ఆస్ట్రేలియాలో ఓ హత్యకు సంబంధించి బెయిల్ కోసం ఓ పదకొండేళ్ల బాలుడు దరఖాస్తు చేసుకోనున్నాడు.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ హత్యకు సంబంధించి బెయిల్ కోసం ఓ పదకొండేళ్ల బాలుడు దరఖాస్తు చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఈ హత్య కేసు విచారణకు తొలిసారి కోర్టుకు హాజరైన ఆ బాలుడికి ఇదే నెల 17న మరోసారి హాజరు సమయంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరేందుకు దరఖాస్తు చేస్తున్నట్లు ఆ బాలుడి తరుపు న్యాయవాది తెలిపాడు. ఈ నెల 5న ఆస్ట్రేలియాలోని ఓ రైల్వే స్టేషన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలో పరస్పరం ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ఒక వర్గానికి చేతికి చిక్కగా వారు కత్తులతో పొడిచి చంపేశారు. ఆ ఘటన అక్కడ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఆ హత్య చేసిన గ్రూపులో పదకొండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. దీంతో పోలీసులు బాలుడితో సహా మొత్తం 20మందిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా చట్టం ప్రకారం పదేళ్లు దాటిని వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే వీలుంటుంది. గతంలో 2010లో పద్నాలుగేళ్ల యువకుడు ఇలాంటి ఆరోపణల కింద అరెస్టుకాగా, ఆ తర్వాత తక్కువ వయసులో ఉండి హత్యారోపణల కింద ఓ పదకొండేళ్ల బాలుడు అరెస్టు కావడం ఇది రెండోసారి.