‘ఆటోమ్యాటిక్’గా ఆస్తుల బదిలీ..!
కొత్తపేట(గుంటూరు) : రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖలో అధునాతన సాంకేతిక ప్రక్రియే ఆటోమ్యాటిక్ మ్యూటేషన్. అడంగళ్లు, ఇంటిపన్ను, ఆస్తుల సర్వహక్కులూ రిజిస్ట్రేషన్ రోజునే కొనుగోలుదారుని పేరు మీదకు బదిలీ అవటం ఈ విధానం విశిష్టత. ఈ నూతన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు పరచనున్నది. ప్రస్తుతం జిల్లాలో కొల్లిపర సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ రూపుదిద్దుకుంటుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారికంగా అమలు చేయనున్నారు.
ఆస్తుల బదిలీ ఇక సులభం..
కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ మొదలు, ఆస్తులపై సర్వహక్కులు పొందేంత వరకు ప్రస్తుతం నానా తంటాలు పడాల్సి వస్తోంది. భూములు క్రయవిక్రయ దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకున్న పిదప, వీటి తాలుకా ఈసీలను రిజిస్ట్రారు కార్యాలయం నుంచి పొంది, పూర్తి ఆధారాలతో తహశీల్దార్ కార్యాలయంలో పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దీనికోసం అక్కడున్న గ్రామ రెవిన్యూ అధికారుల నుంచి తహశీల్దార్ వరకు అందరినీ ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. రోజుల తరబడి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప, పాసు పుస్తకాలు పొందలేని దుస్థితి.
అయితే ఈ సమస్యలన్నింటికీ ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ త్వరలో చెక్ పెట్టనుంది. ప్రభుత్వం క్షేత్రస్థాయి క సరత్తుల అనంతరం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అయిన రోజునే కొనుగోలుదారుని పేరు అడంగల్‌లో ఆటోమ్యాటిక్‌గా నమోదు అవుతుంది. అడంగల్ కాపీని కొనుగోలుదారునికి సాఫ్ట్వేర్ ద్వారా అందజేస్తారు. ఫలితంగా భూమిని కొనుగోలు చేసిన మరుసటి రోజే విక్రయం చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ఆస్తుల సత్వర బదిలీలకు ఇదొక సాంకేతిక విప్లవంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కొల్లిపరలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆటోమాటిక్ మ్యూటేషన్ ప్రక్రియ విజయవంతంగా పనిచేస్తుంది.
27 నుంచి మరిన్ని సేవలు.. ప్రస్తుతం భూముల తాలుకా అడంగల్‌లో పేరులు మార్పుకే కాకుండా త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో కొనుగోలు చేసిన ఆస్తులను కూడా ఆటోమ్యాటికి మ్యూటేషన్ ప్రక్రియలోకి క్రోడీకరించనున్నారు. స్థలాలు, భవనాలు వంటి ఆస్తులను కొనుగోలు చేసినా వెంటనే మున్సిపల్, కార్పొరేషన్ కార్యాలయాలు చుట్టూ తిరగకుండానే ఈ సాఫ్ట్వేర్ ప్రక్రియతో కొనుగోలుదారుని పేరుమీదకు మొత్తం బదిలీ అవుతాయి. ఆస్తి విడుదల, పవర్ ఆఫ్ అటార్నీ , గిఫ్ట్ తదితర రిజిస్ట్రేషన్లు వంటివి కూడా ఆటోమ్యాటికి మ్యూటేషన్ ప్రక్రియలో పొందుపరుస్తున్నారు.
సేవలు సరళీకృతమౌతున్నాయి..
- డీఐజీ బి.సూర్యనారాయణ
ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ ప్రక్రి య ద్వారా ఆస్తుల సత్వర బదిలీలు, ప్రజాహిత సేవలు వంటివి ఎన్నో ప్రభుత్వం సరళీకృతం చేస్తోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమ్యాటిక్ మ్యూటేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అధునాతన సాంకేతిక నైపుణ్యంతో తయారు చేసినా సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రంలో 12 మంది సబ్ రిజిస్ట్రారులు ఐజీ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నారు. అడంగళ్లు, ఇంటి పన్ను, ఆస్తుల సర్వహక్కులూ రిజిస్ట్రేషన్ రోజునే కొనుగోలుదారు పేరున బదిలీ అవుతాయి.