ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రైతు నుంచి రూ.5 వేలు లంచం
తీసుకుంటుండగా పట్టివేత
అరెస్టు చేసిన అధికారులు
కె.కోటపాడు: పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ మేడిచర్ల వీఆర్వో యాదగిరి కన్నయ్య మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలిలావున్నాయి. మేడిచర్ల గ్రామానికి చెందిన రైతు కొల్లి సత్యనారాయణ గతేడాది సెప్టెంబరు 13న ఎకరా భూమికి పట్టాదారు పాసు పుస్తకానికి మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. ఇందుకోసం అతని తండ్రి సూర్యనారాయణ వీఆర్వో కన్నయ్య చుట్టూ తిరుగుతున్నాడు. పాసు పుస్తకం మంజూరుకు వీఆర్వో రూ.9 వేలు డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇచ్చేందుకు సూర్యనారాయణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సొమ్మును మంగళవారం కె.కోటపాడులోని ఇంటికి తెచ్చి ఇవ్వాలని వీఆర్వో కన్నయ్య సూచించాడు.
ఈ మేరకు రూ. 5వేలు లంచం ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు వీఆర్వోను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం కోసం వేధించే ఉద్యోగుల సమాచారాన్ని 9440446170, 0891-2552894 నంబర్లకు తెలియజేయాలని కోరారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎంవీ గణేష్, రమణమూర్తి, రామకృష్ణ పాల్గొన్నారు.
అవినీతి ఆరోపణలెన్నో : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ మేడిచర్ల వీఆర్వోపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. హుద్‌హుద్ తుపానుకు సంబంధించి మేడిచర్ల, ఎ. భీమవరం, సూరెడ్డిపాలెం పంటనష్టం నమోదులో అనర్హులకు నష్టం పరిహారం అందేలా తప్పుడు నివేదికలు ఇచ్చినట్టు వినవస్తోంది. పంట నష్టం మంజూరులో అవకతవకలపై మేడిచర్ల రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.