ఆస్ట్రేలియాకు పాకిన బెండపూడి విద్యార్థుల ఖ్యాతి.. యూట్యూబ్ చూసి..
కాకినాడ సిటీ: తుని నియోజకవర్గం బెండపూడి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్లో మాట్లాడుతున్న వీడియోలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన వీడియోలు యూట్యూబ్లో చూసిన ఆస్ట్రేలియా దేశం సిడ్నీ నుంచి వినోద్, వీవీఎన్ కుటుంబ సమేతంగా గురువారం బెండపూడి పాఠశాలను సందర్శించారు. ఇంగ్లిషు ఉపాధ్యాయుడు ప్రసాద్ మాస్టర్ విద్యార్థులకు సులభంగా ఆంగ్ల భాషలో మాట్లాడించిన విధానం, అనుసరించిన మెళకువలను అడిగి తెలుసుకున్నారు.
చదవండి: గ్రామీణ క్రీడల్లో నవశకం..
అనంతరం గురువారం రాత్రి కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినోద్, వీవీఎన్ దంపతులు బెండపూడి పాఠశాల విద్యార్థుల మాదిరిగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంగ్లిషులో మాట్లాడే విధంగా ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను పైలెట్ ప్రాజెక్టుగా తుని నియోజకవర్గంలో ప్రారంభించిన రీడ్నెస్ ఇనిషియేటీవ్ ఫర్ సిట్యూవేషనల్ ఇంగ్లిష్ (రైజ్) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అభినందించారు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విధానాన్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా దేశం నుంచి కాకినాడ జిల్లాకు విచ్చేసినందుకు కలెక్టర్ కృతికా శుక్లా సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన వినోద్ ఆ్రస్టేలియాలో స్థిరపడ్డారు. ఆ్రస్టేలియాకు చెందిన వీవీఎన్ను వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెండపూడి ఇంగ్లిష్ టీచర్ రైజ్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి. ప్రసాద్, కె.పాల్రాజ్ తదితరులు ఉన్నారు.