కృష్ణాజిల్లాలో రెచ్చిపోయిన కాల్‌మనీ వ్యాపారులు...
అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. తమ దగ్గర అప్పు తీసుకున్న పూజారి అడిగిన వెంటనే డబ్బులు చెల్లించకపోవడంతో ఇనుప రాడ్లతో దాడికి తెగబడి గాయపరిచారు. మోపిదేవి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న బుద్దు పవన్ కొన్ని సంవత్సరాల క్రితం వనవలయ్య అనే వడ్డీ వ్యాపారి నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. అసలు, చక్రవడ్డీలతో కలిపి అప్పు రూ.4 లక్షలకు చేరుకుంది. పవన్ అప్పుడప్పుడూ కొంత మొత్తం చెల్లిస్తున్నా వడ్డీ రేటు అధికం కావడంతో అప్పు, అప్పుగానే మిగిలింది.
కాగా, ఆదివారం రాత్రి పవన్ రేపల్లె నుంచి మోపిదేవి వస్తుండగా మోపిదేవి కాలనీలో వడ్డీ వ్యాపారి వనవలయ్య మరికొందరితో కలసి పవన్‌ను అడ్డగించి బాకీ తీర్చాలని అడిగాడు. దానికి పవన్ ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తప్పకుండా తీరుస్తానని కొంత సమయం కావాలని ఆయన్ను కోరాడు. దీంతో ఆగ్రహించిన వారు ఇనుప రాడ్లతో పవన్‌పై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన పవన్ అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అవనిగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.