Australian boy
-
బిస్కెట్ల కోసం చేయి పెట్టి...
మెల్ బోర్న్: ఎదురుగా బిస్కెట్లు ఊరిస్తుంటే ఆబగా అందుకుందామని వెండింగ్ మెషీన్ లో చేయి పెట్టిన ఆసీస్ చిన్నారి అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయాడు. ఆరు గంటల తర్వాత ప్రమాదం నుంచి బయటపెట్టాడు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో ఈ ఘటన చేసుకుంది. నాలుగేళ్ల లియో బిస్కెట్ల కోసం వెండింగ్ మిషన్ లో చేయి పెట్టాడు. బిస్కెట్లు తీసుకునేలోపు అతడి చేయి మిషన్ లో ఇరుక్కుపోయింది. దీంతో లియో బాధతో విలవిల్లాడు. పెద్దగా కేకలు పెట్టాడు. సమాచారం అందుకున్న మెల్ బోర్న్ అగ్నిమాపక సిబ్బంది లొన్స్ డేల్ స్ట్రీట్ లోని మిషన్ వద్దకు చేరుకున్నారు. 6 గంటల పాటు శ్రమించి చిన్నారికి విముక్తి కల్పించారు. తన కుమారుడు వెండింగ్ మిషన్ ను చూడడం ఇదే మొదటిసారని లియో తండ్రి ఆరోన్ షర్తోవుస్ తెలిపారు. బిస్కట్లు, ఇతర తినుబండారాలు మిషన్ లో కనపడడంతో అందులో చేయి పెట్టి ఉంటాడని పేర్కొన్నారు. లియో పెట్టిన కేకలు వీధంతా వినిపించాయని ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారు. లియో సురక్షితంగా ఉన్నప్పటికీ ముందుజాగ్రత్త కోసం అతడిని రాయల్ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారని స్థానిక మీడియా తెలిపింది. -
హత్య కేసులో బెయిల్ కోసం బాలుడు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ హత్యకు సంబంధించి బెయిల్ కోసం ఓ పదకొండేళ్ల బాలుడు దరఖాస్తు చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఈ హత్య కేసు విచారణకు తొలిసారి కోర్టుకు హాజరైన ఆ బాలుడికి ఇదే నెల 17న మరోసారి హాజరు సమయంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరేందుకు దరఖాస్తు చేస్తున్నట్లు ఆ బాలుడి తరుపు న్యాయవాది తెలిపాడు. ఈ నెల 5న ఆస్ట్రేలియాలోని ఓ రైల్వే స్టేషన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో పరస్పరం ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఒక వర్గానికి చేతికి చిక్కగా వారు కత్తులతో పొడిచి చంపేశారు. ఆ ఘటన అక్కడ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఆ హత్య చేసిన గ్రూపులో పదకొండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. దీంతో పోలీసులు బాలుడితో సహా మొత్తం 20మందిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా చట్టం ప్రకారం పదేళ్లు దాటిని వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంటుంది. గతంలో 2010లో పద్నాలుగేళ్ల యువకుడు ఇలాంటి ఆరోపణల కింద అరెస్టుకాగా, ఆ తర్వాత తక్కువ వయసులో ఉండి హత్యారోపణల కింద ఓ పదకొండేళ్ల బాలుడు అరెస్టు కావడం ఇది రెండోసారి. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు!
మెల్ బోర్న్: పుచ్చకాయ బాలుడు(వాటర్ మెలన్ బాయ్) సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. 10 ఏళ్ల ఆస్ట్రేలియా బాలుడు మిచెల్ స్కెహిబెసీ పుచ్చకాయను తొక్కతో సహా ఆబగా తింటూ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'ఫస్ట్ వైరల్ హిట్ ఆఫ్ ది 2016'గా చక్కెర్లు కొడుతోంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో శనివారం మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగాడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూస్తూ మిచెల్ లైవ్ టీవీ కెమెరాకు చిక్కాడు. పుచ్చకాయను తొక్కతో సహా తినేస్తున్న అతడిని చూసి కామెంటేటర్లు అవాక్కయ్యారు. 'అతడిని చూడండి తొక్కతో సహా పుచ్చకాయ లాగించేస్తున్నాడు' అంటూ కామెంట్లు చేయడంతో అందరూ అతడిని ఆసక్తిగా గమనించారు. కెమెరా కంటపడగానే అతడు రెట్టించిన ఉత్సాహంతో పుచ్చకాయను కొరకడం మొదలు పెట్టాడు. ఈ వీడియో వాటర్ మెలన్ బాయ్ హేష్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్రెండవుతోంది. ట్విటర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'ఫస్ట్ ఇంటర్నెట్ హీరో ఆఫ్ 2016'గా పీపుల్స్ మేగజీన్ వర్ణించింది. అయితే తొక్కతో పుచ్చకాయ తినడం అంత ఈజీ కాదని బీబీసీతో మిచెల్ స్కెహిబెసీ చెప్పాడు. చాలా ప్రయత్నం చేసిన తర్వాతే ఇలా తినగలుగుతున్నానని తెలిపాడు. రెండేళ్ల ప్రాయం నుంచే తొక్కతో సహా పుచ్చకాయ తింటున్నానని వెల్లడించాడు. మిచెల్ పుచ్చకాయ తింటున్న దృశ్యాన్ని ఈఎస్పీఎన్ 'ప్లే ఆఫ్ ది డే'గా ప్రకటించింది. అయితే ఈ పురస్కారం అందుకునేందుకు అతడు నిరాకరించాడు. 'నేను నిజంగా హీరోను కాదు. నేనో సాధారణ బాలుడిని' అంటూ మిచెల్ వినయంగా చెప్పాడు. -
ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమగ్రంధి అమరిక!
సిడ్నీ: వైద్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమ గ్రంధిని ఆస్ట్రేలియా డాక్టర్లు విజయవంతంగా అమర్చారు. గత కొంతకాలంగా డయాబెటీస్ తో బాధపడుతున్నఏవియర్ హేమ్స్ అనే నాలుగేళ్ల బాలుడికి కృత్రిమ క్లోమగ్రంధిని అమర్చారు. ఆ బాలుని రక్తంలో గ్లూకోజ్ శాతం గణనీయంగా పడిపోవడంతో తీవ్రమైన బాధతో కొట్టుమిట్టాడతున్నాడు. దీంతో ఆ బాలున్ని తల్లి దండ్రులు పెర్త్ మార్గెరెట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఆ బాలునికి క్లోమ గ్రంధి మాదిరిగా పనిచేసే కృత్రిమ గొట్టాన్ని అమర్చారు. దీని ద్వారా ఆ బాలుని రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తెలుసుకునే వీలుంటుంది. శరీరంలో సుగర్ లెవిల్స్ పడిపోయేనప్పుడే కాకుండా ఇన్సులిన్ విడుదల కావడం పూర్తిగా ఆగిపోయినప్పుడు ఈ గొట్టం పసిగట్టి సమాచారాన్ని అందిస్తోంది. దీంతో వారి తల్లి దండ్రులకు ఆ బాలుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని ఆ ఆస్పత్రి ప్రొఫెసర్ టిమ్ జోన్స్ చెబుతున్నారు.