తాడికొండ: తన ప్రచారార్భాటంతో పేదల ప్రాణాలను బలిగొంటున్న చంద్రబాబును తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల 827వ రోజు సోమవారం పలువురు మాట్లాడారు. పబ్లిసిటీ పిచ్చితో పేదలకు తాయిలాలు ఇస్తామని ఆశపెడుతూ చంద్రబాబు పెడుతున్న మీటింగులకు వెళ్లిన పేద ప్రజలు అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానిలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం సీఆర్డీయేకు భూములు అమ్ముకుని రిటర్నబుల్ ప్లాట్లు పొందిన కులవాదులు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములిచ్చామని చెప్పడం మోసపూరితం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా తయారయ్యాడన్నారు. బహుజనులు 827 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే తమ పచ్చ పత్రికల్లో ప్రచురించకుండా రాష్ట్రంలో కులవాదాన్ని రెచ్చగొడుతున్న మీడియాపై చర్యల కోసం త్వరలో ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బాబు ఆయన ఎల్లో మీడియా, బినామీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment