పీఆర్ ఏఈ రాంబాబుకు విశ్వేశ్వరయ్య అవార్డు
అమలాపురం :
ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డు–2016కు అమలాపురం పంచాయతీరాజ్ ఏఈ అన్యం రాంబాబు ఎంపికయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న 19 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. హైదరాబాద్ మెగా సిటీ నవ్య కల్యాణ వేదిక (మదర్ ఫౌండేషన్) ఈ ఎంపిక చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ అవార్డును తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్. విద్యాసాగర్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి అందుకున్నానని రాంబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కోనసీమలో తీర ప్రాంత గ్రామమైన నక్కారామేశ్వరం నదీపాయపై రూ.8 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 200 మీటర్ల మేర వంతెనను సకాలంతో నిర్మించినందుకు ఈ అవార్డు దక్కింది. ఏపీ నుంచి ఏఈ కేడర్‌లో ఈ అవార్డులకు ఎంపికైన తొమ్మిది మంది రాంబాబు ఒకరు. ఆయనకు అవార్డు రావటంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే ఎ.ఆనందరావు, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వి.వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు.