సాక్షి, ఆదిలాబాద్: ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు మరోమలుపు తిరిగింది. పోలీసులు విచారణ ఎదుర్కోవాలని జిల్లాకోర్టు తీర్పునిచ్చింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ జిల్లా కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. మూడు నెలల నుంచి జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. ఈ మేరకు మంగళవారం కేసుకు సంబంధించి జిల్లా కోర్టు ప్రధానన్యాయమూర్తి ఎంఆర్ సునీత తీర్పునిచ్చినట్లు ఆజాద్ తరఫు న్యాయవాది రహీం తెలిపారు. ఇరువర్గాల వాదనల అనంతరం కేసుతో సంబంధం ఉన్న 29 మంది పోలీసులు మున్సిఫ్ కోర్టులో విచారణకు హాజరు కావాలని జడ్జి ఆదేశించారు.
గతంలో జిల్లాకోర్టు ఇచ్చిన తీర్పుపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలను జిల్లా కోర్టు వినలేదని పేర్కొన్నారు. దీంతో మరోసారి వాదనలు వినాలని జిల్లాకోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత జిల్లాకోర్టు తీర్పు వెల్లడించింది. మూడు నెలల్లో విచారణ ప్రారంభించాలని సూచించినట్లు తెలిపారు. బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. దీంతో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఎన్‌కౌంటర్ అనే పదాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించిందని న్యాయవాది పేర్కొన్నారు.
మూడు నెలలపాటు విచారణ
ఆదిలాబాద్ జిల్లా కోర్టులో మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు విచారణ సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. 2010 జూలై 1న అర్ధరాత్రి కుమురంభీం జిల్లా వాంకిడి పోలీసుస్టేషన్ పరిధిలోని సర్కెపల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే చనిపోయారని పోలీసులు ప్రకటించారు. అయితే ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ ఆజాద్ భార్య పద్మ, హేమచంద్ర పాండే భార్య బబితాపాండే కోర్టును ఆశ్రయించారు. కేసు చివరికి ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు వచ్చింది. పలుసార్లు ఆజాద్ భార్య జిల్లా కోర్టుకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment