యోగానే జీవితం | Yoga Is My Life | Sakshi
Sakshi News home page

యోగానే జీవితం

Published Fri, Jul 20 2018 2:04 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Yoga Is My Life - Sakshi

బహ్రెయిన్‌లో యోగా నేర్పిస్తున్న రాములు, ఇన్‌సెట్‌ రాములు (ఫైల్‌)

రామారెడ్డి(ఎల్లారెడ్డి): యోగా అనగానే చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం అని అనుకుంటారు.. కానీ అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే ఒక సాధనం, సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం తెలియదు. తనువు, మనస్సు సహా అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా. ఉరుకుల పరుగుల జీవితానికి సాంత్వన చేకూర్చే యోగాను దేశ, విదేశాల్లో ఎందరికో నేర్పుతున్నారు బండి రాములు.

రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన బండి రాములు.. 37 సంవత్సరాల పాటు బహ్రెయిన్‌లో వేల మందికి యోగా శిక్షణ ఇచ్చారు. ప్రముఖ యోగా శిక్షకుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన.. జీవన విధానంలో యోగాను భాగంగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. 

చిన్ననాటి నుంచి యోగానే.. 

రాములుకు చిన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొందరి సలహా మేరకు ఆయన యోగా సాధన చేసి, సమస్యను దూరం చేసుకన్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన జీవితంలో యోగా భాగమై పోయింది. బ్రహ్మంగారి జీవిత చరిత్ర నుంచి యోగా ప్రాముఖ్యతను గ్రహించి బండిరాములు ఈ దిశగా ప్రయత్నం చేసి యోగాను సంపూర్ణంగా నేర్చుకున్నారు. పుణేకు చెందిన ప్రముఖ యోగా గురువు బీకేఎస్‌ అయ్యంగర్‌ దగ్గర శిష్యరికం చేశారు.

స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి యోగాపై ఆసక్తి కల్పించారు. ఆ తర్వాత బహ్రెయిన్‌ దేశానికి వెళ్లి అక్కడ 37 సంవత్సరాల పాటు ఎంతో మంది దేశ, విదేశీయులకు యోగా శిక్షణ ఇచ్చాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక ప్రశాంతత కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

మరింత ప్రాచుర్యం కల్పించాలి 

యోగా సాధనతో అనేక రకాలుగా మేలు జరుగుతుంది. నాకు ఎలాంటి ప్రతిఫలం రాకున్నా అందరికీ యోగా నేర్పిస్తున్నాను. ప్రభుత్వం యోగాకు మరింత ప్రాముఖ్యతనిచ్చి, ప్రాచుర్యం కల్పించాలి. మానసిక ప్రశాంతతకు ఉపయోగపడే యోగాను కేవలం ‘యోగా డే’కే పమితం చేస్తున్నారు.

ఉరుకులు పరుగులతో కూడిన నేటి జీవితాలకు ఉపశమనం కలిగించేది యోగానే. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న సగటు జీవికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కల్పించే యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రాచుర్యం కల్పించాలి.     – బండి రాములు, యోగా శిక్షకుడు   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement