Austrian
-
ఆస్ట్రియన్ పర్యాటకురాలికి కేరళ పోలీసుల సమన్లు
కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. పాలస్తీనా అనుకూల పోస్టర్‌ను చింపివేసూ ఒక ఆస్ట్రియన్ యూదు పర్యాటకురాలు కేరళలో స్థానికులతో వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వారం ప్రారంభంలో ఎర్నాకులం జిల్లా ఫోర్ట్ కొచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పోస్టర్‌ను చింపివేస్తున్న ఆమెను వారించేందుకు స్థానిక యువకులు ప్రయత్నించగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ పోస్టర్ చినిగిన ముక్కలను తీయమని అక్కడున్న యువకులు ఆమెకు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ గోడపత్రికతో సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు ఆమెకు సూచించడాన్ని కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. An Austrian tourist tears down pro-palestinian posters in Kochi, India. What an entitled Zionist woman. Kerala Police filed a FIR against her. pic.twitter.com/X4CM7tIJCM — Mahesh Kusumagiri (@maheshkusumagir) April 17, 2024 ఈ వీడియో వైరల్‌గా మారిన నేపధ్యంలో కేరళ పోలీసులు విచారణ కోసం ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ)కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్ అజీమ్ కెఎస్ ఆ మహిళపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. ఎస్ఐవో అతికించిన పోస్టర్లను ఆ ఆస్ట్రియన్ యువతి చించివేసింది. కాగా గత జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్‌బక్స్ స్టోర్‌పై పాలస్తీనా అనుకూల పోస్టర్లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నాడు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం స్టార్‌బక్స్ స్టోర్ గ్లాస్ డోర్‌పై ఆ విద్యార్థులు ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసిన పోస్టర్లను అతికించారు. గాజాలో జరిగిన యుద్ధ నేపధ్యంలో స్టార్‌బక్స్ ఇజ్రాయెల్‌కు అనుకూల వైఖరిని ప్రదర్శించినదుకు విమర్శలకు గురైంది. -
ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే!
వియన్నా: అందమైన ఇల్లు, విలాసవంతమైన కారు సొంతం చేసువాలనే కోరిక సగటు మానవుడికి అందమైన కలగానే మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక పెద్దాయన కార్లను చూస్తే పలువురు సెలబ్రిటీలు, బిలియనీర్లకు సైతం అసూయ కలగాల్సిందే. అది కూడా ఆయన కొన్నది అలాంటి ఇలాంటి కార్లు కాదు.. ప్రపంచంలోనే అతి ఖరీదైన కార్లు. గత ఐదు దశాబ్దాలుగా కార్లను కొంటూనే ఉన్న ఆయన తన 80 ఏళ్ల వయసుకి తగ్గట్టుగా ఏకంగా 80 కార్లను సొంతం చేసుకున్నాడు. అభిరుచికి తగ్గట్టుగా కార్లను కొనడమే కాదు.. అంతే గొప్పగా గ్యారేజీని కూడా ఏర్పాటు చేశారు. ‘లివింగ్ రూం’ గా పిలుచుకునే తన గ్యారేజ్‌ను అంతకంటే ఖరీదైన భవనంగా తీర్చిదిద్దుకోవడం మరో విశేషం. దీన్ని బట్టే లగ్జరీకార్లపై ఆయనకున్న మోజును అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చెందిన 80ఏళ్ల ఒట్టొకర్ జె ఏకంగా 80 లగ్జరీ కార్లను సేకరించడం విశేషంగా నిలిచింది. లగ్జరీ కార్లు సేకరించటమంటే జెకు కొన్ని దశాబ్దాలుగా సరదా. తాజాగా ఒట్టొకర్ జె 80వ పోర్సే బాక్స్టర్ స్పైడర్ కారును కొనుగోలుచేసి మొత్తం ప్రపంచాన్నే తన వైపునకు తిప్పుకున్నారు. 1972లో ఒట్టొకర్ మొదటి పోర్సే కారును కొన్నాడు. ఇక అప్పటి నుంచి తన గ్యారేజీని వివిధ పోర్సే మోడళ్లతో నింపేస్తూనే ఉన్నారు. దాదాపు 50ఏళ్ల క్రితం ఒకరోజు అతడు రోడ్డుపై వెళ్తుండగా పోర్సే కారు అతని పక్కనుంచి దూసుకెళ్లిందట. ఇక అంతే అప్పటినుంచి వాటిపై ప్రేమ పిచ్చి పిచ్చిగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే డబ్బులు పొదుపు చేసి మరీ కార్లను కొనుగోలు చేసేవారు. అలా తొలి పోర్సే స్పీడ్ ఎల్లో 911 ఈ కారును ఇంటికి తెచ్చుకున్నారు. ప్రస్తుతం జె గ్యారేజీలో 38 వేర్వేరు పోర్సే మోడల్ కార్లు ఉన్నాయి. నెలలో రోజుకు ఒకటి, రెండు వారాల్లో వీకెండ్స్ ఒకటి చొప్పున వాడతానని చెప్పుకొచ్చారు ఒట్టొకరే. తాజాగా మియామి బ్లూ కలర్ పోర్సే బాక్స్‌స్టర్ స్పైడర్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి తొలి కస్టమర్ ఒట్టొకరే కావటం మరో విశేషం. ఇంకా రేస్ కార్లు, ఎనిమిది సిలిండర్ల ఇంజిన్ ఉండే పోర్స్చే 910, 917, 956, 904, 964 కప్ లాంటి మోడల్స్ ఆయనగ్యారేజ్లో కొలువుదీరాయి.ఇప్పటి వరకు తొమ్మిది వెర్షన్ల కారెరా ఆర్ ఎస్ మోడళ్లను సేకరించగా, భవిష్యత్తులో మరికొన్ని కార్లను సేకరిస్తానని ఒట్టొకర్ చెబుతున్నారు. హ్యూమన్ టచ్ లేకపోతే..పోర్సే కార్లు కేవలం యంత్రాలు మాత్రమే.. అదే మనుషుల తోడుంటే.. అవి కూడా ప్రాణం ఉన్న మనుషుల్లాంటివే..అంటారు మురిపెంగా జె .. తన గ్యారీజేలోని అందమైన గ్యాలరీని చూసుకుంటూ.. -
హైవేపై వేలాది కోళ్లు... ట్రాఫిక్ జాం
ఆస్ట్రియా: వియన్నాలో మంగళవారం ఉదయం వింత ఘటన చోటు చేసుకుంది. దేశరాజధానిని కలిపే రహదారిపై వేలాది కోళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రియా దేశం ఉత్తరాన ఉన్నల లింజ్ వద్ద ఈ సంఘటన జరిగింది. కోళ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ లింజ్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులోని వేలాది కోళ్లలో కొన్ని చనిపోగా మరికొన్ని రోడ్డుపైకి చేరాయి. 160 మీటర్ల వెడల్పు ఉన్న ఆ రోడ్డు కోళ్లతో నిండిపోయింది. సుమారు ఏడువేల కోళ్లు రోడ్డుపైకి చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక వాహనదారులు వాహనాలు నిలిపేసి వాటిని ఆసక్తికరంగా తిలకించసాగారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు కోళ్లను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో కశ్యప్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాడు. డేవిడ్ ఒబెర్‌నోస్టెరెర్ (ఆస్ట్రియా)తో జరిగిన తొలి రౌండ్లో కశ్యప్ 11-3తో ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగాడు. ఇక రెండో రౌండ్లో కశ్యప్ 21-18, 21-12తో ఆండెర్స్ అంటన్సెన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి తన్వీ లాడ్ 21-19, 18-21, 9-21తో చిసాతో హోషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌తో కశ్యప్ ఆడనున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; సోనీ ద్వి కుంకోరో (ఇండోనేసియా)తో అజయ్ జయరామ్; జుల్కర్నైన్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు. -
'భారత్‌లో పెట్టుబడులే మాకు ఆసక్తి'
న్యూఢిల్లీ: భారత్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నామని ఆస్ట్రియా విదేశాంగమంత్రి సెబాస్టియన్ క్రూజ్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , ఆస్ట్రియా విదేశాంగ మంత్రి సెబాస్టియన్ క్రూజ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశం ద్వారా యూరప్‌తో తమ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ ముందడుగు వేయనుందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ, విద్యుత్, సహజవాయువుశాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుతో కూడా క్రూజ్ సమావేశం కానున్నారు. అనంతరం గురువారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను, ప్లాన్సీ ఇండియా మెటీరియల్ సంస్థ(మైసూర్)ను సందర్శించనున్నారు. ఈ సంవత్సరం జరగబోయే యూరోపియన్ యూనియన్(ఈయూ), ఇండియా సమావేశం, సమావేశ ప్రాముఖ్యతను గురించి మంగళవారం నాటి సమావేశంలో చర్చించారు.