రికవరీలో సైబరాబాద్ రాష్ట్రంలో టాప్
హైదరాబాద్: చోరీ సొత్తు రికవరీలో రాష్ట్రంలో సైబరాబాద్ కమిషనరేట్ వరుసగా ఈఏడాది కూడా రాష్టంలో మొదటి స్థానంలో నిలిచింది. 74 శాతం రికవరీతో అగ్రభాగం దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2234 కేసులు అధికంగా నమోదయ్యాయి. స్నాచింగ్, చోరీలు, కిడ్నాప్,మహిళలపై అఘాయిత్యాలు ఈఏడాది పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దోపిడీ కోసం హత్యలు, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు గతేడాది కంటే అధికంగా ఈసారి 188 మిస్టరీ కేసులను చేధించి రూ. 5.82 కోట్లు సొత్తు రికవరీ చేశారు.
గచ్చిబౌలిలోని పోలీసు ఆడిటోరియంలో సంయుక్త పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్, డీసీపీలు అవినాష్ మహంతి, పి.విశ్వప్రసాద్, టి.కె.రాణా, ఏ.ఆర్.శ్రీనివాస్, నవదీప్‌సింగ్ గ్రేవల్ తదితరులతో కలిసి కమిషనర్ సీవీ ఆనంద్ 2013లో జరిగిన నేరాల వివరాలను వివరించారు. ‘అభయ’ ఘటన నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో పోలీసింగ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో ఔటర్ పై పోలీసింగ్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది డ్రంకెన్ డ్రైవ్‌లో 1400 మందిని జైలుకు పంపినట్లు చెప్పారు. పలు అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా పూర్తి చేసినట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది ల్యాండ్ గ్రాబింగ్ షీట్ ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో 25 మందిపై ఈ షీట్ తెరవనున్నట్లు సీపీ ఆనంద్ పేర్కొన్నారు. ఈఏడాది అత్యధికంగా ఎల్బీనగర్ ఠాణాలో 1500 ఎఫ్ఐఆర్లు నమోదు అవగా అత్యల్పంగా మంచాల ఠాణా 217 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.