award received
-
National Service Scheme 2021: గ్రామాల దత్తత: సేవాధీరలు
ఈ నెల 24వ తేదీ, జాతీయ సేవాపథకం ఆవిర్భావ దినోత్సవం. మన దేశరాజధాని నగరంలోని రాష్ట్రపతి భవనం 2020–21జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి వేదికైంది. విశిష్ట సేవలందించిన నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కార్యకర్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఆనంద తరుణం. ఆ సంతోషంలో మన తెలుగు మహిళలు ఇద్దరున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం అమ్మాయి సిరిశ్రీ దేవనపల్లి. మరొకరు తెలంగాణ రాష్ట్రం, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి. దేవనపల్లి సిరిశ్రీ సొంతూరు సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) కదిరి. నాన్న పద్మనాభ రెడ్డి ఎల్ఐసీలో హైయ్యర్‌గ్రేడ్ అసిస్టెంట్‌గా రిటైరయ్యారు. అమ్మ అమరావతి గృహిణి. తమ్ముడు నిఖిల్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్న సిరి శ్రీ విద్యార్థి దశ నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేది. తాను పొల్గొన్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఎస్ఆర్ఐటీ కళాశాలలో నిత్యం జాతీయ సేవా పథకంపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. రక్తదానం, మొక్కలు నాటడం, పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమాలు చాలా నిర్వహించాం. రోటరీపురం వద్ద రెండు గ్రామాలు దత్తత తీసుకున్నాం. గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించాం. ప్రతిరోజూ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి పంపాం. డేటా సేకరించి నిరక్షరాస్యులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) గురించి వివరించి వారికి అవగాహన కల్పించాం. కాలేజీలో శారో హుండీ మా ఎస్ఆర్ఐటీ కళాశాలలో ‘శారో (సేవ్ ఏ రూపీ ఆర్గనైజేషన్)’ పేరుతో ప్రతి బ్లాక్‌లోనూ హుండీ ఏర్పాటు చేశారు. విద్యార్థులం స్వచ్ఛందంగా ఇందులోకి నగదు జమ చేసేవాళ్లం. ఆరు నెలలకోసారి ఈ మొత్తంతో అనాథ, వృద్ధాశ్రమాల్లో కార్యక్రమాలను నిర్వహించేవాళ్లం. ఈ విధానం నచ్చడంతో జాతీయ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితమయ్యాను. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చిన్నపుల్లయ్య సార్ మాకు ఎంతో తోడ్పాటు అందించారు. జాతీయ సేవా పథకంలో పని చేయడం వల్ల సేవాభావం మాత్రమే కాదు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా 2019లో గుజరాత్లో జరిగిన ప్రీ–రిపబ్లిక్ పరేడ్ క్యాంప్‌కు ఎంపికయ్యాను. 2020 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు గౌరవనీయులు భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడాన్ని జీవితకాల సాఫల్యంగా భావిస్తున్నాను. ఇంతకు మించి గొప్ప ఘనత నా జీవితంలో ఉండదేమో! మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా సత్కారం అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సిరి శ్రీ దేవనపల్లి. – బడ శ్రీనివాస రెడ్డి, సాక్షి, అనంతపురం లీడర్షిప్ మాత్రమే ‘‘మాది హన్మకొండ. ఇంటర్ హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాల, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. కాకతీయ యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ చేసి, 2007లో అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాను. 2008లో అప్పటి ప్రిన్సిపాల్ నన్ను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా నియమించారు. నాకు విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్తో పరిచయం లేదు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత నా టీమ్‌లోని వాలంటీర్ల సామాజిక సేవాపథం, వారు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే తీరు నన్ను స్ఫూర్తిమంతం చేశాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కుమ్మరిగూడెంలో ప్రత్యేక శిబిరం పెట్టి మొక్కలు నాటాం. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్య కల్పన కు కృషి చేశాం. అలా 2012వరకు నాలుగేళ్లపాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా కొనసాగాను. కో ఆర్డినేటర్‌గా... కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా 2017లో అప్పటి వీసీ ఆచార్య ఆర్ సాయన్న నియమించారు. యూనివర్సిటీ చరిత్రలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్‌గా ఒక మహిళకు అవకాశం రావడం అదే తొలిసారి. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు 36 వేలమంది వాలంటీర్లతో పనిచేశాను. హరితహారంలో మొక్కలు నాటాం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాం. రక్తదానం శిబిరాల్లో 25 వేలమంది వాలంటీర్లు, లక్షా 18వేల యూనిట్ల రక్తదానం చేశారు. 975 ఆరోగ్య శిబిరాలు నిర్వహించాం. గుప్పెడు బియ్యం (కప్ ఆఫ్ రైస్) పేరున ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించి, నిరుపేదలకు, అనాథలకు పంపిణీ, జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటì సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం, శ్రమదానం చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంకుడు గుంతలు తవ్వడంతోపాటు క్యాంపస్‌లో ఉన్న చెక్ డ్యామ్‌లకు మరమ్మతులు కూడా చేశాం. మేడారం జాతరలో భక్తులకు సేవలందించడం, ఎన్నికల సమయాల్లో పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లకు సేవలందించడంలోనూ మా కార్యకర్తలు ముందుండేవాళ్లు. కోవిడ్ సమయంలో శానిటైజర్, మాస్కుల పంపిణీ చేశాం. ఇన్ని సేవల నేపథ్యంలో అందిన ఈ గౌరవం మధురానుభూతిగా మిగులుతుంది’’ అన్నారు సుంకరి జ్యోతి. – డి. రమేశ్, సాక్షి, హన్మకొండ -
"బెస్ట్ ఎమ్మెల్యే" అవార్డు అందుకున్న మాజీ సీఎం..
Yediyurappa Presented Best Legislator Award: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయిన బీఎస్ యడియూరప్ప 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ శాసనసభ్యుడిగా ఎంపికయ్యాడు. అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలోని.. సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, న్యాయశాఖ మంత్రి మధుస్వామిలతో కూడిన కమిటీ ఈ అవార్డుకి యడియూరప్పని ఎంపిక చేసింది. అసెంబ్లీ సభ్యుడిగా ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను యడియూరప్పకి ఈ అవార్డు దక్కిందని కమిటీ పేర్కొంది. పార్లమెంట్లో ఏటా అందించే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల తరహాలో ఈ ఏడాది నుంచి కర్ణాటక శాసనసభ సభ్యులకు(మంత్రులకు కాదు) బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చే ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు అసెంబ్లీ స్పీకర్ తెలిపారు. ఇవాళ(సెప్టెంబర్ 24) ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. యడియూరప్పకి జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమానికి సీఎం బసవరాజ్ బొమ్మై, శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే, శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హోరట్టి తదితరులు హాజరయ్యారు. కాగా, యడియూరప్ప 1983లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శాసన మండలి, పార్లమెంట్ సభ్యుడిగా కూడా పని చేసిన ఆయన.. నాలుగు సార్లు సీఎం అయ్యారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జులై 26న సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చదవండి: భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త! -
కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు నాలుగు జాతీయ స్థాయి అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మరోసారి సీఎంఓ వరల్డ్ సంస్థ ద్వారా ‘ద వరల్డ్ ఉమేన్ లీడర్షిప్’ అవార్డును మంగళవారం ముంబైలో ఆ సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ, పల్లెప్రగతి, గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలకు ఈ అవార్డు దక్కింది. పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించినందుకు మహిళ కలెక్టర్ల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2018 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లాలో 271 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం హైరిస్క్ డెంగీ జిల్లాగా ప్రకటించింది. ఉపాధిహామీ కింద ఉచితంగా ఇంకుడు గుంతలను నిర్మించడంతో దోమల నివారణ, వృథా నీరు పోకుండా భూగర్భజలాలు పెంపొందించేందుకు దోహదపడ్డాయని కలెక్టర్ తెలిపారు. కాగా 2019లో 85 శాతం కేసులు తగ్గాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని ప్రకటించినట్లు పేర్కొన్నారు. దేశంలోనే స్వచ్ఛత జిల్లాగా ప్రకటించారని గుర్తు చేశారు. కాగా అప్పట్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛభారత్, స్వచ్ఛదర్పణ్ పథకాల కింద నాలుగు జాతీయ అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో స్వచ్ఛతలో జిల్లాను ముందుంచుతానన్నారు. -
రావీష్ కుమార్‌కు గౌరీ లంకేశ్ అవార్డు
సాక్షి, బెంగళూరు: ఇటీవల రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్.. గౌరీ లంకేశ్ మెమోరియల్ మొదటి అవార్డును అందుకొన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 22) బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో 'పదునైన వార్తల విశ్లేషణ, రాజీలేని లౌకిక వైఖరి' అవలంభించింనందుకు గాను ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ హెచ్ఎస్ దొరస్వామి చేతుల మీదుగా ఈ అవార్డును రావీష్‌కు అందజేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండవ వర్ధంతిని పురస్కరించుకొని గౌరీ లంకేష్ మెమోరియల్ ట్రస్ట్ ఈ అవార్డును ప్రకటించింది. సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్, విద్యావేత్త రహమత్ తారికెరే, ఉద్యమకారుడు తీస్తా సెతల్వాద్‌లతో కూడిన కమిటీ ఈ అవార్డుకు రావీష్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రావీష్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు అందరినీ ప్రభావితం చేస్తాయని అభిప్రాయ పడ్డారు. 'నాథూరం గాడ్సేను దేశభక్తుడిగా, గాంధీజీని ఉగ్రవాదిగా చూసే కాలంలో మనం జీవిస్తున్నాం. అంతేకాక దేశంలో అసమ్మతివాదులను.. దేశ వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్, పాకిస్తాన్‌కు అనుకూరులుగా చిత్రీకరిస్తున్నారు. మన దేశ ప్రజాస్వామ్యం నెమ్మదిగా మరణ దిశగా వెళుతోంది' అని ఆయన పేర్కొన్నారు. కాగా గౌరీ లంకేశ్‌ను బెంగళూరులోని ఆమె ఇంటి ముందు సెప్టెంబర్ 5, 2017న దుండగుడు అతి దారుణంగా కాల్చి చంపాడు. -
‘చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’ మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛ, హరిత పర్యావరణం తమ ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చెప్పారు. వాతావరణం, విపత్తులకు సంస్కృతితో సంబంధం ఉందనీ, పర్యావరణాన్ని కాపాడటం మన సంస్కృతిలో భాగం కానంతవరకు విపత్తులను నివారించడం చాలా కష్టమైన పని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డును మోదీ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ చేతుల మీదుగా అందుకున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ–ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) విజయవంతమవ్వడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను మోదీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు సంయుక్తంగా ఈ అవార్డును ఐరాస ప్రకటించింది. అవార్డును స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ‘వ్యవసాయ, పారిశ్రామిక విధానాల నుంచి ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు.. అన్నింట్లోనూ స్వచ్ఛ వాతావరణం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు భారత్ ఇటీవలి కాలంలో మరింతగా పాటుపడుతోంది. 2005తో పోలిస్తే 2020కల్లా కర్బన ఉద్గారాలను 20–25 శాతం, 2030 నాటికి 30–35 శాతం తగ్గించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 కల్లా ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. వారందరికీ దక్కిన గౌరవం ఈ అవార్డు.. మోదీ మాట్లాడుతూ ‘ఈ దేశంలో కొన్ని తెగల ప్రజలు అడవుల్లో బతుకుతూ తమ ప్రాణాలకంటే అక్కడి చెట్లనే ఎక్కువ ప్రేమిస్తారు. మత్స్యకారులు తమ జీవనానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి ఎన్ని చేపలు అవసరమో అన్నే పడతారు తప్ప అత్యాశకు పోరు. రైతులు ఎంతో కష్టపడి దేశం ఆకలి తీరుస్తున్నారు. చెట్లను దేవతలుగా పూజించే మహిళలు ఇక్కడ ఉన్నారు. వీరందరికీ దక్కిన గుర్తింపుగా నేను ఈ అవార్డును భావిస్తున్నాను’ అని అన్నారు. ప్రకృతిని భారతీయులెప్పుడూ ప్రాణం ఉన్న జీవిగానే చూశారనీ, పర్యావరణాన్ని గౌరవించడం భారత సంస్కృతిలో పురాతన కాలం నుంచే భాగంగా ఉందనీ, స్వచ్ఛతా అభియాన్ ద్వారా ప్రజల ప్రవర్తనను మార్చడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ చెప్పుకొచ్చారు. అసలైన నాయకుడు మోదీ: గ్యుటెరస్ హరిత వాతావరణాన్ని నమ్మే వారి పక్షానే సాంకేతికత ఉంటుందని గ్యుటెరస్ అన్నారు. ‘అసలైన నాయకత్వం కలిగిన ఓ రాజనీతిజ్ఞుడిని ఈ పురస్కారంతో మనం గుర్తిస్తున్నాం. వాతావరణ మార్పు సమస్యను గుర్తించి, పర్యావరణ పరిరక్షణతో వచ్చే లాభాలను అర్థం చేసుకునే నాయకుడు మోదీలో ఉన్నారు. ఆయనకు సమస్యలు తెలుసు, పరిష్కరించేందుకూ పనిచేస్తున్నారు. హరిత వాతావరణం మంచి వాతావరణం. బూడిద వాతావరణాన్ని నమ్మే వారి భవిష్యత్తు కూడా బూడిదలాగే ఉంటుంది’ అని గ్యుటెరస్ పేర్కొన్నారు. అవార్డును మోదీకి ప్రదానం చేయడంతో ఆయనకు తగిన గుర్తింపు దక్కిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. -
సోమరాజుకు ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు
గొల్లపాలెం (కాజులూరు): స్థానిక గాయత్రి ఫొటో స్టూడియో అధినేత మేరేటి సోమరాజు అంతర్జాతీయ ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. ఆ వివరాలను ఆయన ఆదివారం గ్రామంలో విలేకరులకు తెలిపారు. ప్రతీ ఏటా బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీæ(లండన్), ఫొటో సొసైటీ ఆఫ్ అమెరికా (అమెరికా), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీలా ఆర్ట్స్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)లతోపాటు ఇమేజ్ కాలేజ్ సొసైటీ ఆఫ్ అమెరికా ఉత్తమ ఫొటోగ్రాఫర్లను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తాయన్నారు. ఈ ఏడాది ఆ పోటీలకు తాను గిరిజన జీవనశైలిపై తీసిన ఛాయాచిత్రాలను పంపగా తనకు అత్యున్నత పురస్కారం లభించిందన్నారు. అమెరికాకు చెందిన ఇమేజ్ కాలేజ్ సొసైటి చైర్మన్ టోని లికిస్ తాస్ ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారన్నారు. తనను ఆ అవార్డుకు ఎంపిక చేయడమే కాకుండా సొసైటీలో జీవితకాలపు సభ్యత్వాన్ని కూడా ప్రకటించారన్నారు. తన అవార్డు పత్రాలను ఆ సంస్థలు విజయవాడలో ఉన్న ప్రతినిధులకు పంపించగా ఆంధ్రప్రదేశ్ ఫొటో అకాడమీ నిర్వహించిన ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో శనివారం అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా తాను అందుకున్నానన్నారు. సోమరాజును మండల ఫొటోగ్రాఫర్స్ సంఘ సభ్యులు అభినందించారు. -
పీఆర్ ఏఈ రాంబాబుకు విశ్వేశ్వరయ్య అవార్డు
అమలాపురం : ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డు–2016కు అమలాపురం పంచాయతీరాజ్ ఏఈ అన్యం రాంబాబు ఎంపికయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న 19 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. హైదరాబాద్ మెగా సిటీ నవ్య కల్యాణ వేదిక (మదర్ ఫౌండేషన్) ఈ ఎంపిక చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ అవార్డును తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్. విద్యాసాగర్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి అందుకున్నానని రాంబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కోనసీమలో తీర ప్రాంత గ్రామమైన నక్కారామేశ్వరం నదీపాయపై రూ.8 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 200 మీటర్ల మేర వంతెనను సకాలంతో నిర్మించినందుకు ఈ అవార్డు దక్కింది. ఏపీ నుంచి ఏఈ కేడర్‌లో ఈ అవార్డులకు ఎంపికైన తొమ్మిది మంది రాంబాబు ఒకరు. ఆయనకు అవార్డు రావటంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే ఎ.ఆనందరావు, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పంచాయతీరాజ్ ఎస్ఈ వి.వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు.