‘చాంపియన్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ మోదీ | PM Narendra Modi receives UN's Champions of the Earth award | Sakshi
Sakshi News home page

‘చాంపియన్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ మోదీ

Published Thu, Oct 4 2018 2:28 AM | Last Updated on Thu, Oct 4 2018 4:51 AM

PM Narendra Modi receives UN's Champions of the Earth award - Sakshi

గ్యుటెరస్‌ చేతులమీదుగా ‘చాంపియన్‌ఆఫ్‌ ది ఎర్త్‌’ పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: స్వచ్ఛ, హరిత పర్యావరణం తమ ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చెప్పారు. వాతావరణం, విపత్తులకు సంస్కృతితో సంబంధం ఉందనీ, పర్యావరణాన్ని కాపాడటం మన సంస్కృతిలో భాగం కానంతవరకు విపత్తులను నివారించడం చాలా కష్టమైన పని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అవార్డును మోదీ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ–ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌) విజయవంతమవ్వడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను మోదీతోపాటు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌కు సంయుక్తంగా ఈ అవార్డును ఐరాస ప్రకటించింది. అవార్డును స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ‘వ్యవసాయ, పారిశ్రామిక విధానాల నుంచి ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు.. అన్నింట్లోనూ స్వచ్ఛ వాతావరణం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు భారత్‌ ఇటీవలి కాలంలో మరింతగా పాటుపడుతోంది. 2005తో పోలిస్తే 2020కల్లా కర్బన ఉద్గారాలను 20–25 శాతం, 2030 నాటికి 30–35 శాతం తగ్గించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 కల్లా ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు.

వారందరికీ దక్కిన గౌరవం ఈ అవార్డు..
మోదీ మాట్లాడుతూ ‘ఈ దేశంలో కొన్ని తెగల ప్రజలు అడవుల్లో బతుకుతూ తమ ప్రాణాలకంటే అక్కడి చెట్లనే ఎక్కువ ప్రేమిస్తారు. మత్స్యకారులు తమ జీవనానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి ఎన్ని చేపలు అవసరమో అన్నే పడతారు తప్ప అత్యాశకు పోరు. రైతులు ఎంతో కష్టపడి దేశం ఆకలి తీరుస్తున్నారు. చెట్లను దేవతలుగా పూజించే మహిళలు ఇక్కడ ఉన్నారు. వీరందరికీ దక్కిన గుర్తింపుగా నేను ఈ అవార్డును భావిస్తున్నాను’ అని అన్నారు. ప్రకృతిని భారతీయులెప్పుడూ ప్రాణం ఉన్న జీవిగానే చూశారనీ, పర్యావరణాన్ని గౌరవించడం భారత సంస్కృతిలో పురాతన కాలం నుంచే భాగంగా ఉందనీ, స్వచ్ఛతా అభియాన్‌ ద్వారా ప్రజల ప్రవర్తనను మార్చడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ చెప్పుకొచ్చారు.

అసలైన నాయకుడు మోదీ: గ్యుటెరస్‌
హరిత వాతావరణాన్ని నమ్మే వారి పక్షానే సాంకేతికత ఉంటుందని గ్యుటెరస్‌ అన్నారు. ‘అసలైన నాయకత్వం కలిగిన ఓ రాజనీతిజ్ఞుడిని ఈ పురస్కారంతో మనం గుర్తిస్తున్నాం. వాతావరణ మార్పు సమస్యను గుర్తించి, పర్యావరణ పరిరక్షణతో వచ్చే లాభాలను అర్థం చేసుకునే నాయకుడు మోదీలో ఉన్నారు. ఆయనకు సమస్యలు తెలుసు, పరిష్కరించేందుకూ పనిచేస్తున్నారు. హరిత వాతావరణం మంచి వాతావరణం. బూడిద వాతావరణాన్ని నమ్మే వారి భవిష్యత్తు కూడా బూడిదలాగే ఉంటుంది’ అని గ్యుటెరస్‌ పేర్కొన్నారు. అవార్డును మోదీకి ప్రదానం చేయడంతో ఆయనకు తగిన గుర్తింపు దక్కిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement