ఇండియా ఎదురుచూస్తోన్న బైక్..
ముంబై: షోరూమ్స్‌లో శాంపిల్స్ డిస్ప్లే చేసినప్పటి నుంచే చర్చనీయాంశమైన బైక్ "బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160". అనతికాలంలోనే "ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ బైక్"గా వార్తల్లో నిలిచింది. దేశీ కంపెనీ బజాజ్ రూపొందించిన ఎన్ఎస్ 160ని మొదట టర్కీలో, ఆ తర్వాత ఇండోనేసియా, మరికొన్ని ఆసియాదేశాల్లో విడుదలేశారు. అక్కడ ఈ బైక్ టాప్సేల్స్ సాధించింది. ఇక ఆలస్యం చేయకుండా ఎన్ఎస్ 160ని జులైలోనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది బజాజ్ ఆటో సంస్థ.
చూడటానికి ఎన్ఎస్ 160.. గతంలో వచ్చిన పల్సర్ ఏఎస్ 150 మోడల్ మాదిరే ఉటుంది కానీ హార్స్పవర్ ఎక్కువ. స్టైలింగ్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్ 200, 220 ఎఫ్లను పోలి ఉంటుంది. అయినాసరే ఆటోమొబైల్ నిపుణులు ఎన్ఎస్ 160కు భారీ స్థాయిలో రేటింగ్స్ ఇవ్వడం గమనార్హం. ఎయిర్ ఆయిల్ కూల్డ్160.3 క్యూబిక్ కెపాసిటీ(సీసీ), 5స్పీడ్ గేర్ బాక్స్, 17పీఎస్, 13 ఎన్ఎంల సింగిల్ సిలిండర్ మోటర్, 17 ఇంచుల టైర్లు, 240ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 ఎంఎం రియర్ డ్రమ్ బ్రేక్.. తదితర ఫీచర్లున్నాయి ఎన్ఎస్ 160లో.
జులై మూడో లేదా చివరి వారంలో దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ షోరూమ్‌లలో పల్సర్ ఎన్ఎస్160 అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్స్‌షోరూమ్‌లో దీని ధర కనిష్టంగా రూ.80వేల నుంచి గరిష్టంగా రూ.84 వేల వరకు ఉండనుంది. యమహా ఎఫ్‌జెడ్, సుజుకి గిక్సర్, అపాచీ పోటీ మోడళ్లకు ధీటుగా బజాజ్ ఎన్ఎస్ 160ని రూపొందించింది.