azad encounter case
-
ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ
సాక్షి, ఆదిలాబాద్: ఆజాద్ ఎన్కౌంటర్ కేసు మరోమలుపు తిరిగింది. పోలీసులు విచారణ ఎదుర్కోవాలని జిల్లాకోర్టు తీర్పునిచ్చింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్కౌంటర్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ జిల్లా కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. మూడు నెలల నుంచి జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. ఈ మేరకు మంగళవారం కేసుకు సంబంధించి జిల్లా కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎంఆర్ సునీత తీర్పునిచ్చినట్లు ఆజాద్ తరఫు న్యాయవాది రహీం తెలిపారు. ఇరువర్గాల వాదనల అనంతరం కేసుతో సంబంధం ఉన్న 29 మంది పోలీసులు మున్సిఫ్ కోర్టులో విచారణకు హాజరు కావాలని జడ్జి ఆదేశించారు. గతంలో జిల్లాకోర్టు ఇచ్చిన తీర్పుపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలను జిల్లా కోర్టు వినలేదని పేర్కొన్నారు. దీంతో మరోసారి వాదనలు వినాలని జిల్లాకోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత జిల్లాకోర్టు తీర్పు వెల్లడించింది. మూడు నెలల్లో విచారణ ప్రారంభించాలని సూచించినట్లు తెలిపారు. బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. దీంతో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఎన్కౌంటర్ అనే పదాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించిందని న్యాయవాది పేర్కొన్నారు. మూడు నెలలపాటు విచారణ ఆదిలాబాద్ జిల్లా కోర్టులో మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్ కేసు విచారణ సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. 2010 జూలై 1న అర్ధరాత్రి కుమురంభీం జిల్లా వాంకిడి పోలీసుస్టేషన్ పరిధిలోని సర్కెపల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే చనిపోయారని పోలీసులు ప్రకటించారు. అయితే ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ ఆజాద్ భార్య పద్మ, హేమచంద్ర పాండే భార్య బబితాపాండే కోర్టును ఆశ్రయించారు. కేసు చివరికి ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు వచ్చింది. పలుసార్లు ఆజాద్ భార్య జిల్లా కోర్టుకు హాజరయ్యారు. చదవండి: (ఆజాద్ కేసు.. పోలీస్ శాఖలో వణుకు!) (వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్) -
న్యాయ వ్యవస్థపై నమ్మకముంది..
సాక్షి, ఆదిలాబాద్: ‘ఈరోజు సంతోషాన్నిచ్చింది.. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్న ఆశ కలుగుతుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడింది. ఆజాద్‌ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఆజాద్ ఎన్కౌంటర్ తర్వాత 2013 నుంచి కోర్టుకు విచారణ నిమిత్తం ఆదిలాబాద్‌కు 30 మార్లకు పైగా వచ్చాను. కేసులో ఈ మలుపు కీలకంగా భావిస్తున్నాను..’ అని మావోయిస్టు అగ్రనేత, 2010లో ఆదిలాబాద్ అడవుల్లో ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆజాద్ సహచరిణి పద్మ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎదురు కాల్పుల్లో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆజాద్ మృతిచెందారని పోలీసులు చెప్పడాన్ని ఆమె మొదటి నుంచి తప్పుబడుతున్నారు. ఆజాద్‌ను పట్టుకొని తీసుకెళ్లి కాల్చి చంపారని చెబుతూ వస్తోంది. తాజాగా గురువారం ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని జిల్లా అదనపు సెషన్స్ జడ్జి(ఎస్సీ/ఎస్టీ కోర్టు) భారతిలక్ష్మి కింది కోర్టు(జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు)ను ఆదేశించినట్లు పద్మ తరపున న్యాయవాది సురేష్‌కుమార్ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 29 మంది పోలీసులపై న్యాయ విచారణ ప్రారంభించాలని ఉత్తర్వు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
పోలీసులపై న్యాయ విచారణ
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆజాద్ ఎన్‌కౌం టర్‌పై పునర్విచారణ చేపట్టాలని ఆదిలా బాద్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు (ఎస్సీ/ఎస్టీ కోర్టు) దిగువ కోర్టును ఆదేశించింది. ఈ కేసుతో సం బంధమున్న 29 మంది పోలీసులపై హత్యా నేరం కింద విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి భారతిలక్ష్మి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆజాద్ ఎన్కౌంటర్ బూటకమని, ఆ కేసులో పునర్వి చారణ జరపాలని, పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేపట్టాలని ఆజాద్ భార్య గతం లోనే ఆదిలాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు 2015 మార్చి 24న ఈ పిటిషన్‌ను తిరస్కరిం చింది. దాంతో ఆమె జిల్లా కోర్టును ఆశ్రయిం చగా.. తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. గురువారం కోర్టుకు హాజరైన ఆజాద్ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేశ్ కుమార్, ఆ ఎన్కౌంటర్లో మృతి చెందిన జర్నలిస్టు హేమచంద్ర పాండే భార్య బబిత తరఫు న్యాయవాది, పౌర హక్కుల నేత రఘునాథ్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద విచారణకు ఆదేశించడం దేశంలోనే ఇది తొలిసారి అని వారు పేర్కొన్నారు. తిరస్కరించిన ఫస్ట్‌క్లాస్ కోర్టు.. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా ఆజాద్ భార్య పద్మ, ఆమె తరఫు న్యాయవాది సురేశ్ 2013 జూలైలో ఆదిలాబాద్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో ప్రొటెక్ట్ పిటిషన్ వేశారు. ఆజాద్ ఎన్కౌంటర్ బూటకమని, బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని, హత్యానేరం కింద విచారించాలని కోరారు. స్వామి అగ్నివేశ్ సైతం 2014 ఫిబ్ర వరి 17న కోర్టుకు హాజరై తన వాదనలు విని పించారు. రెండేళ్ల పాటు వాదనలు విన్న కోర్టు.. పిటిషన్‌ను తిరస్కరిస్తూ 2015 మార్చి 24న ఉత్తర్వులిచ్చింది. దీంతో పద్మ ఈ కేసును పున ర్విచారణ చేయాలని, ఎన్‌కౌంటర్‌తో సంబం« దమున్న పోలీసులపై న్యాయ విచారణ చేపట్టా లని కోరుతూ గతేడాది అక్టోబర్‌లో ఆదిలాబా ద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పలుమార్లు వాదనలు జరిగాయి. సీబీఐ తర ఫున న్యాయవాది అలెగ్జాండర్ వాదనలు విని పించారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి తాజాగా పునర్విచారణకు ఆదేశించారు. నమ్మకం పెరిగింది: పద్మ ఆదిలాబాద్ జిల్లా కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చిందని ఆజాద్ భార్య పద్మ పేర్కొన్నారు. దీనితో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని చెప్పారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. 8 ఏళ్ల కిందట ఎన్కౌంటర్ 2010 జూలై 2న ఆదిలాబాద్ జిల్లా సర్కేపల్లి–జోగాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్, జర్నలిస్టు హేమచంద్ర పాండేలు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టు అగ్రనేతలకు మధ్య చర్చల కోసం స్వామి అగ్నివేశ్ మధ్యవర్తిత్వం జరుపుతున్న సమయంలో ఈ ఘటన జరగడం సంచలనం సృష్టించింది. అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ స్వామి అగ్నివేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆజాద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారని పేర్కొంటూ.. పలు ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలను కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు 2011 జనవరి 14న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాదనలు విన్న అనంతరం ఈ కేసును 2011 ఏప్రిల్ 15న సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేశారు. ఆ ఎన్కౌంటర్ నిజమైనదేనంటూ సీబీఐ 2012లో 192 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే ఎన్కౌంటర్లో భాగస్వాములైన పోలీసుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉండటంతో.. ఆ నివేదిక ప్రతులను బాధిత కుటుంబాలకు అందజేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సుమారు ఏడాది తర్వాత ఆజాద్ భార్య పద్మకు సీబీఐ నివేదిక ప్రతులు అందాయి. -
ఆజాద్ కేసు.. పోలీస్ శాఖలో వణుకు!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. జూలై 1, 2010 న ఆదిలాబాద్ జిల్లా సార్కపల్లిలో ఆజాద్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చినట్టు ఆయన భార్య అప్పట్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై ఏళ్లుగా విచారణ సాగగా పోలీసులపై హత్యానేరం అవసరంలేదని ఇటీవల కింది కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను జిల్లా కోర్టు కొట్టివేస్తూ ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మందిని హత్యానేరం కింద విచారించాలని కింది కోర్టుకు సూచించింది. ఈ మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందికి సమస్లు జారీ చేసింది. రాష్ట్రంలో మొదటిసారిగా పోలీసులు హత్యానేరం ఎదుర్కోవాల్సి రావడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలవరం మొదలైంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న అప్పటి సీఐ రఘునందన్, ఎస్ఐ ప్రవీణ్, ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, ఇతర ఆర్మ్డ్ పార్టీ సిబ్బందిపై హత్య కేసు విచారణ మళ్లీ మొదలవడంతో పోలీసు శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఎటు వెళ్లి.. ఎవరి మెడకు బిగిసేనో..? మహారాష్ట్ర నుంచి ప్రాణాలతో పట్టుకొచ్చి ఆజాద్‌ను కాల్చి చంపారనే అభియోగం ఉంది. ఆజాద్‌తో ఉన్న జర్నలిస్టు హేమచంద్ర పాండేను సైతం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కోర్టు డైరెక్షన్‌తో చేపట్టే విచారణ సంచలనాత్మకంగా మారే అవకాశముంది. ఎన్కౌంటర్ సమయంలో ఆజాద్ ఒక్కడే ఎలా దొరికాడు? నిజంగా ఎదురుకాల్పుల్లో మృతి చెందాడా? పట్టుకొచ్చి కాల్చిచంపారా? అన్న వాటిపై పూర్తి వివరాలు బయటకు వస్తాయని సర్వత్రా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ చేయాలన్న ఆదేశం ఎవరి నుంచి వచ్చింది? అప్పటి డీజీపీ ఎవరు? వారికి, ప్రభుత్వానికి ఈ ఎన్కౌంటర్ నిర్ణయంపైన చర్చ జరిగిందా? జరిగితే ఆదేశాలు వెలువరించింది ఎవరు? అన్న దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారుల మెడకు కేసు ఉచ్చు బిగుస్తుందని చర్చ సాగుతోంది. మావోయిస్టు వ్యవహారాలను పర్యవేక్షించే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పెద్దలకు సైతం ఈ కేసులో షాక్ తప్పదని పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. దీనికి అప్పటి ప్రభుత్వం, హోంమంత్రి, డీజీపీ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడేంటి పరిస్థితి? ఎన్కౌంటర్ కేసు విచారణతో రాష్ట్ర పోలీస్ శాఖ ఆందోళనలో పడ్డట్టు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం, అప్పటి పోలీస్ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తలనొప్పులు తెచ్చిపెట్టినట్టు అభిప్రాయపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణ పోలీస్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించడం వల్లే తాము ఇరుకున్నామని, ఇప్పుడు ఏం చేయాలో తమకు తెలియడంలేదని బాధిత అధికారులు గోడువెళ్లబోసుకుంటున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన కానిస్టేబుళ్లు సైతం విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని, దీనిపై ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై కేసులో ఉన్న పోలీస్ అధికారులు విచారణలో నోరు విప్పితే అప్పటి ప్రభుత్వ పెద్దలకూ చిక్కులు తప్పవని తెలుస్తోంది. కేసు ఎటు నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠనెలకొంది. పోలీసులపై ఇదే మొదటి కేసు ‘‘దేశవ్యాప్తంగా జరిగిన అనేక బూటకపు ఎన్కౌంటర్ల కేసుల్లో ఎక్కడా కూడా పోలీసులపై విచారణ చేయాలని కోర్టులు ఆదేశించలేదు. కానీ ఒక జిల్లా న్యాయస్థానం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద విచారణకు ఆదేశించడం న్యాయ వ్యవస్థలో కీలక పరిణామం. దీనివల్ల బాధితులకు న్యాయ వ్యవస్థపై ప్రగాఢ విశ్వాసం కలిగింది. ఈ ఎన్‌కౌంటర్‌కు ఆదేశాలు ఎవరివి, అసలు దోషులెవరు అన్న విషయాలన్నీ బయటకు రావాలని పోరాటం చేస్తాం..’’ – న్యాయవాది, పౌర హక్కుల నేత రఘునాథ్ -
ఆజాద్ ఎన్కౌంటర్ కేసు.. భార్య పిటిషన్ కొట్టివేత
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తంచేస్తూ ఘటనకు సంబంధమున్న పోలీసులను విచారించాల్సిందిగా ఆయన భార్య పద్మ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టు కొట్టేసింది. తీర్పుపై స్పంచిందిన పద్మ.. ఆదిలాబాద్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టంచేశారు. 2010లో ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఆజాద్ సహా జర్నలిస్ట్ హేమచంద్రపాండే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. అయితే అది బూటకపు ఎన్కౌంటర్ అని, వారిద్దరినీ సజీవంగా పట్టుకొని చిత్రహింసలు చేసిన అనంతరం చంపారని పలు హక్కుల సంఘాలు ఆరోపించాయి. న్యాయవిచారణ చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.