చంద్రబాబు వద్దే తేల్చుకుంటా !
- వీసీ ఎంపికలో చెల్లుబాటు కాని గంటా సిపారుసు
- ఆయన సూచనకు సీఎం ససేమిరా
- అసహనంతో రగులుతున్న మంత్రి
- నిర్ణయం తాత్కాలికంగా వాయిదా
ఏయూ వీసీ ఎంపిక తతంగం మంత్రి గంటా రాజకీయ ప్రాభవానికి గండి కొడుతోంది. ఆయన సిఫారసులకు విలువలేకుండా పోతోంది. తన జిల్లాలో... అదీ తాను నిర్వహిస్తున్న శాఖ పరిధిలోని పోస్టు విషయంలోనే తన మాట చెల్లకపోవడం ఆయనలో అసహనాన్ని పెంచుతోంది. ఆ ఆగ్రహంతోనే ఇటీవల జరిగిన సెర్చ్ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అడ్డుకున్నారు. అదీ తాత్కాలికమే... అంతిమ నిర్ణయం మాత్రం ఆయన అభీష్టానికి వ్యతిరేకంగానే ఉంటుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. మొత్తానికి వీసీ ఎంపిక ప్రక్రియ గంటా రాజకీయ అధిపత్యానికి విషమ పరీక్షగా మారింది.
ఆంధ్రాయూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎంపిక ప్రక్రియలో మంత్రి గంటా శ్రీనివాసరావు సిఫారసులకు సీఎం చంద్రబాబు ససేమిరా అంటున్నారు. వీసీగా నారాయణను నియమించాలని మంత్రి గంటా పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం వీసీ నియామకాంలోనూ తాను సూచించినవారికి అవకాశం ఇవ్వలేదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే వర్సిటీ విషయంలోనైనా తన సిఫారుసును ఆమోదించాలని కోరారు.
అయితే గంటా ఎంతగా మొరపెట్టుకున్నా నారాయణకు వీసీగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సమ్మతించలేదు. ఇంతవరకు సెర్చ్ కమిటీ నిర్వహించిన రెండు సమావేశాల్లో నారాయణ పేరు కనీసం ప్రస్తావనకు కూడా రాలేదని విశ్వసనీయ సమాచారం. కమిటీ మొదటి సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. ఇటీవల జరిగిన రెండో సమావేశంలో కొన్ని పేర్లుపై చర్చించారు. కానీ వాటిలో నారాయణ పేరు లేదని వెల్లడికావడంతో మంత్రి గంటా నీరుగారిపోయారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణకుమారి, తిరుపతి ఎస్వీయూకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్లపైనే ప్రధానంగా చర్చించారు. ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన మరో ఇద్దరి పేర్లను కూడా పరిశీలించారు.
ఆరా... ఆగ్రహం:
సెర్చ్ కమిటీ సమావేశం జరుగుతుండగానే వీసీ కోసం పరిణగిస్తున్న పేర్లపై గంటా ఆరా తీశారు. అందులో తాను సిఫారసు చేసిన నారాయణ పేరు లేదని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుతోనే తేల్చుకుంటానని ఆయన ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అంతవరకు వీసీ
నియామకానికి సెర్చ్ కమిటీ తరపున ఎలాంటి నివేదిక ఇవ్వొద్దని కూడా ఆయనకు స్పష్టంగా సూచించారు. ఈ అంశంపై ఆయన సీఎం కార్యాలయ అధికారులతో కూడా అప్పటికప్పుడు మాట్లాడారు. దాంతో సీఎం సూచనల మేరకే వీసీ నియామకంపై తుది నిర్ణయం తీసుకోకుండానే సెర్చ్ కమిటీ సమావేశాన్ని ముగించారు.
తాత్కాలిక ఉపశమనమే
గంటా మనస్తాపం చెందడంతో సీఎం చంద్రబాబు వీసీ నియామకంపై నిర్ణయాన్ని అప్పటికి వాయిదా వేయించారు. కానీ ఆయన సిఫారసును ఆమోదించే పరిస్థితి మాత్రం లేదని స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారని సమాచారం. గంటాకు ఓ సారి సర్థిచెప్పి తరువాత తాను అనుకున్న విధంగానే వీసీని నియమించాలని సీఎం భావిస్తున్నారు. వీలైనంతవరకు ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన వారికే వీసీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఓ ప్రొఫెసర్పై చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఏయూకు చెందిన వారినే నియమించాలని భావిస్తే రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణకుమారి, రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుల పేర్లను పరిగణనలోకి తీసుకుంటారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ఇటీవల వివాదాస్పదుడు కావడంతో కృష్ణకుమారి వైపు కాస్త మొగ్గు కనిపిస్తోంది. ఏది
ఏమైనా వీసీ నియామకంలో మంత్రి గంటా మాట మాత్రం చెల్లుబాటుకావడం లేదని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలతో ఉన్నత విద్యాశాఖలోనే కాదు జిల్లాలో కూడా గంటా ప్రాభవం మసకబారుతుందని అంటున్నారు.