ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆజాద్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్‌కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. జూలై 1, 2010 న ఆదిలాబాద్ జిల్లా సార్కపల్లిలో ఆజాద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చినట్టు ఆయన భార్య అప్పట్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై ఏళ్లుగా విచారణ సాగగా పోలీసులపై హత్యానేరం అవసరంలేదని ఇటీవల కింది కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను జిల్లా కోర్టు కొట్టివేస్తూ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మందిని హత్యానేరం కింద విచారించాలని కింది కోర్టుకు సూచించింది. ఈ మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందికి సమస్లు జారీ చేసింది. రాష్ట్రంలో మొదటిసారిగా పోలీసులు హత్యానేరం ఎదుర్కోవాల్సి రావడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలవరం మొదలైంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అప్పటి సీఐ రఘునందన్, ఎస్‌ఐ ప్రవీణ్, ఏఎస్‌ఐ, ఏఆర్‌ఎస్‌ఐ, ఇతర ఆర్మ్‌డ్ పార్టీ సిబ్బందిపై హత్య కేసు విచారణ మళ్లీ మొదలవడంతో పోలీసు శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది.
ఎటు వెళ్లి.. ఎవరి మెడకు బిగిసేనో..?
మహారాష్ట్ర నుంచి ప్రాణాలతో పట్టుకొచ్చి ఆజాద్‌ను కాల్చి చంపారనే అభియోగం ఉంది. ఆజాద్‌తో ఉన్న జర్నలిస్టు హేమచంద్ర పాండేను సైతం పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కోర్టు డైరెక్షన్‌తో చేపట్టే విచారణ సంచలనాత్మకంగా మారే అవకాశముంది. ఎన్‌కౌంటర్ సమయంలో ఆజాద్ ఒక్కడే ఎలా దొరికాడు? నిజంగా ఎదురుకాల్పుల్లో మృతి చెందాడా? పట్టుకొచ్చి కాల్చిచంపారా? అన్న వాటిపై పూర్తి వివరాలు బయటకు వస్తాయని సర్వత్రా భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ చేయాలన్న ఆదేశం ఎవరి నుంచి వచ్చింది? అప్పటి డీజీపీ ఎవరు? వారికి, ప్రభుత్వానికి ఈ ఎన్‌కౌంటర్ నిర్ణయంపైన చర్చ జరిగిందా? జరిగితే ఆదేశాలు వెలువరించింది ఎవరు? అన్న దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారుల మెడకు కేసు ఉచ్చు బిగుస్తుందని చర్చ సాగుతోంది. మావోయిస్టు వ్యవహారాలను పర్యవేక్షించే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పెద్దలకు సైతం ఈ కేసులో షాక్ తప్పదని పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. దీనికి అప్పటి ప్రభుత్వం, హోంమంత్రి, డీజీపీ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడేంటి పరిస్థితి?
ఎన్‌కౌంటర్ కేసు విచారణతో రాష్ట్ర పోలీస్ శాఖ ఆందోళనలో పడ్డట్టు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం, అప్పటి పోలీస్ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తలనొప్పులు తెచ్చిపెట్టినట్టు అభిప్రాయపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణ పోలీస్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించడం వల్లే తాము ఇరుకున్నామని, ఇప్పుడు ఏం చేయాలో తమకు తెలియడంలేదని బాధిత అధికారులు గోడువెళ్లబోసుకుంటున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన కానిస్టేబుళ్లు సైతం విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని, దీనిపై ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై కేసులో ఉన్న పోలీస్ అధికారులు విచారణలో నోరు విప్పితే అప్పటి ప్రభుత్వ పెద్దలకూ చిక్కులు తప్పవని తెలుస్తోంది. కేసు ఎటు నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠనెలకొంది.
పోలీసులపై ఇదే మొదటి కేసు
‘‘దేశవ్యాప్తంగా జరిగిన అనేక బూటకపు ఎన్‌కౌంటర్ల కేసుల్లో ఎక్కడా కూడా పోలీసులపై విచారణ చేయాలని కోర్టులు ఆదేశించలేదు. కానీ ఒక జిల్లా న్యాయస్థానం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద విచారణకు ఆదేశించడం న్యాయ వ్యవస్థలో కీలక పరిణామం. దీనివల్ల బాధితులకు న్యాయ వ్యవస్థపై ప్రగాఢ విశ్వాసం కలిగింది. ఈ ఎన్‌కౌంటర్‌కు ఆదేశాలు ఎవరివి, అసలు దోషులెవరు అన్న విషయాలన్నీ బయటకు రావాలని పోరాటం చేస్తాం..’’
– న్యాయవాది, పౌర హక్కుల నేత రఘునాథ్
Comments
Please login to add a commentAdd a comment