Avani Chaturvedi
-
స్త్రీ శక్తి: సూపర్ ఫైటర్
సవాలుకు దీటైన సమాధానం విజయంలోనే దొరుకుతుంది. ‘అమ్మాయిలు బైక్ నడపడం కష్టం’ అనే మాట విన్నప్పుడు పట్టుదలగా బైక్ నడపడం నేర్చుకుంది. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించడం చాలా కష్టం’ అనే మాట విన్న తరువాత ఫైటర్ పైలట్ కావాలనుకునే లక్ష్యానికి బీజం పడింది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది జపాన్‌లో జరగబోయే ఎయిర్ కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొనబోతోంది... ఇండియా, జపాన్ దేశాలు కలిసి ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నాయి. ఎయిర్ డిఫెన్స్‌కు సంబంధించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎఎస్డీఎఫ్)లు గగనతల విన్యాసాలకు శ్రీకారం చుట్టనున్నాయి. జపాన్‌లో హైకురీ ఎయిర్‌బేస్ కేంద్రంగా జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు (వీర్ గార్డియన్ 2023) ఈ నెల 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. మన దేశానికి సంబంధించి సుఖోయ్–30 ఎంకేఐ, సీ–17 హెవీ–లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు దీనిలో భాగం అవుతాయి. ఈ కార్యక్రమంలోపాల్గొంటున్న ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది చరిత్ర సృష్టించనుంది. మన దేశంలో జరిగిన కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో మహిళా ఫైటర్ పైలట్లుపాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ, వేరే దేశంలో జరిగే దానిలో ఒక మహిళా ఫైటర్ పైలట్పాలుపంచుకోడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన అవని చతుర్వేది జైపూర్‌లో బీటెక్ చేసింది. విమానాలపై ఉన్న ఆసక్తితో రాజస్థాన్‌లోని వనస్థలి యూనివర్శిటీ ‘ప్లయింగ్ క్లబ్’లో చేరింది. అక్కడ మొదలైన ఆమె ప్రయాణం విజయపరంపరలతో సాగుతూనే ఉంది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా 2018 చరిత్ర సృష్టించింది అవని. రాష్ట్రపతి చేతుల మీదుగా 2020లో ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకున్న అవని, వైమానిక రంగంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇచ్చింది. అవని తండ్రి నీటిపారుదలశాఖలో ఇంజనీరు. సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. సోదరుడి స్ఫూర్తితోనే సైన్యంలోకి వచ్చింది అవని. భారతీయ వైమానికదళంలో పనిచేయాలనే తన లక్ష్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ‘ఫ్లైయింగ్ క్లబ్లో చేరినంత సులువు కాదు’ అని వెక్కిరించిన వాళ్లూ ఉన్నారు. అయితే వాటిని అవని సీరియస్‌గా తీసుకోలేదు. ఎఎఫ్సిఎటీ పరీక్షలో రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది. దుండిగల్(హైదరాబాద్)లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందింది. సాహసాలతో చెలిమి చేసింది. అవనికి బాస్కెట్‌బాల్, చెస్ ఆడడం, పెయింటింగ్ అంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ వల్ల తెగువ, చెస్‌తో లోతైన ఆలోచన, పెయింటింగ్‌తో సృజనాత్మక శక్తులు తనలో వచ్చి చేరాయి. ‘ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది నా విధానం. మంచి ఫైటర్ పైలట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’ అంటోంది అవని చతుర్వేది. ‘కఠినమైన ఫైటర్–ఫ్లయింగ్ షెడ్యూల్స్’ అంటూ ఒకప్పుడు ఐఏఎఫ్ మహిళలను కంబాట్ స్ట్రీమ్‌లోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఐఏఎఫ్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. దీనికి తాజా ఉదాహరణ జపాన్‌లో జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్కు అవని చతుర్వేదిని ఎంపిక చేయడం. -
టార్గెట్ ఎక్కడో.. సరిగా అక్కడే..
పురుషులు ఏదైనా టాస్క్ పూర్తి చేస్తే టార్గెట్ చుట్టుపక్కలవి కూడా అన్యాయంగా ధ్వంసం అయిపోతాయి. కొల్లాటరల్ డ్యామేజ్! మహిళలు అలాక్కాదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి క్షణాల్లో పక్కకు వచ్చేస్తారు. ఇది నిరూపణ అయిన సంగతే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో తాజాగా ఒక అజ్ఞాత మహిళా ఫైటర్ పైలట్ కు మిగ్– 29 యుద్ధ విమానాన్ని నడపడంలో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఎంత ఎగువకు లేచి, ఎంత వాలున మలుపు తీసుకుని, ఎంత దిగువకు చేరి ఆపరేషన్ ‘పూర్తి’ చేయాలో కూడా ఆ మహిళా పైలట్ నేర్చుకుంటారు. బైసన్, సుఖోయ్, రఫెల్ అయ్యాయి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ తన మహిళా ఫైటర్ పైలట్ల చేతికి మిగ్ 29ను అందించబోతోందన్న మాట! అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంతమంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు? ఎన్ని రకాల యుద్ధ విమానాలు ఉన్నాయి? యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్ డ్యామేజ్‌ని తగ్గించడం కోసం మొదట గగనతలంలోకి ఎగరబోతున్నది మహిళా ఫైటర్ లేనా? భారత వాయుసేనలోని యుద్ధ విమానాల మహిళా పైలట్లు ఇప్పటికే మిగ్–21 బైసన్, సుఖోయ్–30, రఫేల్ వంటి ఫైటర్ జెట్లను నడుపుతున్నారు. క్షణాల్లో నిటారుగా లేచి, కనురెప్పపాటులో ఏటవాలుగా తిరిగి, చప్పున సమాంతర రేఖగా మారి, భూ ఉపరితలానికి దాదాపుగా దగ్గరగా దిగి, శత్రుస్థావరాలను ఒక్క ఉదుటన పేల్చేసి, రయ్యిన పైకి లేచి వచ్చే విన్యాసాలలో నైపుణ్యాన్ని సాధించినవారే వారంతా! ఇప్పుడిక మిగ్–29 వంతు. భూగోళమే దద్దరిల్లేలా పిడుగుపాటు వేగంతో కదలే ఈ యుద్ధ విమానాన్ని నడపడంలో తొలిసారి ఒక మహిళా ఫైటర్ పైలట్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే వాయుసేనలో ఉన్న ఫైటర్ పైలట్లలో ఆమె ఒకరైనప్పటికీ, ఆమె ఎవరన్నదీ ప్రస్తుతానికైతే గోప్యమైన సంగతే. బహుశా శిక్షణ పూర్తయ్యాకో, శిక్షణాసమయంలోనో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆమె పేరును బయటపెట్టవచ్చు. మిగ్–29 : భారత వాయుసేన బాహుబలి తొంభై ఏళ్ల నుంచీ భారత వాయుసేన ఉన్నప్పటికీ ఇటీవల ఐదేళ్ల క్రితం మాత్రమే ఐ.ఎ.ఎఫ్ తొలిసారి మహిళల్ని ఫైటర్ పైలట్లుగా తీసుకుంది! భారత రక్షణ దళంలో అదొక చరిత్రాత్మక పరిణామం. అమ్మాయిలేంటీ, శత్రువు వెన్ను విరిచేందుకు గాలిలోకి యుద్ధ విమానాలను తిప్పడం ఏంటి అని అప్పుడే పురుష ప్రపంచం నొసలు విరిచింది. ఐ.ఎ.ఎఫ్ ఆ విరుపుల్ని పట్టించుకోలేదు. పైగా.. ఫైటర్ జెట్‌కి ఏం తెలుసు.. తనను నడుపుతోంది పురుష పైలటో, మహిళా పైలటో అని నవ్వేసి, స్త్రీ పురుషుల మధ్య జెండర్ యుద్ధవాతావరణాన్ని తేలికపరిచింది. ఐ.ఎ.ఎఫ్.లోని ఫైటర్ జట్లు ఒక్కోటీ ఒక్కో రకంగా ఉంటాయి. వాటిని ఒక్కో విధమైన ప్రత్యేక నైపుణ్యంతో నడపవలసి ఉంటుంది. వాటన్నింటిలో ఆరితేరిన మహిళా పైలట్లకు నేర్చుకోడానికి ఇప్పుడు మిగిలింది మిగ్–29 మాత్రమే. అందులోనూ శిక్షణ పొందితే భారత వాయుసేనకు ఇక కొండంత ధైర్యం. ఏ అమ్మాయి ఏ జెట్నైనా ‘డీల్’ చేయగలదు. ఎలాంటి అనూహ్య పరిస్థితిలోనైనా జెట్‌ను బయటికి తీయగలదు. చైనా, పాకిస్తాన్లను విశ్వసించలేని ప్రస్తుత తరుణంలో మహిళా పైలట్లకు ఇది అత్యవసర శిక్షణ. గత ఏడాది ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్ శివాంగి సింగ్‌కు ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాన్ని అప్పగించింది ఐ.ఎ.ఎఫ్.! హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ను నడపడంతో శివాంగి శిక్షణ పొందుతున్నారు. భారత వాయుసేన 2015 నుంచీ తీసుకుంటూ వచ్చిన పది మంది మహిళా ఫైటర్ పైలట్లలో శివాంగి ఒకరు. ఈ పదిమందికి కూడా మిగ్–21తో శిక్షణ ప్రారంభం అయింది. తర్వాత మిగతా యుద్ధ విమానాల శిక్షణ. ప్రస్తుతం ఒక మహిళాపైలట్ చేతికి అందబోతున్నదని రూఢీగా తెలుస్తోన్న మిగ్–29 గత పదేళ్లలోనూ అనేకమైన మార్పులతో వృద్ధి చెందుతూ వస్తోంది. ఏవియానిక్స్, వెపన్స్, రాడార్, ‘హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే’ (హెచ్.ఎం.డి.) వంటివన్నీ అధునాతనం అయ్యాయి. ఉదా : హెచ్.ఎం.డి.! మొదట్లో ఈ హెల్మెట్.. పైలట్ కళ్లకు గ్రాఫిక్స్‌గా హెచ్చరికల సమాచారం అందించేది. ఇప్పుడిది ఇమేజెస్‌గా డిస్ప్లే అవుతోంది. ఈ కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, ఆపరేట్ చెయ్యడం, ప్రమాదాలను తప్పించుకోవడం, ఎదురు దాడుల నుంచి కాపాడుకోవడం.. ఇవన్నీ శిక్షణలో ప్రాథమికమైనవిగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పదిమంది మహిళా ఫైటర్ పైలట్లతో పాటు 18 మంది మహిళా నేవిగేటర్లు (భూమి పై నుంచి విమాన మార్గాన్ని, విమాన కదలికల్ని నియంత్రించేవారు) భారత వాయు సేనలో ఉన్నారు. వీళ్లు కాక 1875 మంది మహిళా ఆఫీసర్లు ఐ.ఎ.ఎఫ్.లో అత్యన్నతస్థాయి విధుల్ని నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలను.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. కలిపి చూస్తే మహిళా ఆఫీసర్ల సంఖ్య గత ఏడాది సెప్టెంబరు నాటికి 9,118. రక్షణ దళాలలోకి మరింత మంది మహిళల్ని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఈ మధ్యే పార్లమెంటులో వెల్లడించింది. ‘‘ఇది మహిళల అవసరం కాదు. మన రక్షణ వ్యవస్థ అవసరం. మూడు రక్షణ దళాలూ మహిళల శక్తి సామర్థ్యాలతో బలోపేతం కావలసి ఉంది’’ అని ఇటీవలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రిటైర్డ్ వింVŠ కమాండర్ అనుపమా జోషి అన్నారు. 1990ల ఆరంభంలో ఐ.ఎ.ఎఫ్.లోకి వచ్చిన తొలి మహిళా ఆఫీసర్ల బ్యాచ్‌కి చెందినవారు అనుపమ. ఆర్మీలోని వైమానిక విభాగం (ఏవియేషన్ వింగ్)లోకి కూడా త్వరలోనే మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు రాబోతున్నారు! ఆర్మీ ఏవియేషన్ వింగ్ లో ప్రస్తుతం ఉన్న మహిళా అధికారులు గ్రౌండ్‌కు మాత్రమే పరిమితమై ఉన్నారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేస్తుంటుంది. వాటిని నడిపేందుకు ఈ జూలైలో తొలి బ్యాచ్ మహిళా అధికారులకు పైలట్లుగా శిక్షణ ప్రారంభిస్తున్నారు. 2022 జూలై నాటికి వారి శిక్షణ పూర్తవుతుంది. నేవీ మరికాస్త ముందుంది. గత సెప్టెంబరులో శిక్షణ పూర్తి చేసుకున్న ఇద్దరు మహిళల్ని తొలిసారి యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్లకు ఫైటర్ పైలట్‌గా తీసుకుని చరిత్ర సృష్టించింది. లక్ష్యాన్ని గురి చూసి ఛేదించగల శక్తి పురుషుల కన్నా మహిళలకే ఎక్కువని అనేక శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైన సంగతే. పురుషులూ ఛేదిస్తారు కానీ.. లక్ష్యానికి ఆనుకుని ఉన్న జనావాసాలు కూడా ధ్వంసం అవుతాయి. పౌరులూ మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ నష్టాన్నే ‘కొల్లాటరల్ డ్యామేజ్’ అంటారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్ డ్యామేజ్‌ని నివారించేందుకు లేదా తగ్గించేందుకు మొదట మహిళా ఫైటర్ పైలట్లనే గగనతలంలోకి భారత వాయు సేన పంపే అవకాశాలైతే లేకపోలేదు. వాయుసేనకు మహిళాశక్తి భారత సరిహద్దుల్లో చైనా, పాక్‌ల అతిక్రమణలు ఎప్పటికైనా యుద్ధానికి దారి తీసేవే. గత ఏడాది జూలైలో చైనా మన సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చిన సమయంలోనే ఫ్రాన్స్‌కు మనం ఆర్డరు పెట్టిన 36 రఫేల్ యుద్ధ విమానాలలో తొలి విడతగా ఐదు విమానాలు భారత్‌తో దిగాయి. వైమానిక దాడుల అవసరమే కనుక కలిగితే చైనా పాక్‌ల కంటే కూడా శక్తిమంతమైన యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయన్న సంగతి ప్రపంచానికి తెలియని వాస్తవమేమీ కాదు. భారత వాయు సేనలో ఇప్పటికే ఉన్న ‘తేజస్’లు దేశవాళీ ఫైటర్ జెట్లు కాగా, సుఖోయ్‌లు రష్యాలో తయారై వచ్చినవి. మిరాజ్ 2000 లు ఫ్రాన్స్ తయారీ. మిగ్–21లు (బైసన్ అని కూడా అంటారు) మిగ్–29లు కూడా రష్యా నుంచి తెప్పించుకున్నవే. సెపెక్యాట్ జాగ్వార్లది బ్రిటన్, ఫ్రాన్స్‌ల ఉమ్మడి టెక్నాలజీ. వీటన్నిటిలోనూ మన మహిళా ఫైటర్ పైలట్లు శిక్షణ పొందినవారే. ఇప్పుడు మిగ్–29 శిక్షణకు తొలిసారి ఒక మహిళా ఫైటర్ పైలట్‌ను భారత వాయు సేన పంపబోతోంది. -
రఫేల్‌కు మహిళా పైలట్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు. మిగ్–21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి ఒకరు తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ పైలట్ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు. అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్ యుద్ధ విమానాలకు మహిళా పైలట్ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె మిగ్–21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875. కాగా, రఫేల్ ఫైటర్ జెట్లు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ఈ నెల 10వ తేదీన అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా 1951లో అంబాలా వైమానిక స్థావరంలో ఏర్పాటయిన ఈ స్క్వాడ్రన్ పేరిట పలు రికార్డులు నమోదై ఉన్నాయి. 1955లో మొట్టమొదటి ఫైటర్ జెట్ డి హవిల్లాండ్ వాంపైర్ ఈ స్క్వాడ్రన్లోనే చేరింది. ఫ్రాన్సుతో కుదుర్చుకున్న రూ.59వేల కోట్ల ఒప్పందంలో భాగంగా జూలైలో మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ కల్లా రెండో విడతలో మరో నాలుగు, 2021 చివరి నాటికి మొత్తం 36 విమానాలు చేరనున్నాయి. రష్యా నుంచి సుఖోయ్ జెట్లను కొనుగోలు చేసిన 23 ఏళ్ల తర్వాత భారత్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న భారీ ఒప్పందమిది. -
చరిత్ర సృష్టించిన మోహనా సింగ్
న్యూఢిల్లీ : అవకాశం లభించాలేగానీ ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతారని నిరూపించారు మోహనా సింగ్. కఠిన పరీక్షల్లో నెగ్గి భారత తొలి యుద్ధ విమాన పైలట్(ఫ్లైట్ లెఫ్టినెంట్)గా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో అత్యాధునిక యుద్ధ విమానాలను నడిపేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. కాగా రాజస్తాన్‌లోని ఝున్ఝును జిల్లాలో మోహనా సింగ్ జన్మించారు. అమృత్‌సర్‌లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో గ్రాడ్యుయేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇక మోహన తండ్రి వాయుసేనలోనే వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తాత లాడూ రామ్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో ఫ్లైట్ గన్నర్. ఈయన 1948 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్ చక్ర అవార్డు కూడా పొందారు. కాగా తండ్రి ప్రతాప్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్న చోటే మోహనా ట్రెయినీ కేడెట్‌గా చేరడం విశేషం. కఠినమైన శిక్షణలో నెగ్గితేనే...! జెట్ ఫైటర్‌గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు పన్నెండు సార్లు ద్వంద్వ తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్, లాండింగ్ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు. ఇక మోహనా సింగ్‌తో పాటు భావనా కాంత్, అవనీ చతుర్వేది కూడా యుద్ధ విమానాలు నడిపేందుకు అర్హత సాధించేందుకు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. Flight Lieutenant Mohana Singh has become the first woman fighter pilot to be qualified to undertake missions by day on Hawk advanced jet aircraft. Singh, along with two other women Bhawana Kanth and Avani Chaturvedi, had joined the fighter stream in June 2016. pic.twitter.com/KxIN5pdvlj — ANI (@ANI) May 31, 2019 -
అవని మోహన భావన విజయం
ముదితల్ నేర్వగ రాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్... చాలా పాతకాలపు మాటే. కానీ... ఈ కాలంలో అది వాళ్లను కించపరచడమే! అవకాశం దొరకాలేగానీ.. మహిళలు రాణించని రంగమంటూ లేదనేందుకు చరిత్రే సాక్ష్యం! ఓ ఇందిరాగాంధీ.. ఇంకో సునీతా విలియమ్స్.. మరో ఇంద్ర నూయీ! ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే స్త్రీ శక్తి విజయాలకు తార్కాణాలు కోకొల్లలు! తాజా ఉదాహరణలు కావాలా... అవని.. మోహన... భావనల జైత్రయాత్ర చూడండి!!! హైదరాబాద్ శివార్లలోని హకీంపేట్... ఆకాశంలో రయ్యి రయ్యి మంటూ విమానాలు దూసుకెళుతున్నాయి!! ఆకాశంలో సగమే కాదూ... అంతా మాదేనన్న ఆత్మవిశ్వాసంతో.. ఈ ముగ్గురు మూలపుటమ్మలు ముందడుగేశారు!! అభినందన్ వర్ధమాన్ నడిపిన మిగ్ – 21 బైసన్.. ధ్వనివేగంతో పోటీపడే సుఖోయ్–ఎంకే21, మిరాజ్ –2000లనూ అలవోకగా చక్కర్లు కొట్టిస్తున్నారు! ఇంకో కొన్ని నెలలు గడిస్తే.. పుల్వామా తరహా ఉగ్రదాడులకు దీటైన సమాధానం చెప్పే వాయుసేనలో అవనీ చతుర్వేదీ, భావనా కాంత్, మోహన సింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోవద్దు! దశాబ్దాల నిషేధాలు, ఆంక్షలను తోసిరాజంటూ 2016లో అవని చతుర్వేది భారతీయ వాయుసేనలో తొలి యుద్ధవిమాన పైలట్‌గా చరిత్ర సృష్టించగా.. ఆ తరువాత కొద్ది కాలానికే భావనా కంఠ్... మోహన సింగ్‌లు చేరారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వీర వనితలు హకీంపేటలోని వాయుసేన శిక్షణ కేంద్రంలో తమ నైపుణ్యాలకు తుదిమెరుగులు దిద్దుకుంటున్నారు. ఇప్పటికే పలు యుద్ధవిమానాలను నడపడంలో సిద్ధహస్తులైన ఈ ముగ్గురు ఎప్పుడెప్పుడు సుఖోయ్, మిరాజ్ కాక్పిట్లలోకి చేరిపోయి.. భారతీయ మహిళల సత్తాను ఆకాశానికి చేర్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. భారత త్రివిధ దళాల్లో మహిళల పాత్ర ఏమిటన్నది ఒక్కసారి చూసుకుంటే కొంచెం నిరాశ ఆవహించక మానదు. ఆర్మీ, నేవీల్లో ఇప్పటికే మహిళల ప్రమేయం కేవలం వైద్య, దంత సేవలకు పరిమితం కాగా.. ఒక్క వాయుసేనలో మాత్రం 13 శాతం మహిళలు పనిచేస్తున్నారు. మూడు రక్షణ దళాలను పరిగణనలోకి తీసుకున్నా సరే.. మహిళల శాతం చాలా తక్కువ. వైద్య, దంత సేవల్లో 21.63, 20.75 శాతం మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. యుద్ధరంగంలో తుపాకీ పట్టేందుకూ మహిళకు అవకాశమివ్వాలన్న వాదన చాలాకాలంగా నడుస్తున్నా.. 2015 అక్టోబరులో ఇందుకు అనుమతిస్తూ భారతీయ వాయుసేన చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్‌లో ఉండే ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఉన్న మొత్తం 120 మంది కేడెట్ల నుంచి యుద్ధవిమానాల శిక్షణ కోసం 37 మందిని ఎంపిక చేయగా.. కఠినాతి కఠినమైన పరీక్షలకు ఓర్చి ఈ ముగ్గురు తుదిజాబితాలో స్థానం సంపాదించుకున్నారు. మిగిలిన వారిలోనూ ముగ్గురు మహిళలు ఉండగా.. వారిని హెలికాప్టర్, రవాణా విమానాలు నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. అవని చతుర్వేది ఫ్లైట్ లెఫ్టినెంట్ పుట్టింది: అక్టోబరు 27, 1993 కుటుంబం: తండ్రి దినకర్ చతుర్వేది మధ్యప్రదేశ్ నీటివనరుల విభాగంలో ఇంజినీర్. తల్లి గృహిణి, అవని అన్న కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నారు. విద్య: షాడోల్ జిల్లాలోని డియోలాంగ్లో పాఠశాల విద్య, రాజస్తాన్‌లోని బనస్థలి విశ్వవిద్యాలయం నుంచి బీటెక్. ఘనతలు: సూరత్‌గఢ్‌లోని వాయుసేన 23వ స్క్వాడ్రన్‌లో చేరారు. మిగ్ –21 బైసన్‌ను నడిపిన తొలి మహిళా పైలట్. ఇష్టాఇష్టాలు: చదరంగం, టేబుల్ టెన్నిస్లపై మక్కువ ఎక్కువ. స్ఫూర్తి: అన్నే. కాలేజీ ఫ్లైయింగ్ క్లబ్లో చిన్నసైజు విమానాలను నడిపిన అనుభవమూ ఉంది. ఏ వాయుసేనకైనా అందులోని యోధులే కీలకం. యుద్ధవిమాన పైలట్ కావాలన్నది నా కల. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధవిమానాలను నడపాలని.. ప్రతిరోజూ కొత్తకొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నా. – అవని చతుర్వేది భావన కంఠ్ ఫ్లయింగ్ ఆఫీసర్ పుట్టింది: 1992, బిహార్‌లోని దర్భంగ జిల్లాలో కుటుంబం: తండ్రి తేజ్ నారాయణ్ కంఠ్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. విద్య: రాజస్తాన్‌లోని కోటలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ శిక్షణ పొందారు. మహిళలకు అనుమతి లేకపోవడంతో అప్పట్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష రాయలేకపోయారు. బెంగళూరులోని బీఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ చదివారు. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికై వాయుసేనలో చేరారు. తొలిదశ శిక్షణలో భాగంగా యుద్ధవిమానాలు నడిపేందుకు ఎంపికయ్యారు. ఘనతలు: అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే మక్కువ ఎక్కువ. వాయుసేనలో రెండో దశ శిక్షణలో భాగంగా హకీంపేటలోని శిక్షణ కేంద్రంలో కిరణ్ విమానాలను నడిపారు. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న అనుభవమూ భావన కంఠ్ సొంతం. మోహన సింగ్ ఫ్లైట్ ఆఫీసర్ పుట్టింది: రాజస్తాన్‌లోని ఝున్ఝును జిల్లాలో. కుటుంబం: తండ్రి వాయుసేనలోనే వారంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తాత లాడూ రామ్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్లో ఫ్లైట్ గన్నర్. 1948 భారత్ – పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్ చక్ర అవార్డు గ్రహీత కూడా. విద్య: అమృత్‌సర్‌లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో గ్రాడ్యుయేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఘనతలు: తండ్రి ప్రతాప్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్న చోటే ట్రెయినీ కేడెట్‌గా చేరడం. -
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త అధ్యాయం
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం భారత ఎయిర్ ఫోర్స్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా యుద్ధవిమాన పైలట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు మహిళలు.. అవని చెతుర్వేది(మధ్యప్రదేశ్), మోహనా సింగ్(రాజస్థాన్), భావనా కాంత్(బిహార్) రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో భారత ఎయిర్ ఫోర్స్‌లో తొలిసారిగా యుద్ధ విమానాలను మహిళలు నడపనున్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 130 మంది పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పారికర్ పాల్గొన్నారు. యుద్ధ విమాన పైలట్లుగా మహిళలను నియమించే విషయంలో దేశంలో ఎంతో కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.