వర్గీయులు పెచ్చరిల్లిపోతున్నారు. విజయబాటలో వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతుండటాన్ని తట్టుకోలేక దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. మంగళవారం పొం దూరు మండలం దళ్లిపేటలో ఆమదాలవలస వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం కాన్వాయ్‌పై దాడి చేసి పార్టీకి చెందిన సర్పంచ్ మజ్జి గోపాలకృష్ణ వాహనాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను కొట్టారు. మంగళవారం రాత్రి దళ్లిపేటలో తమ్మినేని రోడ్డుషో నిర్వహిస్తుండగా టీడీపీ బైక్ ర్యాలీ ఎదురైంది. ఆ ర్యాలీకి దారివ్వాలని తమ్మినేని మైకులో తమ కార్యకర్తలకు సూచించారు. ఆ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, వాహనాలు ఒక పక్కకు జరగ్గా.. టీడీపీ ర్యాలీ ముందుకు సాగింది. ర్యాలీ దాటిపోతున్న సమయంలో సర్పంచ్ గోపాలకృష్ణకు చెందిన సుమోను గమనించిన కొందరు టీడీపీ కార్యకర్తలు దాన్ని చుట్టుముట్టారు. అక్కడే ఉన్న డ్రైవర్ రామకృష్ణను కొట్టారు.
‘ఎక్కడ్రా మీ గోపాలకృష్ణ.. మొన్న తప్పించుకున్నాడు.. వాడిని ఎలాగైనా చంపేస్తామని హెచ్చరించారు. సుమోపై రాళ్లతో దాడి చేసి వెనుక అద్దాలు పగులగొట్టారని డ్రైవర్ గొర్లె రామకృష పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌కుమార్, ఎస్సై కుమార్‌లు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే తమ్మినేని ఎస్పీ, డిస్పీలకు ఫోనులో ఫిర్యాదు చేశారు. అనంతరం అనుచరులతో కలిసి స్ధానిక పోలీసు స్టేషన్‌కు వచ్చిన తమ్మినేని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. మా నాయకులు, కార్యకర్తలకు ప్రాణహాని ఉంది, వారికి రక్షణ కల్పించాలని కోరారు.
కొద్ది రోజుల క్రితమే మజ్జి గోపాలకృష్ణపై లోలుగు శ్రీరాముల నాయుడు, అతని అనుచరులు హత్యా ప్రయత్నం చేశారని, అప్పుడు పోలీ సులు సరిగ్గా స్పందించకపోవడం వల్లే ఈరోజు దాడికి తెగించారని విమర్శించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కరాఖండాగా చెప్పారు. కొద్దిసేపటి తర్వాత సీఐ అశోక్‌కుమార్ వచ్చి తమ్మినేనితో మాట్లాడారు. లోలుగు శ్రీరాముల నాయుడుతో పాటు చిగిలిపల్లి రామ్మోహనరావు, సువ్వాడ మహాలక్ష్మి, దళ్లి నారాయణరావులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన తమ్మినేని పోలీసు స్టేషన్ నుంచి వెనుదిరిగారు.