బెయిల్ స్కామ్‌లో ప్రధాన నిందితుల అరెస్టు
పలమనేరు/గంగవరం : జిల్లాలో సంచలనం రేకెత్తించిన బెయిల్ స్కామ్‌లో ఇద్దరు ప్రధాన నిందితులను గంగవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో పదిమందిపై కేసు నమోదు చేశారు. గంగవరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ బెయిల్ స్కామ్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చోరీ కేసులో నిందితులైన తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాకు చెందిన ఊతంగిరి రమణ నేతృత్వంలోని 9 మంది బందిపోటు దొంగలను గత ఏడాది అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో బెయిల్ పొందిన నిందితులు తిరిగి కోర్టుకు హాజరుకాకపోవడంతో పలమనేరు జేఎఫ్‌సీఎం కోర్టు ఇటీవలే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో జామీనుదారులైన ఇద్దరికి నోటీసులు ఇచ్చి విచారణ ప్రారంభించారు. వీరిలో అనంతపురం జిల్లా తనకల్లు మండలం బొంతలపల్లెకు చెందిన నరసింహులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించారు. ఇతడు అసలు ప్రభుత్వ ఉద్యోగే కాదని, నకిలీ శాలరీ సర్టిఫికెట్ తయారుచేసి జామీను ఇచ్చినట్లు తేలింది. అలాగే మరో జామీనుదారుడు, తిరుపతిలోని ఓ న్యాయవాది వద్ద గుమస్తాగా పనిచేసే చంద్రగిరికి చెందిన బలరామయ్య సమర్పించిన శాలరీ సర్టిఫికెట్, భూమి రికార్డులు కూడా నకిలీవని తేలింది.
గంగవరం కేసులో నిందితులకు బెయిల్ సమర్పించే విషయంలో చిత్తూరుకు చెందిన సీఎం షఫీఉల్లా అనే న్యాయవాదికి నాగరాజు అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. గంగవరం కేసును విచారించే క్రమంలో పోలీసులు, న్యాయస్థానాలను మోసం చేస్తున్న 12 మంది వివరాలు తెలిసాయి. వివిధ కేసుల్లో బెయిల్ కోసం నిందితులకు జామీను ఇచ్చే విషయంలో నరసింహులు, బలరామయ్య, నాగరాజులతో పాటు తిరుపతికి చెందిన సుబ్రమణ్యం, బ్రహ్మయ్య, శివాజీ, పొట్ట శీన, టీటీడీ ప్రింటింగ్ ప్రెస్ రిటైర్డ్ ఉద్యోగి బలరామయ్య, చెర్లోపల్లె బాషా, చంద్రగిరికి చెందిన రమణతో పాటు రామచంద్రాపురం మండలం ఎన్ఆర్.కమ్మపల్లె ఎంపీపీ స్కూల్ టీచర్ ఆర్.రవికుమార్ కూడా పోలీసులు, న్యాయస్థానాలను మోసగించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ జామీను పత్రాలను తయారు చేసే నరసింహులును ప్రధాన నిందితుడిగాను, నాగరాజును రెండో నిందితుడిగా కేసు పెట్టి అరెస్ట్ చేశామని తెలిపారు. మిగిలిన పదిమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు ఇప్పటిదాకా 20 కోర్టులలో నకిలీ సర్టిఫికెట్లను సమర్పించినట్లు విచారణలో తేలిందని, ఫేక్ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన రబ్బరు స్టాంపు, సీలు, శాలరీ సర్టిఫికెట్ల ప్రింటెడ్ ఫారాలు, టీచర్లకు సంబంధించిన జెరాక్స్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు, నకిలీ ఐడీ కార్డులను సీజ్ చేశామని వెల్లడించారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ చూపిన గంగవరం సీఐ గుమ్మడి రవికుమార్, ఎస్ఐ దిలీప్‌కుమార్‌తో పాటు కానిస్టేబుళ్లను ఆయనఅభినందించారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకలలో కూడా చోటుచేసుకున్న ఈ బెయిల్ స్కాంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు గంగవరం సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ శంకర్, పలమనేరు సీఐ,ఎస్ఐలు సురేంద్రరెడ్డి, లోకేష్, సిబ్బంది పాల్గొన్నారు.