విముక్తి కల్పిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీ వాసులకు విముక్తి కల్పించేందుకే ‘బద్లో దిల్లీ’కార్యక్రమాన్ని చేపట్టినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. నగర బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బద్లోదిల్లీ’పాదయాత్రను బుధవారం లాల్‌బాగ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా.హర్షవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్టు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. లాల్బాగ్ నియోజకవర్గంలోని ఎన్నో మురికివాడల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలోని మురికివాడలతోపాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పేద, నిమ్నవర్గాలకు కనీస సదుపాయాలు కల్పించడంలోనూ కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంతోపాటు బీజేపీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.
విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం
బీజేపీ మొదటి నుంచి హామీ ఇస్తున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు 30 శాతం తగ్గిస్తామని గోయల్ పునరుద్ఘాటించారు. అడ్డగోలు నీటిబిల్లులకు సైతం చెక్ పెడతామన్నారు. పేదల సంక్షేమానికి అవసరమైన అన్ని పథకాలు తెస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మోడల్‌టౌన్ అభ్యర్థి అశోక్‌గోయల్ పాల్గొన్నారు. గురువారం సంఘం విహార్ నుంచి యాత్ర మొదలవనుంది.