Bahujana JAC
-
పేదలను బలిగొంటున్న బాబు ప్రచారార్భాటం
తాడికొండ: తన ప్రచారార్భాటంతో పేదల ప్రాణాలను బలిగొంటున్న చంద్రబాబును తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల 827వ రోజు సోమవారం పలువురు మాట్లాడారు. పబ్లిసిటీ పిచ్చితో పేదలకు తాయిలాలు ఇస్తామని ఆశపెడుతూ చంద్రబాబు పెడుతున్న మీటింగులకు వెళ్లిన పేద ప్రజలు అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం సీఆర్డీయేకు భూములు అమ్ముకుని రిటర్నబుల్ ప్లాట్లు పొందిన కులవాదులు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములిచ్చామని చెప్పడం మోసపూరితం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా తయారయ్యాడన్నారు. బహుజనులు 827 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే తమ పచ్చ పత్రికల్లో ప్రచురించకుండా రాష్ట్రంలో కులవాదాన్ని రెచ్చగొడుతున్న మీడియాపై చర్యల కోసం త్వరలో ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బాబు ఆయన ఎల్లో మీడియా, బినామీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
‘ఎంపీ రఘురామను అడుగు పెట్టనివ్వం’
సాక్షి, భీమవరం: దళితుల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి పత్రికలు, టీవీల్లో అవాకులు చవాకులు పేలుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఏపీ బహుజన జేఏసీ నాయకులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అవహేళన చేశారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజు గోబ్యాక్ అని నినదించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ గెలిపించిన పార్టీకే కళంకం తెస్తున్న ఎంపీ.. గతంలో దళితుల పైన, దళిత అధికారుల పైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, శాంతియుతంగా నిరనన తెలియజేస్తామన్నారు. దుండి అశోక్, ప్రశాంత్, బేతాళ కమలాకర్, ఏలేటి న్యూటన్ పాల్గొన్నారు. -
బాబుకు ఇక రాజకీయ సన్యాసమే
తాడికొండ: రాష్ట్రంలో బహుజనుల హక్కులను కాలరాసి వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వారిని అడుగడుగునా అణగదొక్కుతూ కులోన్మాదాన్ని ప్రోత్సహించి లాభపడాలని చూసిన చంద్రబాబుకు ఇక రాజకీయ సన్యాసమే మిగిలిందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 215వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తిరుపతి ఉప ఎన్నికలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబును అక్కడి ఓటర్లు, బహుజనులు ఏకమై బుద్ధి చెప్పారన్నారు. త్వరలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులు రావడం ఖాయమనేది స్పష్టమైందన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇక మూడు రాజధానుల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాధం, నత్తా యోనారాజు, ఈపూరి ఆదాం పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. చదవండి: నిన్ను నమ్మం బాబూ.. జననేత వైపే జనం -
ఖమ్మంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఆర్యవైశ్యుల ర్యాలీ– బహుజన జేఏసీ ధర్నా సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్యులు.. ఆయనకు భద్రత కల్పించాలని బహుజన జేఏసీ వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాలతో బుధవారం ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఐలయ్య రాసిన పుస్తకంలో ఆర్యవైశ్యులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం ఆర్యవైశ్యులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నగరంలోని జెడ్పీ సెంటర్‌కు చేరగా.. అదే సమయంలో బహుజన జేఏసీ నాయకులు ఐలయ్యకు భద్రత కల్పిం చాలని ధర్నా చేపట్టారు. దీంతో ఎదురుపడిన ఇరువర్గాలు నినాదాలు చేసుకున్నారు. ఆర్యవైశ్యుల ర్యాలీలో పాల్గొన్న కొందరు బహుజన జేఏసీ నాయకుల వైపు చెప్పులు చూపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జేఏసీ సభ్యులను పక్కకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఆర్యవైశ్య సంఘానికి చెందిన కొందరు జెడ్పీ కార్యాలయంలోకి రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి.. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.