భూమి పట్టా చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
స్టేషన్‌ఘన్‌పూర్: తన భూమికి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొండాపూర్‌కు చెందిన రైతు వనమాల రాజు తన తాత వనమాల భద్ర య్య పేరిట (సర్వే నంబర్ 229/ఏ) ఉన్న వ్యవసాయ భూమిని తన పేరిట పట్టా చేయాలని కోరుతూ ఏడాదిగా రెవెన్యూ అధికారుల చుట్టూరా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొండాపూర్ వీఆర్ఓ రూ.20 వేలు లంచం అడగగా భార్య పుస్తెలతాడు అమ్మి డబ్బులు ఇచ్చాడు.
అయినా తిప్పించుకుంటుండంతోతహసీల్దార్ రామ్మూర్తిని సంప్రదించా డు. తహసీల్దార్ సైతం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రాజు బుధవారం సాయంత్రం తండ్రి సోమయ్యతో కలిసి తహసీల్ కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దార్‌ను, వీఆర్ఓను కలిశారు. అక్కడ వీఆర్ఓ రామకృష్ణను కలవగా, రోజూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. అసలు మీ పేరిట పట్టా కాదని మండిపడ్డాడు. దీంతో మనోవేదనకు గురైన రాజు పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు బానోతు సునీల్‌నాయక్‌తోపాటు స్థానికులు అతడి నుంచి మందు డబ్బా లాగి పారేశారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు.