బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు!
నిజామాబాద్: నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు. మాస్ లీడర్‌గా పేరుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. సిరికొండ మండలం చీమన్‌పల్లికి చెందిన ఆయన తొలుత పోలీస్ పటేల్‌గా పనిచేశారు. అనంతరం 1981లో చీమన్‌పల్లి సర్పంచ్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1987లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికై న ఆయన 1992లో సిరికొండ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1993లో రాష్ట్ర ఎస్ఎఫ్సీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతరం రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్టీసీ చైర్మన్‌గా కూడా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో మంచి పేరు ఉంది.
ఎంపీ నియోజకవర్గంలో మున్నూరుకాపు ఓట్లు ఎక్కువగా ఉండడం.. ఆయన కూడా ఇదే సామాజిక వర్గం కావడంతో బీఆర్ఎస్ అధినేత బాజిరెడ్డి వైపు మొగ్గుచూపారు. ఆయనకు టికెట్ కేటాయించడంతో జిల్లాలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బాజిరెడ్డి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు.
‘జహీరాబాద్’ అభ్యర్థిగా అనిల్‌కుమార్..
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. గాలి అనిల్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన గాలి అనిల్‌కుమార్ పటాన్చెరు నియోజక వర్గంలో స్థిరపడ్డారు. కాగా ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ లను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి చదవండి: వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు!