Avatharam
-
‘చింతచెట్టు’తో భయపెడతా!
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తనని తాను నిత్య విద్యార్థిలాగానే భావిస్తారు. 32ఏళ్లుగా అదే పరిశ్రమ.. అదే అంకితభావం... అదే క్రమశిక్షణ. ఏ తరహా సినిమానైనా అవలీలగా తెరకెక్కించే ఈ సీనియర్ సృజనాత్మక దర్శకుడి తాజా ప్రయత్నం ‘అవతారం’ రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి కోడి రామకృష్ణ ఈ విధంగా చెప్పారు. కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ‘అవతారం’ సినిమా చేశాం. పాలు అమ్ముకునే అమ్మాయి, 120 ఏళ్ల వృద్ధురాలు, దేవత.. ప్రధానంగా వీరి చుట్టూ తిరిగే కథ ఇది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా ఇది. కానీ, ఏ సన్నివేశంలో గ్రాఫిక్స్ ఉండాలో అక్కడే ఉంటాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నేననుకున్న విధంగా ‘అవతారం’ని తెరకెక్కించాను. ఇది చాలా మంచి సినిమా. ఇప్పటివరకూ నేను చాలా సినిమాలు చేశాను. కానీ, అన్ని సినిమాలకూ ఇలా చెప్పలేదు. ముఖ్యంగా ఈ సినిమాకి చెప్పడానికి కారణం కథాబలం. రాధిక కుమారస్వామి, రిషి నా కథకు న్యాయం చేశారు. ఇక, భానుప్రియ అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత యుగంధర్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. మొదట నుంచీ కూడా నిర్మాతను నా పక్కన పెట్టుకుని సినిమా చేయడం నా అలవాటు. ఒకవేళ నిర్మాత అందుబాటులో లేకపోతే, ఆయనను సంప్రదించిన తర్వాతే సీన్స్ తీస్తా. ఎందుకంటే, ఏ సినిమాకైనా నిర్మాతే ప్రాణం అని నమ్ముతాను. ప్రస్తుతం ‘పుట్టపర్తి సత్యసాయిబాబా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమా నలభై శాతం పూర్తయ్యింది. అలాగే అర్జున్, లక్ష్మీరాయ్ కాంబినేషన్లో ‘రాణీ రాణమ్మ’ చేస్తున్నా. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అనే చిత్రం చేయనున్నాను. ఇందులో ఆంజనేయుడిగా నటించడానికి రాజేంద్రప్రసాద్ సుముఖంగా ఉన్నారు. నా ‘దేవుళ్లు’ సినిమాలో ఆయన ఆంజనేయుడిగా చేశారు. రాజేంద్రప్రసాద్, నా కాంబినేషన్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ వంద రోజుల సినిమాలే కావడం విశేషం. మా ఊళ్లో నా కళ్ల ముందు జరిగిన సంఘటనలతో ‘చింత చెట్టు’ టైటిల్‌తో ఓ సినిమా చేయాలనుకుం టున్నా. ఇది థ్రిల్లర్ మూవీ. ఈ కథలో విశేషం. ఏంటంటే... మా ఊరు పాలకొల్లులో ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు వరకూ గోలీలు ఆడేవాళ్లు. ఏదో కాలక్షేపం కోసం కాదు... ఆ రోజుల్లోనే లక్షల్లో పందెం కట్టి ఆడేవాళ్లు. అయితే ఆరు తర్వాత ఆ చెట్టు దగ్గరకు ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. ఒకవేళ ఎవరైనా వెళితే, ఒక షరతు మీద వెళ్లేవాళ్లం. అక్కడికెళ్లిన ప్రతిసారీ ఎవరో పిలిచినట్లు ఉంటుంది. కానీ, వెనక్కి తిరిగి చూడకూడదు. అదే షరతు. దెయ్యం ఉంటుందని భయం. ఆ సంఘటనల సమాహారంతో ఈ ‘చింత చెట్టు’ సినిమా చేయబోతున్నా. -
కోడి రామకృష్ణ మార్కు మాయాజాలం
‘‘ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టిన ఓ భూతాన్ని, అదే నక్షత్రంలో పుట్టిన ఓ స్త్రీ ఎలా శాసించింది? మూడు గ్రహణాల వ్యవధిలో జరిగిన ఈ పోరాటంలో గెలుపెవరిది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అవతారం’. సాంకేతికంగా ఈ చిత్రం ఓ అద్భుతం’’ అని కోడి రామకృష్ణ అన్నారు. భానుప్రియ, రాధిక కుమారస్వామి, రిషి ప్రధాన పాత్రధారులుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో యం.యుగంధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అవతారం’. ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. కోడి రామకృష్ణ మాట్లాడుతూ- ‘‘కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశాం. జర్మని, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమాకు పనిచేశారు’’ అని చెప్పారు. 90 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్ అని, కోడి రామకృష్ణగారితో తొలి సినిమా చేయడం ఆనందంగా ఉందని నిర్మాత చెప్పారు. ఇంకా మాటల రచయిత రాజేంద్రకుమార్, యాదగిరి, మహేంద్రరెడ్డి, బాల తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎం.కవిత. -
అవతారం
సైన్స్‌లో జరిగే పరిణామాల కారణంగా ఒక గ్రహం భూమికి చేరువగా జరిగితే ఏర్పడే పరిస్థితుల నేపథ్యంలో శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవతారం’. ఎం. కవిత సమర్పణలో అరుంధతి ఆర్ట్ ఫిలింస్ పతాకంపై ఎం. యుగంధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి, భానుప్రియ, రిషి ముఖ్య తారలు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సరికొత్త కథను కొత్త కోణంలో కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అమ్మోరు, అరుంధతి సాంకేతికంగా అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం టెక్నికల్‌గా మరో మెట్టు పైనే ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి అనుకున్న బడ్జెట్‌కన్నా ఎక్కువైంది. సినిమా నిర్మాణానికి కూడా ఎక్కువ సమయం పట్టింది. ఆలస్యం అయినా సినిమా అద్భుతంగా రావడంతో ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కోడి రామకృష్ణ. -
సరికొత్త అవతారం
భక్తిరసాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో కోడిరామకృష్ణది ఓ ప్రత్యేక శైలి. అమ్మోరు, దేవుళ్లు, త్రినేత్రం... చిత్రాలే అందుకు నిదర్శనాలు. త్వరలో ఆయన నిర్దేశకత్వంలో రాబోతున్న మరో డివోషనల్ మూవీ ‘అవతారం’. ఎం.యుగంధర్‌రెడ్డి నిర్మాత. కన్నడ నటి రాధిక ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. డిసెంబర్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి కోడి రామకృష్ణ మాట్లాడుతూ -‘‘సెంటిమెంట్‌కీ దుష్టశక్తికీ మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ. త్వరలో ఓ గ్రహం భూమిని ఢీకొట్టబోతోందన్న భయం ప్రజానీకానికి ఉంది. దానికి ప్రీ క్లైమాక్స్‌గా తీసుకొని అల్లిన కథే ‘అవతారం’. నన్ను కూడా ఎంతో ఇన్స్పైర్ చేసిన కథ ఇది. ఇందులో గ్రాఫిక్స్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. సినిమా సరికొత్త రీతిలో ఉంటుంది’’ అని తెలిపారు. రిషి కథానాయకునిగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీవెంకట్, సంగీతం: ఘంటాడి కృష్ణ, నిర్మాణ సహకారం: ఎన్.సతీష్‌కుమార్‌రెడ్డి, సమర్పణ: ఎం.కవిత.