Australia A team
-
‘పింక్’ పిలుపు...
డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యాక భారత జట్టు గులాబీ బంతితో ఒకే ఒక మ్యాచ్ (2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో) ఆడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వచ్చే గురువారం నుంచి మరో ‘పింక్’ పోరులో తలపడాల్సి ఉంది. దానికి సిద్ధమయ్యేందుకు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్‌తో పోలిస్తే పిచ్‌లో తేడా ఉన్నా... ఫ్లడ్‌లైట్లలో, పింక్ బాల్‌తో ఆడటం అసలు సమరానికి ముందు సరైన సన్నాహకంగా భావించవచ్చు. సిడ్నీ: టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమ వనరులను మరింతగా పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా ‘ఎ’తో నేటి నుంచి జరిగే ఈ మూడు రోజుల మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మినహా భారత టెస్టు జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లంతా ఆడే అవకాశం ఉంది. 12 రోజుల వ్యవధిలో వన్డే, టి20 సిరీస్‌లు ఆడటంతో అలసిపోయినట్లు భావిస్తున్న కెప్టెన్ తొలి టెస్టుకు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్నాడు. బరిలోకి విహారి... కోహ్లి జట్టులోకి రావడం మినహా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే బృందమే తొలి టెస్టులోనూ బరిలోకి దిగే అవకాశం దాదాపు ఖాయమే. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడని రెగ్యులర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఇక్కడ తన బ్యాటింగ్ పదును పరీక్షించుకోవాల్సి ఉంది. రెండో ఓపెనర్‌గా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందా లేక పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ప్రయత్నిస్తారా ఇక్కడ తేలిపోతుంది. పుజారా, రహానేలు మరింత ప్రాక్టీస్ ఆశిస్తుండగా ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారిపై కూడా అందరి దృష్టి ఉంది. తొలి టెస్టులో భారత్ నలుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ఆడాలని భావిస్తే ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా విహారికి అవకాశం దక్కుతుంది. అతనికి ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్ను ఆడించాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ మ్యాచ్‌లో కుల్దీప్ వైవిధ్యమైన బౌలింగ్ అదనపు బలంగా మారుతుందనుకుంటే అతనికీ తగినంత ప్రాక్టీస్ అవసరం. ఇషాంత్ లేకపోవడంతో షమీ, బుమ్రాలపై మరింత బాధ్యత పెరిగింది. టి20లకు దూరంగా ఉండి వీరు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి పింక్ బంతితో ఆసీస్ పిచ్‌పై సాధ్యమైనంత ప్రాక్టీస్‌ను కోరుకుంటున్నారు. వికెట్ కీపర్‌గా సాహా తొలి మ్యాచ్‌లో సత్తా చాటగా... ఇప్పుడు అతడినే కొనసాగిస్తారా లేక రిషభ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తారా చూడాలి. సత్తా చాటేందుకు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు కూడా మరీ బలహీనంగా ఏమీ లేదు. టెస్టు ఓపెనర్‌గా ఖాయమైన జో బర్న్స్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రదర్శనతో టెస్టు తుది జట్టులో స్థానం ఆశిస్తున్న కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, మిషెల్ స్వెప్సన్ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా గ్రీన్ ఇక్కడ చెలరేగితే టెస్టు క్రికెటర్‌గా ప్రమోషన్ దక్కవచ్చు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు ఆడిన నిక్ మ్యాడిసన్, మార్కస్ హారిస్ కూడా సొంత మైదానంలో సత్తా చాటగలరు. గాయంతో మోజెస్ హెన్రిక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫస్ట్ క్లాస్ హోదా ఉంటేనే... సరిగ్గా తొలి టెస్టు ఆడే జట్టుతోనే ప్రాక్టీస్ చేయాలని భారత్ భావిస్తే (కోహ్లి మినహా) ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా ఇవ్వాలని ఆతిథ్య బోర్డును కోరవచ్చు. అప్పుడు మ్యాచ్‌లో తీవ్రత పెరుగుతుంది. పూర్తి స్థాయిలో 11 మంది తుది జట్టునే బరిలోకి దించాల్సి ఉంటుంది. లేదంటే మామూలు టూర్ మ్యాచ్‌లాగానే ఎవరైనా గరిష్టంగా 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేస్తూ దాదాపు అందరు ఆటగాళ్లను పరీక్షించుకోవచ్చు. సాధారణంగా పర్యాటక జట్టు విజ్ఞప్తి చేస్తేనే ఆతిథ్య బోర్డు స్పందిస్తుంది. -
ఆసీస్ ‘ఎ’కు ఆధిక్యం
సిడ్నీ: టెస్టు సిరీస్ సన్నాహాల కోసం జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/44), సిరాజ్ (2/71) టచ్‌లోకి వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఆధిక్యం లభించింది. ముందుగా సోమవారం 237/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ మరో 10 పరుగులే చేసి 247/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ‘ఎ’ రెండో రోజు ఆట నిలిచే సమయానికి 85 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్రీన్ (114 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. టిమ్ పైన్ (44; 4 ఫోర్లు) కూడా రాణించాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’ జట్టు 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. మంగళవారం ఆటకు ఆఖరి రోజు. మిగిలిన 2 వికెట్లను పడగొట్టాక... భారత ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. -
ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టుదే సిరీస్
బ్రిస్బేన్: సిరీస్ విజేతను నిర్ణయించే అనధికారిక మూడో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు సమష్టిగా విఫలమైంది. దీంతో చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (70 బంతుల్లో 45; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ వేద కృష్ణమూర్తి (61 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఆకట్టుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ (0) నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రానో 3 వికెట్టు తీయగా... అన్నాబెల్ సదర్‌ల్యాండ్ , తహిలా మెక్‌గ్రాత్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతరం స్వల్ప విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 39.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. 119/7తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను బర్న్స్ (52 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), స్ట్రానో (37 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) ఆదుకున్నారు. వీరు అజేయంగా ఎనిమిదో వికెట్‌కు 58 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు, తనూజా కన్వర్ 2 వికెట్లు దక్కించుకున్నారు. -
భారత్ ‘ఎ’ 223/3
బెంగళూరు: ఓపెనర్లు రవికుమార్ సమర్థ్ (83; 8 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్ (86; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో భారత్ ‘ఎ’ దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 123 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (30 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 290/6తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసీస్ 109 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిచెల్ మార్‡్ష (113; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. -
అదరగొట్టిన ఆసీస్ ‘ఎ’
9 వికెట్లతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై గెలుపు ముక్కోణపు సిరీస్ చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ముక్కోణపు సిరీస్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై ఘన విజయం సాధించింది. చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన సఫారీ జట్టు 48.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. హెండ్రిక్స్ (64 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎల్గర్ (49 బంతుల్లో 28; 1 సిక్స్), జోండో (31 బంతుల్లో 21; 2 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. కోల్టర్‌నీల్ 3, ప్యాటిన్సన్, బోయెసీ, ఎగర్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఆసీస్ 31 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి నెగ్గింది. ఉస్మాన్ ఖవాజా (82 బంతుల్లో 73; 9 ఫోర్లు), బర్న్స్ (91 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు.