Bahrain country
-
భార్యను స్వదేశానికి తీసుకురావాలంటూ వేడుకోలు
అమలాపురం రూరల్: బెహ్రయిన్‌లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్‌తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. -
ఇక్కడ పార్లమెంట్ ఉన్నా అధికారం రాజరికానిదే!
బహ్రెయిన్ నేను సందర్శించడానికి ఎంపిక చేసుకున్న గమ్యస్థానం కాదు. దాన్ని ఎమిరేట్స్, ఖతర్‌కు చెందిన పేద బంధువులాగా భావించేవాడిని. కానీ నాకు తెలిసిన వాస్తవం ఏమిటంటే ఆ ప్రాంతం గురించి నాకు ఏమీ తెలీదు. నా అభిప్రాయం నా అజ్ఞానానికి ప్రతిబింబంగా ఉండేది. గత వారాంతంలో నాదెంత తప్పుడు అభిప్రాయమో నేను కనిపెట్టాను. బహ్రెయిన్ వెచ్చని, సంతోషకరమైన, ఆకర్షణీయమైన దేశం. నమ్మలేనంత శుభ్రంగానూ, దుబాయ్, అబుదాబీ, ఖతార్ లాగే ఆధునికంగానూ ఉంది. కానీ బహ్రెయిన్ చాలా చిన్నదేశం. కేవలం 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న దేశం. వాస్తవానికి ‘బహ్రెయిన్ ద్వీపం’ అనే పేరు కలిగి ఉన్న ద్వీప సమూహం. కొద్ది కాలం క్రితం ఈ ద్వీపం 40 కిలోమీటర్ల పొడవు, 16 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భూభాగంగా మాత్రమే ఉండేది. సముద్రం నుంచి ఏర్పడుతూ వచ్చిన ఈ దేశం (ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంది) తన సైజును బహుశా రెట్టింపు చేసుకోగలిగింది. కానీ మాల్దీవులు, సింగపూర్ తర్వాత ఇది ఇప్పటికీ ఆసియాలో మూడో అతి చిన్న దేశంగా ఉంది. బహ్రెయిన్ జనాభా 16 లక్షలు మాత్రమే. భారత దేశం నుంచే 4 లక్షల మంది ప్రవాసులు ఈ దేశానికి వచ్చారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది కేరళకు చెందిన వారే. ఈ దేశ జనాభాలో 43 శాతం మంది అరబ్ యేతర ఆసియన్లే అని వికీపీడియా పేర్కొంటోంది. వీరంతా ప్రవాసం వచ్చిన కార్మికులే అని నా అంచనా. స్థానిక జనాభా 47 శాతం మాత్రమే. ఈ చిన్న ద్వీపం గురించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1931లో ఇక్కడే బయటపడింది. ఈరోజు బహ్రెయిన్ ప్రముఖ చమురు ఉత్పత్తిదారు కాదు. కానీ ఈ చమురు బావి నిరుపయోగకరంగా ఉన్నప్పటికీ పర్యాటకులకు మాత్రం గర్వంగా తన్ను తాను ప్రదర్శించుకుంటోంది. బహ్రెయిన్ దీనార్ ప్రపంచంలోనే రెండో అతి శక్తిమంతమైన కరెన్సీ. ఒక దీనార్కి మీరు 2.65 అమెరికన్ డాలర్లు పొందవచ్చు. కాబట్టి బహ్రెయిన్ మరీ అల్లాటప్పా దేశం కాక పోవచ్చు. బహ్రెయిన్‌లోని కేరళీయ సమాజం ఆహ్వానం మేరకు నేను ఆ దేశాన్ని సందర్శించాను. ఇది ఉజ్జ్వలమైన, అంకిత భావం కలిగిన సామాజిక సంస్థ. అలాగే డీసీ బుక్స్‌కి కూడా ఇది పేరుపొందింది. ద్వీపంలో జరిగే బుక్ ఫెస్టివల్లో కేరళీయులు ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఈ పుస్తక ప్రదర్శనశాల జాతీయ ఎన్నికలతో ముడిపడి ఉండటం నాకు ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. మనదేశంతో పోలిస్తే ఇక్కడి ఎన్నికలు చాలా చాలా చిన్నవే కావచ్చు కానీ వాటిని వీరు నిర్వహించే తీరు మాత్రం నన్ను పరవశింపజేసింది. బహ్రెయిన్‌లో ఉన్నది రాచరిక వ్యవస్థే. అది స్వభావ రీత్యా రాజ్యాంగబద్ధమైనదే కావచ్చు కానీ అధికారం మాత్రం రాజు హమీద్, అల్ ఖలీఫా రాజకుటుంబం చేతిలో మాత్రమే ఉంటుంది. అయితే 2002 నుంచి ప్రతి అయిదేళ్ల కోసారి పార్లమెంటును ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది 40 సీట్ల సింగిల్ ఛాంబర్ హౌస్. ఎగువ, దిగువ సభల్లాంటివి ఉండవు. బహ్రెయిన్ రాజ్యంలో రాజకీయ పార్టీలు లేవు. పార్లమెంటుకు అభ్యర్థులు స్వతంత్రులుగానే పోటీ చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్లాగే, ఇక్కడా ఎన్నికలు రెండు దశలలో ఉంటాయి. తొలివిడత ఎన్నికలు నేను రావడానికి ముందే నవంబర్ 12న జరిగాయి. 40 పోలింగ్ బూత్‌లలో 344 మంది అభ్యర్థులకు ఓటు వేయడానికి 3,44,713 మంది బహ్రెయిన్ పౌరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఈ 344 మంది అభ్యర్థుల్లో 40 మందిని ఎన్ను కోవడానికి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ విస్తరించి ఉన్న సీఫ్ మాల్లో విహారయాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. నేను ఈ దేశాన్ని సందర్శించినప్పుడు ఓటు వేయడానికి తమ వంతు సమయం కోసం ఎదురు చూస్తున్న ఓటర్లు స్టార్‌బక్స్ కాఫీలు సేవిస్తూ, హాగెన్–దాస్ ఐస్‌క్రీములను లాగించేస్తూ కనిపించారు. ఇక్కడ అన్నీ ఎయిర్ కండిషన్‌తో సౌకర్యవంతంగా ఉంటాయి! ప్రవాసం వచ్చినవారు, గల్ఫ్ సహకార దేశాలకు చెందిన పౌరులు దేశంలో సొంత ఆస్తులను కలిగి ఉండి ఇక్కడే జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఓటు వేసేందుకు బహ్రెయిన్ అనుమతిస్తుంది. నేను ఇక్కడ పర్యటించిన ప్పుడు జరిగిన ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది చాలా అధిక శాతమట. ఇక రెండో విడత పోలింగ్ 13వ తేదీన ముగిసింది తొలి రౌండ్ ఓటింగ్ తర్వాత, ‘ది వాయిస్ ఆఫ్ బహ్రెయిన్’ అని తనను తాను పిలుచుకునే గల్ఫ్ డైలీ న్యూస్ పత్రిక, పోలింగ్‌ను విజయవంతం చేసినందుకు ఓటర్లకు రాజు అభినందనలు తెలిపారని రాసింది. ఇది 16 పేజీల ట్యాబ్లాయిడ్. రాజు తన సంతోషాన్ని రాజరికపు హుందా తనంతో ప్రకటించారు. ‘మన ప్రియతమ రాజరికం కోసం సాధించిన ఈ ఘన విజయం పట్ల మమ్ము మేమూ, మా విశ్వసనీయ ప్రజలనూ అభినందించుకుంటున్నాము’ అని రాజు పేర్కొన్నారు. యువరాజు, ప్రధానమంత్రి రాజును అభినందనలతో ముంచెత్తారని పత్రికలు నివేదించాయి. అంటే సముద్ర మట్టానికి సమాంతరంగా ఉండే ఈ ద్వీపంలో సామరస్యం పొంగిపొరలుతోందన్న మాట. బహ్రెయిన్‌లో రెండు అమెరికా స్థావరాలు ఉన్నాయి. పైగా ఇది ‘నాటో’ కూటమిలో ప్రముఖ మిత్ర దేశం కూడా! అయితే ఎంత గాలించినా ఒక్కరంటే ఒక్క అమెరికన్ సైనికుడు కూడా కనిపించలేదు. సౌదీ అరేబియన్లు తరచుగా కనిపిస్తుంటారు. 1980లలో చిత్తడినేలపై నిర్మించిన దారిలో అరగంట ప్రయాణిస్తే చాలు సౌదీ పౌరులు ఇక్కడికి చేరు కోవచ్చు. వారాంతపు సందర్శకులుగా వారు తరచూ ఇక్క డికి వస్తుంటారు. సౌదీ రాజరికం తమకు నిరాకరించిన ఆల్కహాల్‌ని బహ్రెయిన్ రాజు అనుమతించారు మరి! చివరగా, ఫోర్ సీజన్స్ షాపులో నేను గత కొన్ని సంవత్సరాలుగా దొరకని చక్కటి బర్గర్‌ని రుచి చూశాను. గతంలో మీరు ఎమిరేట్స్ని సందర్శించి ఉన్నప్పటికీ షాపింగ్, సముద్ర క్రీడలు, ఎడారి, ఆధునిక నగరం వంటి వాటిని ఇంకా ఇష్టపడుతున్నట్లయితే మీ తదుపరి వారాం తపు సెలవుల్లో బహ్రెయిన్ రావడానికి ఎందుకు ప్రయత్నిం చకూడదు? కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ (బహ్రెయిన్ నుంచి రాసిన వ్యాసం) -
కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్
మనమా: ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఆమోదించినట్లుగా బహ్రెయిన్ తెలిపింది. బ్రిటన్ తరువాత ఈ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండవ దేశం ఇదే. వ్యాక్సిన్ ఆమోదంతో కోవిడ్-19 నియంత్రణకు మరింత బలం చేకూరుతుందని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈవో మారియమ్ అల్ జలాహ్మా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యూఎస్ ఔషద దిగ్గజం ఫైజర్ ఇంకా జర్మన్ భాగస్వామి బయోటెక్ ఈ టీకాను ఎప్పుడు ప్రారంభిస్తాయో మనమా పేర్కొనలేదు. సాధారణ ఉపయోగం కోసం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు, వచ్చేవారం నుంచి దీనిని ప్రారంభించాలని చూస్తున్నట్లు బ్రిటన్ బుధవారం తెలిపింది. చదవండి: (వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత) మరోవైపు నవంబర్‌లో బహ్రెయిన్.. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్‌పై ఉపయోగించడాన్ని ఆమోదించింది. బహ్రెయిన్‌లో ఇప్పటికే 87 వేలకుపైగా కేసులు నమోదు కాగా, 341 మంది మరణించారు. ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని బ్రిటన్ శుక్రవారం ప్రకటించింది. కరోనా వైరస్ చైనాలో మొదలయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది మృతి చెందగా, 65 మిలియన్లకిపైగా కరోనా బారినపడ్డారు. చదవండి: (కొన్ని వారాల్లో వ్యాక్సిన్) -
మనతో పాటు ఆ నాలుగు...
నేడు మనం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనతో పాటు కాంగో, కొరియా, బహ్రెయిన్, లీచ్టెన్స్టెయిన్ దేశాలకు సైతం పరాయిదేశ పాలన నుంచి స్వాతంత్య్రం సిద్ధించింది. పాకిస్తాన్ భారత్‌కన్నా ఒక రోజు ముందు ఆగస్టు 14నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కొరియా ఆగస్టు 15ని నేషనల్ లిబరేషన్ డే ఆఫ్ కొరియాగా జరుపుకుంటోంది. 1945, ఆగస్టు 15న జపాన్ అధీనంలోని కొరియా ద్వీప కల్పం నుంచి అమెరికా, సోవియట్ యూనియన్ బలగాలను విరమించుకున్నాయి. నార్త్, సౌత్ కొరియాల రెండింటికీ కామన్ పబ్లిక్ హాలిడే ఆగస్టు 15. మూడేళ్ల అనంతరం కొరియా.. ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. ఇక 1971, ఆగస్టు 15న బహ్రెయిన్ బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 18 దశాబ్దాల పాటు ఫ్రాన్స్ ఆధిపత్యంలో కొనసాగిన తరువాత 1960, ఆగస్టు 15న సంపూర్ణ స్వాతంత్య్రం పొందింది. ప్రపంచంలోనే ఆరవ అతి చిన్న దేశం లిచిన్స్టెయిన్. జెర్మనీ పాలన నుంచి 1866, ఆగస్టు 15న విముక్తి పొందింది. ఆగస్టు 16 లిచిన్స్టెయిన్ రాజు రెండవ ఫ్రాంజ్ జోసెఫ్ పుట్టిన రోజు కావడంతో 1940 నుంచి ఆగస్టు 16ని స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటోంది. -
యోగానే జీవితం
రామారెడ్డి(ఎల్లారెడ్డి): యోగా అనగానే చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం అని అనుకుంటారు.. కానీ అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే ఒక సాధనం, సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం తెలియదు. తనువు, మనస్సు సహా అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా. ఉరుకుల పరుగుల జీవితానికి సాంత్వన చేకూర్చే యోగాను దేశ, విదేశాల్లో ఎందరికో నేర్పుతున్నారు బండి రాములు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన బండి రాములు.. 37 సంవత్సరాల పాటు బహ్రెయిన్‌లో వేల మందికి యోగా శిక్షణ ఇచ్చారు. ప్రముఖ యోగా శిక్షకుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. జీవన విధానంలో యోగాను భాగంగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. చిన్ననాటి నుంచి యోగానే.. రాములుకు చిన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొందరి సలహా మేరకు ఆయన యోగా సాధన చేసి, సమస్యను దూరం చేసుకన్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన జీవితంలో యోగా భాగమై పోయింది. బ్రహ్మంగారి జీవిత చరిత్ర నుంచి యోగా ప్రాముఖ్యతను గ్రహించి బండిరాములు ఈ దిశగా ప్రయత్నం చేసి యోగాను సంపూర్ణంగా నేర్చుకున్నారు. పుణేకు చెందిన ప్రముఖ యోగా గురువు బీకేఎస్ అయ్యంగర్ దగ్గర శిష్యరికం చేశారు. స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి యోగాపై ఆసక్తి కల్పించారు. ఆ తర్వాత బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ 37 సంవత్సరాల పాటు ఎంతో మంది దేశ, విదేశీయులకు యోగా శిక్షణ ఇచ్చాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతత కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మరింత ప్రాచుర్యం కల్పించాలి యోగా సాధనతో అనేక రకాలుగా మేలు జరుగుతుంది. నాకు ఎలాంటి ప్రతిఫలం రాకున్నా అందరికీ యోగా నేర్పిస్తున్నాను. ప్రభుత్వం యోగాకు మరింత ప్రాముఖ్యతనిచ్చి, ప్రాచుర్యం కల్పించాలి. మానసిక ప్రశాంతతకు ఉపయోగపడే యోగాను కేవలం ‘యోగా డే’కే పమితం చేస్తున్నారు. ఉరుకులు పరుగులతో కూడిన నేటి జీవితాలకు ఉపశమనం కలిగించేది యోగానే. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న సగటు జీవికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కల్పించే యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రాచుర్యం కల్పించాలి. – బండి రాములు, యోగా శిక్షకుడు -
గల్ఫ్ సమస్యలపై రాహుల్‌కు వివరణ
బహ్రయిన్ : ప్రవాసీ సమ్మేళన్‌ను గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(గోపియో) ఈ నెల 6 నుంచి 8 వరకూ బహ్రయిన్లో నిర్వహించింది. సమావేశం చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమ్మేళన్‌లో పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, టెలికాం నిపుణుడు శ్యామ్ పిట్రోడా తదితర బృందంతో పాటు, బహ్రయిన్ యువరాజు, ఆర్థిక మంత్రులతో రాహుల్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసి 10 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తెలంగాణ గల్ఫ్ వలసలపై ఒక నివేదికను అందజేశారు. గల్ఫ్ దేశాల సహకారమండలి(గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్-జిసిసి)లోని ఆరు దేశాలలో ప్రవాస భారతీయుల జనాభా 87.64 లక్షలు ఉన్నదని చెప్పారు. వీరందరూ ఎన్నారై ఓటర్లుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలనే ప్రస్తావన వచ్చిందని దేవేందర్ రెడ్డి తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలోని పేజీ నెం.22లో 'ప్రవాసుల సంక్షేమం' పేరిట ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. గల్ఫ్‌లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, కేరళ తరహాలో జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన పథకం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాక పునరావాసం కొరకు, గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ ప్రవాసీలకు న్యాయ సహాయానికి, గల్ఫ్ ప్రవాసీల సంక్షేమం కోసం బడ్జెట్లో ఏటా రూ. 100 కోట్ల నిధులు కేటాయించడానికి, సమగ్ర ఎన్నారై పాలసీ కోసం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం పోరాటం చేస్తుందని వివరించారు. -
ఎడారిని ఎదిరించిన చెట్టు..
ఇది బహ్రెయిన్ దేశం సదరన్ గవర్నరేట్‌లో ఉన్న చెట్టు. వయసు 400 ఏళ్లు. దీని ప్రత్యేకత ఏమిటన్నదే కదా ప్రశ్న. ఈ చెట్టు ఎడారిలో ఉంది. అదీ ఒక్కటే ఉంది! ఈ ఎడారిలో ఇంత భారీ చెట్టు ఉండటమే ఒక వింత. అదీ ఇన్నేళ్లుగా.. అక్కడి ఎడారిలో చిన్నచిన్న తుప్పల్లాంటివి తప్ప.. ఇంత భారీ చెట్టన్నదే లేదట. అందుకే దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తారు.