నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు
సాక్షి, ఒంగోలు : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడిచేయడాన్ని నిరసిస్తూ బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు పివి.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సాగర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పివి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ దాటికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తీరు ముందస్తు వ్యూహం ప్రకారం చేసిందే అన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తులపైనే ఇటువంటి భౌతిక దాడులకు తెగబడుతుంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. రాజకీయ పార్టీ మీటింగ్‌లకు రాలేదని...కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా అమిత్‌షా హాజరయ్యారని, ఈ క్రమంలో ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తులకే భద్రత కల్పించలేని ప్రభుత్వం ఇక సామాన్యులకు ఎలా రక్షణ కల్పిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరో వైపు హోంమంత్రి సైతం జరిగిన ఘటనను సమర్థిస్తూ వ్యాఖ్యానించడం బాధాకరమని, తక్షణమే దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుమాల రాఘవులు మాట్లాడుతూ భౌతిక దాడులకు పాల్పడాలనే భావనే హేయమైన చర్య అని, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శెగ్గెం శ్రీనివాసరావు, విన్నకోట సురేష్‌బాబు, ముదివర్తి బాబూరావు, భగత్ వినోద్, నన్నెపోగు సుబ్బారావు, ఉంగరాల హనుమంతరావు, కోటేశ్వరరావు, డేగల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment