ఆటో యూనియన్లతో చర్చలు విఫలం
హైదరాబాద్: ఆటో యూనియన్లతో ఆర్టీఏ అధికారులు జరిపిన చర్చలు విఫలమైయ్యాయి. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి ఆటో యూనియన్లు సమ్మె బాటపట్టనున్నాయి. హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వాధికారులతో ఆటో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో యూనియన్ నాయకులు నిరవధిక ఆటోబంద్కు పిలుపినిచ్చారు.
రవాణా, పోలీసు అధికారుల స్పెషల్డ్రైవ్కు వ్యతిరేకంగా తమపై కొనసాగుతున్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని సుమారు లక్షా 30 వేల ఆటోలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఆటోమీటర్ ట్యాంపరింగ్, పరిమితికి మించిన ప్రయాణికుల తరలింపు, డ్రైవింగ్ లెసైన్సు లేకుండా ఆటోలు నడపడం, ప్రయాణికులపై దౌర్జన్యం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేయడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలపై ఈ నెల 16 నుంచి పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సంగతి విదితమే.