AU VC
-
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌రెడ్డి, స్టీఫెన్‌పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి రావడంతో వారు రాజీనామా చేశారు.నిన్న వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా వీసీని భయబ్రాంతులకు గురిచేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్ గోపాల్ వ్యవహరించారుగతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.కాగా, తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. -
బోస్టన్ కమిటీ అత్యున్నత ప్రమాణాలు గల సంస్థ
-
బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం..
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా బోస్టన్ కమిటీకి అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరు ఉందని... ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి బీసీజీ అద్భుతమైన నివేదికను అందజేసిందని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీలుగా బీసీజీ నివేదిక ఉందన్నారు. ఒక్క నగరం నిర్మాణానికే లక్షకోట్లను వెచ్చించడానికి బదులు...ఆ నిధులను అన్ని ప్రాంతాలకు సమానంగా వినియోగించడం... సాగునీటి రంగానికి ప్రాధాన్యతనివ్వడం వంటివి బీసీజీ నివేదికలో ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణాలకి అనుకూలం కాదని మద్రాస్ ఐఐటి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తెలిపిందని... అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగే విధంగా బీసీజీ నివేదిక ఉందని ప్రసాద రెడ్డి తెలిపారు. -
‘కౌరవ’ వ్యాఖ్యలతో సంబంధం లేదు
న్యూఢిల్లీ: కౌరవులందరూ టెస్ట్‌ట్యూబ్ బేబీలని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయంగా ఆమోదయోగ్యం కావని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో అంశాలను, వక్తలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్‌సీఏ) వక్తల ప్రసంగాలను వడపోత చేయలేదన్నారు. ఓసారి వక్తను ఎంపిక చేసుకున్నాక, వాళ్లు మాట్లాడే అంశంపై ఎలాంటి తనిఖీలు, వడపోతలు జరగవని తేల్చిచెప్పారు. ‘శాస్త్రవేత్తలు ఏదైనా పిచ్చిమాటలు మాట్లాడినప్పుడు ఆ వర్గం నుంచి నిరసనలు ఎదుర్కొంటారు. ఓ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వీసీగా ఉండీ నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలనీ, డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం కంటే దశావతారం మరింత అర్థవంతంగా ఉందనీ, రావణుడికి 24 విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతమున్న గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీని శ్రీరాముడు, విష్ణువు వాడారన్నారు. -
ఉద్యోగుల సమష్టి కృషితో వర్సిటీ ప్రగతి
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రగతికి ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమేనని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను వీసీ సత్కరించారు. ఫార్మశీ విభాగం నిర్వహించిన పదవీవిరమణ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం ఉద్యోగులు తమ అనుభవాన్ని వర్సిటీ అభివృద్ధి్దకి వినియోగించాలని సూచించారు. దశాబ్ధాలుగా వర్సిటీకి విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించడం మంచి పరిణామమన్నారు. వీరి సేవలను వర్సిటీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఈఏ నారాయణ మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ జీవనాన్ని సాగించాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సేవలను వర్సిటీ గుర్తిస్తుందన్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, కార్యదర్శి పి.అప్పలరాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
చంద్రబాబు వద్దే తేల్చుకుంటా !
వీసీ ఎంపికలో చెల్లుబాటు కాని గంటా సిపారుసు ఆయన సూచనకు సీఎం ససేమిరా అసహనంతో రగులుతున్న మంత్రి నిర్ణయం తాత్కాలికంగా వాయిదా ఏయూ వీసీ ఎంపిక తతంగం మంత్రి గంటా రాజకీయ ప్రాభవానికి గండి కొడుతోంది. ఆయన సిఫారసులకు విలువలేకుండా పోతోంది. తన జిల్లాలో... అదీ తాను నిర్వహిస్తున్న శాఖ పరిధిలోని పోస్టు విషయంలోనే తన మాట చెల్లకపోవడం ఆయనలో అసహనాన్ని పెంచుతోంది. ఆ ఆగ్రహంతోనే ఇటీవల జరిగిన సెర్చ్ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అడ్డుకున్నారు. అదీ తాత్కాలికమే... అంతిమ నిర్ణయం మాత్రం ఆయన అభీష్టానికి వ్యతిరేకంగానే ఉంటుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. మొత్తానికి వీసీ ఎంపిక ప్రక్రియ గంటా రాజకీయ అధిపత్యానికి విషమ పరీక్షగా మారింది. ఆంధ్రాయూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎంపిక ప్రక్రియలో మంత్రి గంటా శ్రీనివాసరావు సిఫారసులకు సీఎం చంద్రబాబు ససేమిరా అంటున్నారు. వీసీగా నారాయణను నియమించాలని మంత్రి గంటా పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం వీసీ నియామకాంలోనూ తాను సూచించినవారికి అవకాశం ఇవ్వలేదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే వర్సిటీ విషయంలోనైనా తన సిఫారుసును ఆమోదించాలని కోరారు. అయితే గంటా ఎంతగా మొరపెట్టుకున్నా నారాయణకు వీసీగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సమ్మతించలేదు. ఇంతవరకు సెర్చ్ కమిటీ నిర్వహించిన రెండు సమావేశాల్లో నారాయణ పేరు కనీసం ప్రస్తావనకు కూడా రాలేదని విశ్వసనీయ సమాచారం. కమిటీ మొదటి సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. ఇటీవల జరిగిన రెండో సమావేశంలో కొన్ని పేర్లుపై చర్చించారు. కానీ వాటిలో నారాయణ పేరు లేదని వెల్లడికావడంతో మంత్రి గంటా నీరుగారిపోయారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణకుమారి, తిరుపతి ఎస్వీయూకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్లపైనే ప్రధానంగా చర్చించారు. ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలించారు. ఆరా... ఆగ్రహం: సెర్చ్ కమిటీ సమావేశం జరుగుతుండగానే వీసీ కోసం పరిణగిస్తున్న పేర్లపై గంటా ఆరా తీశారు. అందులో తాను సిఫారసు చేసిన నారాయణ పేరు లేదని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుతోనే తేల్చుకుంటానని ఆయన ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అంతవరకు వీసీ నియామకానికి సెర్చ్ కమిటీ తరపున ఎలాంటి నివేదిక ఇవ్వొద్దని కూడా ఆయనకు స్పష్టంగా సూచించారు. ఈ అంశంపై ఆయన సీఎం కార్యాలయ అధికారులతో కూడా అప్పటికప్పుడు మాట్లాడారు. దాంతో సీఎం సూచనల మేరకే వీసీ నియామకంపై తుది నిర్ణయం తీసుకోకుండానే సెర్చ్ కమిటీ సమావేశాన్ని ముగించారు. తాత్కాలిక ఉపశమనమే గంటా మనస్తాపం చెందడంతో సీఎం చంద్రబాబు వీసీ నియామకంపై నిర్ణయాన్ని అప్పటికి వాయిదా వేయించారు. కానీ ఆయన సిఫారసును ఆమోదించే పరిస్థితి మాత్రం లేదని స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారని సమాచారం. గంటాకు ఓ సారి సర్థిచెప్పి తరువాత తాను అనుకున్న విధంగానే వీసీని నియమించాలని సీఎం భావిస్తున్నారు. వీలైనంతవరకు ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన వారికే వీసీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఓ ప్రొఫెసర్‌పై చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఏయూకు చెందిన వారినే నియమించాలని భావిస్తే రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణకుమారి, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుల పేర్లను పరిగణనలోకి తీసుకుంటారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ఇటీవల వివాదాస్పదుడు కావడంతో కృష్ణకుమారి వైపు కాస్త మొగ్గు కనిపిస్తోంది. ఏది ఏమైనా వీసీ నియామకంలో మంత్రి గంటా మాట మాత్రం చెల్లుబాటుకావడం లేదని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలతో ఉన్నత విద్యాశాఖలోనే కాదు జిల్లాలో కూడా గంటా ప్రాభవం మసకబారుతుందని అంటున్నారు.