
సాక్షి, భీమవరం: దళితుల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి పత్రికలు, టీవీల్లో అవాకులు చవాకులు పేలుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఏపీ బహుజన జేఏసీ నాయకులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు.
జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ.. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అవహేళన చేశారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రఘురామకృష్ణరాజు గోబ్యాక్ అని నినదించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ గెలిపించిన పార్టీకే కళంకం తెస్తున్న ఎంపీ.. గతంలో దళితుల పైన, దళిత అధికారుల పైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, శాంతియుతంగా నిరనన తెలియజేస్తామన్నారు. దుండి అశోక్, ప్రశాంత్, బేతాళ కమలాకర్, ఏలేటి న్యూటన్ పాల్గొన్నారు.