మంత్రా.. మజాకా!
► గంటాపై ‘తుంపాల షుగర్ ఫ్యాక్టరీ’ కేసుల ఎత్తివేత
► ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
► రైతులపై మాత్రం కొనసాగుతున్న కేసులు
సాక్షి, విశాఖపట్నం: మొన్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు.. నేడు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు. గతంలో తమపై నమోదైన కేసుల నుంచి విజయవంతంగా బయటపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అచ్చెన్నాయుడుపై నమోదైన కేసులను మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసింది. తాజాగా రాష్ర్ట మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావుపై తుంపాల షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఆందోళనలో నమోదైన కేసులనూ ఎత్తివేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి మన్మోహన్‌సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో ఉన్న రైతు నాయకులు, రైతులు మాత్రం ముందస్తు బెయిల్‌పై ఉండటం గమనార్హం.
గంటా పిలుపుతో రైతుల ఆందోళన
గంటా 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొద్ది కాలానికి రైతులకు బకాయిల చెల్లింపు, క్రషింగ్ విషయంలో తుంపాల షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. పెద్దసంఖ్యలో హాజరైన రైతులు ఫ్యాక్టరీ ఆవరణలో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి కోరగా...అందుకు అప్పటి ఫ్యాక్టరీ ఎండీ సత్యనారాయణ నిరాకరించారు. గంటా గేట్లు తోసుకుంటూ ముందుకువెళ్లగా ఆయన వెంట మిగిలిన రైతులంతా కదిలారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బయటనుంచి కొంతమంది రాళ్లు విసిరిన ఘటనలో అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ విద్యాసాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఎస్‌ఐ ఫిర్యాదుతో గంటాతో పాటు 27 మందిపై అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో (క్రైం నం.15/2009) హత్యాయత్నం (307) సహా 147, 148, 332, 333, 447, 188, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్టు 1984 కింద కేసులు నమోదు అయ్యాయి. ఎమ్మెల్యే కావడంతో గంటాను ఏ-11 ముద్దాయిగా చేర్చారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన గంటా మంత్రి పదవి చేపట్టారు. తొలినుంచీ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సాహసించని పోలీసులు చార్జిషీట్‌లో అబ్‌స్కాండింగ్ (తప్పించుకుని తిరుగుతున్నట్టు)గా పేర్కొంటూ వచ్చారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ సహా మొత్తం 13 మందిని విడతల వారీగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించగా బెయిల్‌పై విడుదలయ్యారు.
ఒకరు మృతి చెందగా గంటాతో పాటు మిగిలిన వారిని రెండు నెలల క్రితం వరకు అబ్‌స్కాండింగ్‌గానే చూపించారు. వీరిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో గంటా మినహా మిగిలిన రైతులంతా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని కోర్టులో సరెండర్ అయ్యారు. టీడీపీలో మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి తనపై ఉన్న కేసులను ఎత్తి వేయించుకునేందుకు గంటా కృషి కొనసాగించారు. ఆయనపై కేసులను ఎత్తి వేయాలంటూ హోం మంత్రి చినరాజప్ప 2015 ఆగస్టు 28న డీఐజీకి సిఫారసు చేశారు. ఎల్‌ఆర్‌ఆర్‌సీ నం. 89/సీ1/2015తో 2015 నవంబర్ 11న గంటాపై కేసులు ఎత్తివేసేందుకు డీజీపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. డీజీపీ సిఫారసు మేరకు మంత్రి గంటాపై ఉన్న కేసులను ఎత్తివేస్తూ.. ఆయనపై ఇక ఎలాంటి ప్రాసిక్యూషన్ జరపరాదంటూ ప్రిన్సిపల్ కార్యదర్శి శుక్రవారం జీఓ.ఆర్టీ నం.143ను జారీ చేశారు.
రగిలిపోతున్న రైతులు
గంటాపై కేసుల ఎత్తివేతతో ఇదే కేసులో ఉన్న మిగిలిన రైతులు మండిపడుతున్నారు. ఆయన పిలుపుతోనే నాటి ఆందోళనలో తామంతా పాల్గొన్నామని, ఇప్పుడు తమను వదిలేసి తనపై ఉన్న కేసులను మాత్రమే ఉపసంహరింప చేయించుకోవడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. ప్రజాప్రతినిధికొక రూల్...సామాన్యులకు మరో రూలా? అని ప్రశ్నిస్తున్నారు. తమపై కూడా కేసులను పూర్తిగా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.